Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 14 2016 @ 11:11AM

ఇడుపులపాయను చంద్రబాబు ఎందుకు సందర్శించారు ?

ఇడుపులపాయ అంటే వైఎస్‌ కుటుంబ ప్రతిష్టకి నిదర్శనం. ఇడుపులపాయ అంటే వైఎస్‌కి ఎంతో ఇష్టం. సొంత జిల్లాకు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఇడుపులపాయని సందర్శించేవారు. అక్కడే నిద్రించేవారు కూడా! ఇప్పుడు తొలిసారిగా ఇడుపులపాయలో అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు వైఎస్ వ్యవసాయక్షేత్రాన్ని క్షుణ్ణంగా ఎందుకు పరిశీలించారు..? దీని గురించి రాజకీయవర్గాలు ఏమని చెవులు కొరుక్కుంటున్నాయి?
 
ఇడుపులపాయ గురించి తెలియని తెలుగువారు ఉండరు. కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం, వేంపల్లె మండల పరిధిలో ఇడుపులపాయ అనే గ్రామం ఉంది. అక్కడి శేషాచలం అడవి అంచున ఉన్న ఇడుపులపాయలోనే వైఎస్ కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రం ఉంది. వైఎస్ తండ్రి రాజారెడ్డి సంపాదనగా చెప్పుకునే ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రమంటే రాజశేఖర్‌రెడ్డికి ఎంతో ఇష్టం. ఇక్కడి ప్రకృతి, పరిసరాలంటే ఎనలేని మక్కువ. అందుకే కావచ్చు... ముఖ్యమంత్రి అయ్యాక ఎంత బిజీగా ఉన్నప్పటికీ నెలకు ఒక్కసారైనా వైఎస్‌ తన సొంత జిల్లాకు వచ్చేవారు. సీఎంగా ఉన్న కాలంలోనే ఇడుపులపాయలో ఒక గెస్ట్‌హౌస్, రెండు ఇళ్లు నిర్మించారు. ఇక్కడికి వచ్చినప్పుడు రాత్రిపూట ఇడుపులపాయ వ్యవసాయక్షేత్రంలోనే నిద్రించేవారు. ఉదయాన్నే రైతు పాత్రలోకి మారిపోయేవారు. పొలంగట్లపై తిరుగుతూ ఏఏ పొలంలో ఏ పైరు వేశారు... ఎంతెంత ఆదాయం వస్తోంది తదితర వివరాలను వ్యవసాయ క్షేత్రం మేనేజరును అడిగి తెలుసుకునేవారు. ఈ వ్యవసాయ క్షేత్రానికి ఆయన ఎంత ప్రాధాన్యమిచ్చేవారంటే... తాను చనిపోతే ఇక్కడే అంతిమ సంస్కారాలు చేయాలని కుటుంబ సభ్యులకు పదేపదే చెప్పేవారట. ఈ కారణంగానే వైఎస్‌ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు ఆయన కోర్కెని నెరవేర్చారు.
 
ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం సంపాదించిన భూములపై గతంలో అనేక ఆరోపణలొచ్చాయి. వైఎస్‌ తండ్రి రాజారెడ్డి పేదవారిని బెదిరించి అసైన్డ్‌ భూములను లాక్కున్నారనీ, మరికొన్ని భూములను తులమో, ఫలమో ఇచ్చి రాయించుకున్నారనీ, అటవీ భూములను సైతం ఆక్రమించుకున్నారనీ రాజకీయ ప్రత్యర్థులు ఏకరువుపెట్టేవారు. ఆ భూములనే ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నారనీ లెక్కలు గట్రాలు కూడా చూపించేవారు. ఇప్పటికే మీకు విషయం బోధపడి ఉంటుంది. ఇడుపులపాయ అనేది చిన్నాచితకా వ్యవసాయ క్షేత్రం కాదు. ఇందులో సుమారు 11 వందల ఎకరాల భూములు వైఎస్‌ కుటుంబానికి సొంతం.
 
వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక తమపై ఉన్న ఆరోపణలకు తావులేకుండా చేయాలనుకున్నారు. తదనుగుణంగా, ఇడుపులపాయ వ్యవసాయక్షేత్రంలో 300ల ఎకరాలను అటవీభూమిగా గుర్తించి ఆ శాఖకే దానిని అప్పగించారు. మరో 330 ఎకరాలను ట్రిపుల్ ఐటీకి, 50 ఎకరాలను నెమళ్ల పార్కుకు కేటాయించారు. మిగిలిన 300 ఎకరాలకు పైగా ఉన్న భూములు మాత్రమే ఇడుపులపాయ క్షేత్రంలో వైఎస్ కుటుంబ ఆధీనంలో ఉన్నాయి. ఇవి వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లమీద ఉన్నట్లు సమాచారం.
 
ఇక తాజా అంశంలోకి వస్తే... జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రిపుల్ ఐటీకి వచ్చారు. అయితే హెలికాఫ్టర్ ట్రిపుల్ ఐటీ హెలిప్యాడ్‌లో దిగడానికి ముందు చంద్రబాబు రెండు, మూడు రౌండ్లు ఇడుపులపాయ చుట్టూ చక్కర్లు కొట్టారట. ఆ వ్యవసాయక్షేత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారట. ఇప్పుడు ఈ విషయం గురించే ఆ ప్రాంత ప్రజలు తెగ మాట్లాడుకుంటున్నారు. వైఎస్ అంత్యక్రియల రోజు ట్రాఫిక్ జామ్ వల్ల చంద్రబాబు ఇడుపులపాయకి రాలేక వెనుదిరిగిన సంగతి తెలిసిందే! కనుక తొలిసారిగా ఇడుపులపాయకు వచ్చిన బాబు వైఎస్ సమాధిని, వారి వ్యవసాయ భూములను పరిశీలించారని కొందరు అనుకుంటున్నారు.
 
ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో అసైన్డ్‌ భూములు ఏమైనా ఉన్నాయా..? వైఎస్ కుటుంబం ఆక్రమించుకున్న భూమి ఎంత..? ప్రస్తుతం ఇందులో అటవీ భూములు ఏమైనా ఉన్నాయా? అని చంద్రబాబు జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారన్నది మరొక వాదన! ఒకవేళ ఈ వ్యవసాయక్షేత్రంలో అలాంటి భూములు ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనీ, అందుకే ముఖ్యమంత్రి ఇడుపులపాయను క్షుణ్ణంగా హెలికాఫ్టర్‌లో తిరుగుతూ వీక్షించారనీ ఈ ప్రాంత వాసులలో ఇంకొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇందులో ఎవరి వాదనలో నిజముందో ఎవరికెరుక..?!