Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 01:41AM

పిడుగు పడి మహిళా కూలీ మృతి, మరో మహిళకు గాయాలు


కశింకోట : మండలంలో సోమవారం మూడుచోట్ల పిడుగులు పడ్డాయి. వరినాట్లు వేయడానికి వెళ్లిన మహిళా కూలీపై పిడుగుపడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో కూలీ గాయపడింది. మరోచోట ఒక గేదె, ఒక ఆవు చనిపోయాయి. సోమవారం ఉదయంనుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాసింది. అనంతరం ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అదే సమయంలో గవరపేట మధ్యవీధికి చెందిన 14 మంది శారదా నది అవతల వరినాట్లు వేస్తున్నారు. మెరుపులతో పిడుగులు పడుతుండడంతో ఎనిమిది మంది గట్టుపైకి వచ్చారు. మిగిలిన వారు పొలంలోనే వున్నారు. వీరిలో పెంటకోట జయలక్ష్మిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమీపంలో వున్న పొలమరశెట్టి సత్యవతి గాయపడింది. మృతురాలు జయలక్ష్మికి భర్త అప్పలనాయుడు, కుమారులు శ్రీను, నాగేశ్వరరావు, కుమార్తె దుర్గ ఉన్నారు. మృతదేహాన్ని చూసి భర్త, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. సంఘటనా స్థలానికి తహసీల్దార్‌ రమామణి, ఆర్‌ఐ భాస్కరరావు, వీఆర్వో మూర్తి, ఏఎస్‌ఐలు వెంకటరమణ, త్రినాథ్‌ వెళ్లి, వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. కశింకోట పోలీసులు కేసు నమోదు చేశారు.
గేదె, ఆవు మృతి
శారదా నది అవతల నడిపల్లి వారి పొలాలవద్ద పిడుగుపడడంతో మరిశా నూకరాజుకు చెందిన పాడి గేదె చనిపోయింది. దీని విలువు 40 వేల రూపాయలు ఉంటుందని బాధితుడు చెప్పారు. కశింకోట-వెదురుపర్తి రహదారిలో శారదా నది అవతల పశువుల పాక వద్ద పిడుగుపడడంతో శిష్టి అప్పలనాయుడుకు చెందిన ఆవు చనిపోయింది. దీని విలువ 35 వేల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు.