Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 02:35AM

ప్రజారక్షణ కోసమే గిరి జాతర


వెంకటగిరి: వెంకటగిరి పట్టణంలో 1917లో కలరా వ్యాపించింది. ప్రజలు మృత్యువాత పడ్డారు. వలసబాట పట్టారు. ఆ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలన్న ఉద్దేశంతో నాటి వెంకటగిరి రాజాలు శీతలయాగం చేయించి ఊరు నలుమూలల్లో శీతలరాళ్లు నాటించారు. కలరా తగ్గుముఖం పట్టి ప్రశాంతత చేకూరిందని పెద్దలు చెబుతారు. నాటి నుంచి క్రమం తప్పకుండా ఏటా వినాయక చవితి తరువాత మొదటి బుధవారం తొలిచాటు, రెండో బుధవారం రెండో చాటు, తదుపరి ఆదివారం జాతరలో భాగంగా ఘటోత్సవం, మూడో బుధ, గురువారాల్లో పోలేరమ్మ జాతర, నిమజ్జనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 1714లో కూడా ఈ జాతర జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. అప్పటిదాకా రాజాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాతర బాధ్యతలను 1992లో దేవాదాయ శాఖ వారికి అప్పగించారు. అప్పట్లో అమ్మవారి ప్రతిమను వెంకటగిరి చెరువు నుంచి తెచ్చిర బంకమట్టి, పసుపుతో తయారు చేసి బుట్టలో పెట్టి ఊరేగింపు అనంతరం నిమజ్జనం చేసేవారు. తొలిచాటు నుంచి పట్టణంలో ఏ శుభకార్యం చేపట్టకూడదన్నది ఆనవాయితీ. నేటికీ అదే సంప్రదాయాన్ని కొనసాగుతోంది. ఈ జాతర మతసామరస్యాలకు ప్రతీకగా పేరగాంచింది. దేశవిదేశాల నుంచికూడా భక్తులు హాజరవుతారు.
జాతర నిర్వహణ
బుధవారం అమ్మవారి పుటిల్లుగా భావించే కుమ్మరి ఇంట వెంకటగిరి చెరువు నుంచి తెచ్చిన బంకమట్టితో పసుపు కలిపి అమ్మవారి ప్రతిమను తయారు చేస్తారు. ఈ ప్రతిమను భక్తుల దర్శనార్థం కొలువు దీరుస్తారు. అర్ధరాత్రి సమయానికి ఈ ప్రతిమకు ముసుగు కప్పి భుజాలపై పెట్టుకుని అత్తవారింటికి తీసుకెళతారు. కాంపాళెంలోని అమ్మవారి అప్పజెల్లెళ్లుగా భావించే గాలిగంగల వద్ద ఓ గొర్రెను బలి ఇచ్చి అమ్మవారి ప్రసాదంగా పంపిణీ చేస్తారు. గాలిగంగలు అమ్మవారికి అత్తవారింట స్వాగతం పలుకుతారు. అక్కడ బద్దె గొర్రెను నరికి అమ్మవారికి కళ్లు, దిష్టిచుక్క పెట్టి విశేష అలంకారం చేస్తారు. అక్కడి నుంచి చప్పరంపై అమ్మవారి విగ్రహాన్ని ఉంచి ఊరేగింపుగా గురువారం తెల్లవారుజాముకు ఆలయం వద్ద భక్తుల దర్శనార్థం ఉంచుతారు. బుధవారం అమ్మవారికి భక్తులు వివిధ రకాల మొక్కులు చెల్లిస్తారు. అందులో భాగంగా కోళ్లు కోయడం, వేయికళ్ల దుత్తల్లో పిండిదీపాలను ఉంచి చిన్నారులు తలపై పెట్టుకుని నాలుగుకూడళ్లలో వాటిని పగులకొట్టడం, ఆశాదుల తప్పెట్లతో చీరలపై నడుస్తూ మడిభిక్ష ఎత్తడం, నవధాన్యాల మొలకలను అమ్మవారికి సమర్పించుకోవడం చేస్తారు. గురువారం బలి దున్నపోతును అమ్మకు బలి ఇచ్చి ఆ రక్తంతో పొలికుండల్లోని అన్నంతో కలిపి ఊరు పొలిమేరల్లో చల్లుతారు. ఇలా చేస్తే పట్టణానికి చీడపీడల నుంచి విముక్తి కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. అనంతరం అమ్మవారి ప్రతిమను చప్పరంపై ఉంచి ఊరేగింపుగా తీసుకెళ్లి శివాలయం పక్కనున్న కైవల్యానదిలో నిమజ్జనం చేస్తారు. అసభ్యకర పదజాలతో అమ్మవారిని తిడుతూ ప్రతిమ మట్టిని భక్తులు సేకరిస్తారు. ఈ మట్టిని ఇళ్లల్లో పెట్టుకుంటే కష్టాలు తొలగుతాయన్నది వారి నమ్మకం. ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జాతర నిర్వహించడం ఆచారం, సంప్రదాయాంగా వస్తూవుంది.