Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 02:04AM

కెరీర్‌ ఉచ్ఛస్థితిలో రిటైర్మెంట్‌


దిగ్గజాల ట్రెండ్‌ ఫాలో అవుతా
బాధ్యతాయుత తండ్రిగా ఉంటా: పేస్‌

బెంగళూరు: విశ్వవిఖ్యాత క్రీడా దిగ్గజాలు పీలే, మహమ్మద్‌ అలీ తరహాలో కెరీర్‌లో అత్యున్నతస్థాయిలో ఉన్నప్పుడు రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకోవాలనుం దని భారత టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ చెప్పాడు. రియో ఒలింపిక్స్‌ తనకా అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నానని పేస్‌ అన్నాడు. ‘మెకేల్‌ జోర్డాన్‌, కార్ల్‌ లూయిస్‌, రాడ్‌ లెవర్‌, పీలే, మహ్మద్‌ అలీ లాంటి మేటి ఆటగాళ్లు తమ కెరీర్‌ గొప్ప స్థితిలో ఉన్నప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటించారు. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే నా కెరీర్‌లో శిఖరాగ్రస్థాయికి చేరినట్లే. వాళ్లు అనుసరించిన బాటలోనే నేనూ నడుస్తాన’ని ఓ ఇంటర్వ్యూలో పేస్‌ తెలిపాడు.
కాగా తన కుమార్తె అయానా సంరక్షణ బాధ్యతల కోసం సహజీవన భాగస్వామి రియాతో చేస్తున్న న్యాయపోరాటంపైనా పేస్‌ స్పందించాడు. ‘టెన్నిస్‌ను ఎంతగా ప్రేమిస్తానో.. నా కుమార్తెనూ అంతే. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. నా తల్లిదండ్రులు నాకు వెన్నుదన్నుగా ఉన్నారు. నన్నెంతో అభిమానించే టీమ్‌ నా వెనుక ఉంది. ఎంతగానో ప్రేమించే కూతురు ఉండడం నా అదృష్టం. బాధ్యతగల త్రండిగా ఆమెకు మార్గదర్శిగా ఉంటాన’ని అన్నాడు.