Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 15 2016 @ 00:35AM

సచివాలయ టెండర్లకు స్వాగతం

  • జూన్‌కల్లా పూర్తి చేయాలని లక్ష్యం
  • అనుసంధాన రోడ్ల నిర్మాణానికీ చర్యలు
 
విజయవాడ, జనవరి 14(ఆంధ్రజ్యోతి): వెలగపూడిలో నిర్మించనున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సీఆర్డీయే గురువారం టెండర్లను ఆహ్వానించింది. సుమారు 26 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనున్న ఈ సముదాయాన్ని ఈ ఏడాది జూన కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో, ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ విధానంలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన విషయం విదితమే. రూ.180 కోట్ల అంచనా వ్యయంతో ప్రస్తుతం ఈ భవనాలను జి+1 వరకే నిర్మించనున్నప్పటికీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరో 6 అంతస్తులు వేసుకునేలా డిజైన్లను రూపొందించనున్నారు. 6 బ్లాకులుగా తాత్కాలిక సచివాలయా న్ని నిర్మిస్తారు. ఈ నిర్మాణ వ్యయంలో రూ.90 కోట్లను సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని హడ్కో నుంచి రుణంగా తీసుకోవాల్సిందిగా సీఆర్డీయేను ఆదేశించింది.. ఈ రుణాన్ని తాత్కాలిక సచివాలయంలో కొలువు దీరనున్న వివిధ ప్రభుత్వ శాఖలు చెల్లించే అద్దెలతో తిరిగి తీర్చాలని కూడా నిర్దేశించినట్లు తెలుస్తోంది. తాత్కాలిక సచివాలయాలన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 4 నెలల్లోగా అంటే.. జూన ప్రథమార్ధానికల్లా పూర్తి చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగైతేనే జూన్‌ 2 తర్వాత రాజధాని ప్రాంతం నుంచే పాలనను సాగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆకాంక్ష నెరవేరుతుందని సీఆర్డీయే భావిస్తున్నది. దీనిలో భాగంగా గురువారం టెండర్లు పిలిచింది. వాటిని సమర్పించేందుకు 3 వారాల గడువు ఇచ్చింది. గడువు ముగిసిన వెంటనే అర్హమైన సంస్థను ఎంపికచేసి, పనులను చేపట్టే అవకాశం ఇవ్వనుంది. టెండర్ల దాఖలుకు ఫిబ్రవరి 6ను ఆఖరు తేదీగా ప్రకటించారు. కాగా, తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి టెండర్లను తక్షణమే ఆహ్వానించాలని ముఖ్యమంత్రి గురువారం ఉదయమే సీఆర్డీయే ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో గురువారమే టెండర్‌ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఇందుకోసం భోగి పండుగ దృష్ట్యా సీఆర్డీయే ప్రధాన కార్యాలయానికి సెలవు అయినప్పటికీ చీఫ్‌ ఇంజినీర్‌ డి.కాశీవిశ్వేశ్వరరావు తదితర ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు టెండర్‌ నియమ నిబంధనలను రూపొందించడంలో నిమగ్నమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టెండర్‌ను గురువారమే పత్రికలకు విడుదల చేయాలనే ఉద్దేశంతో శ్రమించారు. కాగా, తాత్కాలిక సచివాలయానికి అనుసంధానంగా విజయవాడ, గుంటూరు, మంగళగిరి తదితర ప్రాంతాల నుంచి జూన్‌కల్లా పక్కా రహదారులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.