desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 15 2016 @ 02:22AM

భావోద్వేగ సంక్రాంతి

  • రాజధాని గ్రామాల్లో పంటలేని తొలి వేడుకలు..
  • ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చినప్పుడే పండగంటున్న రైతులు
 
తాడికొండ: వరండాలో పంట ఉత్పత్తులు.. వాకిట్లో అందమైన రంగవల్లులు.. వీధుల్లో హరిదాసుల సంకీర్తనలు- గంగిరెద్దుల విన్యాసాలు.. కూడళ్లలో భోగి మంటలు.. ఊరి వెలుపల కోడి పందాలు.. ఇంటింటా పిండి వంటల సువాసనలు.. ఇల్లంతా సందడిగా బంధువులు.. కొత్త అల్లుళ్లు-కొంటె మరదళ్ల వేళాకోళాలు.. సంక్రాంతి అంటే సందడే సందడి!! అలాంటి సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటేలా చేసుకోవాల్సిన నూతన రాజధాని గ్రామాలప్రజలు ఈసారి పండుగను భావోద్వేగాల నడుమ జరుపుకొంటున్నారు. గత సంక్రాంతికి ముందు తుళ్లూరు కేంద్రంగా 29గ్రామాలను ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణ ప్రతిపాదనపై ఆయా గ్రామాల ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. అనంతరకాలంలో అనేక పరిణామాల నడుమ మరో ఏడాది గడిచింది. రాజధానివాసులు మరో సంక్రాంతిని జరుపుకొంటున్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకలు నిరుపేదలకు సంతోషానిచ్చినా.. వ్యవసాయ పనులు లేక కూలీలు, పొలాలు వదులుకున్నా.. స్థిరాస్తి అందక రైతు కుటుంబాల్లో ఆవేదన తాండవిస్తోంది. ఊళ్ల జోలికి పోకుండా, హామీల ప్రకారం ప్లాట్లు కేటాయిస్తేనే రాజధాని రైతులకు నిజమైన సంక్రాంతి అని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.
 
అప్పుడలా.. ఇప్పుడిలా..
గత ఏడాది.. రాజధాని ప్రకటించాక వచ్చిన తొలి సంక్రాంతిని ఆయా గ్రామాల రైతులు భవిష్యత్‌పై గంపెడాశతో ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. సరిగ్గా సంక్రాంతి సమయంలో రాజధానికి భూములిచ్చేసిన చాలామంది.. పొలాల్లో ఆఖరి పంటను విక్రయించుకకున్నారు. గడిచిన ఏడాదిలో రాజధాని గ్రామాల్లో సీఆర్‌డీఏ నుంచి కౌలు చెక్కులు అందుకున్న 90 శాతం మంది రైతులు.. ఆ తర్వాత పంటలు వేయలేదు. దీంతో.. గత తొలకరికి ముందే రైతుల ఇళ్లల్లో పంట ఉత్పత్తులు కనుమరుగయ్యాయి. రాజధాని ప్రస్తావన తర్వాత రైతుల లోగిళ్లలో సంక్రాంతికి పంటలు లేకపోవడం ఇదే ప్రథమం. పంటలు లేని లోటు తప్ప మిగతా పండుగ యథాత థంగా సాగుతున్నాయి. రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం నివాస, వాణిజ్య ప్లాట్ల కేటాయింపు విషయంలో నెలకొన్న సందిగ్ధత వల్ల సామాన్య రైతులు ఆవేదనకు గురవుతున్నారు. పండగ ప్రస్తావన తెస్తే.. పైకి చెప్పుకోలేని బాధతో భావోద్వేగానికి లోనవుతున్నారు. రైతుల ఇళ్లల్లో పండుగ వాతావరణం అంతగా కన్పించడం లేదు. కాకపోతే మరీ అలా నిస్తేజంగా ఉండలేక.. ‘పండుగ కదా ఏదో ఒకటి చేసుకుని తిందాం’ అన్నట్టుగా ఉంది పరిస్థితి.
 
పనులు లేకపోతే.. పండుగేముంది: కె.మధు, ఉద్దండరాయునిపాలెం
రాజధాని గ్రామాల్లో వ్యవసాయ పంపులు, మోటార్లు మరమ్మతులపై ఆధార పడి బతుకుతున్నాం. ఇద్దరు పిల్లల్ని చదివించాలి. ఇప్పుడు మోటార్ల పనులు లేకుండా పోయాయి. పనులు లేకపోతే.. పండగ ఆనందం ఏముంటుంది.

ఊరిని కదిలిస్తే ఒప్పుకోం: కొల్లిమర్ల సాంబయ్య, ఉద్దండరాయునిపాలెం
రాజధాని రావడం గొప్ప అదృష్టం. దీనివల్ల మాగ్రామం సంతోషంగానే ఉంది. కానీ మాస్టర్‌ ప్లాన్‌లో ఊరిని కదిలిస్తే.. అంగీకరించం. మా రైతులకు ఇచ్చిన హామీలు నెరవెర్చితే అదే మాకు నిజమైన సంక్రాంతి.

ప్లాట్లు ఇస్తేనే.. చంద్రన్న కానుక: తాడికొండ కోటేశ్వరరావు, ఉద్దండరాయునిపాలెం
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లను త్వరగా ఇస్తేనే చంద్రన్న కానుకగా భావిస్తాం. ఊళ్లను కదిలించకుండా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసుకుంటే.. మాకు నిజమైన సంక్రాంతి పండుగ వచ్చినట్టుగా భావిస్తాం.