Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 01:41AM

చోడవరం ఎమ్మెల్యే, టీడీపీ నేతల వల్ల ప్రాణహాని


రోలుగుంట: చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, మండల టీడీపీ అధ్యక్షుడు గండి సింహాద్రి, జానకిరాంపురం ఎంపీటీసీ మాజీ సభ్యుడు లగుడు సత్తిబాబు తదితరుల వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ జానకిరాంపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు లగుడు కృష్ణంనాయుడు తదితరులు సోమవారం జిల్లా ఎస్పీ, నర్సీపట్నం ఎఎస్‌పీ, కొత్తకోట సీఐ, రోలుగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు లగుడు కృష్ణంనాయుడు, ఆదపురెడ్డి రమణ తదితరుల కథనం ప్రకారం టీడీపీకి చెందిన జానకిరాంపురం గ్రామ సర్పంచ్‌ లగుడు లక్ష్మీకళ భర్త లగుడు సత్తిబాబు వర్గీయులకు సుమారు 10 ట్రాక్టర్లు ఉన్నాయి. వాటి ద్వారా తమ గ్రామ సమీపంలో గల సర్పా నది నుంచి గతంలో ఇసుకను తరలిస్తుండగా కృష్ణంనాయుడు వర్గానికి చెందిన జాగడ్డి రమణ తదితరులు రోలుగుంట తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టారు. అప్పటి నుంచి తమ వర్గీయులపై సర్పంచ్‌ భర్త లగుడు సత్తిబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ నెల 6న వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అశ్లీల నృత్యాలతో కూడిన రికార్డింగ్‌ డ్యాన్స్‌ను లగుడు సత్తిబాబు ఏర్పాటు చేసి ఒక పథకం ప్రకారం వారే పోలీసులకు ఫిర్యాదు చేశారని కృష్ణంనాయుడు వర్గీయులు చెప్పారు. గ్రామంలోకి వచ్చిన పోలీసులపై వారి మనుషులతో రాళ్లు విసిరించారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై తప్పుడు రిపోర్టు ఇచ్చి కేసు నమోదు చేయించారని, తమపై కేసులు నమోదు చేయాలంటూ ఈ నెల 13న చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు పత్రికాముఖంగా పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో తమపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. అసలు నేరస్థులు, దొంగతనంగా ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిని విడిచిపెట్టి తమపై అన్యాయంగా కేసులో ఇరికించారన్నారు. ఎమ్మెల్యే రాజు, మండల టీడీపీ అధ్యక్షుడు గండి సింహాద్రి, జానకిరాంపురం ఎంపీటీసీ మాజీ సభ్యుడు లగుడు సత్తిబాబు, గ్రామానికి చెందిన ఆదపురెడ్డి బుల్లినాయుడు, కూండ్రపు రాజుబాబు, గొల్లు నర్సింగరావు, ఆదపురెడ్డి కన్నదొర, లాలం సూర్యనారాయణమూర్తి తదితరుల వలన తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని వీరు ఎస్సీని, ఇతర పోలీసు అధికారులను కోరారు.