Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 14 2016 @ 01:13AM

హోదాపై టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి: బొత్స

హైదరాబాద్‌, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదాపై తెలుగుదేశం ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెబుతోందని, దానిపై చంద్రబాబు ప్రభుత్వం మౌనం దాల్చుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో స్పష్టం చేయాలని చంద్రబాబును సత్తిబాబు ప్రశ్నించారు. హోదా లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయని అడిగారు. చంద్రబాబు హయాంలో ఏనాడైనా రూ.1000 కోట్ల విలువైన పరిశ్రమలైనా వచ్చాయా అని ప్రశ్నించారు. గతంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంతో చంద్రబాబు లాలూచీ పడ్డారని సత్తిబాబు ఆరోపించారు. సింగపూర్‌ కంపెనీల పేరుతో దోపిడీ జరుగుతోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారని అన్నారు. ఇంకా మాటలతోనే మభ్యపెడుతూ.. ప్రజలను మోసపుచ్చుతారా అని అడిగారు. రాష్ట్రంలో పరిశ్రమల రాకకు అనువైన వాతావరణం, వెసులుబాటు కల్పించాల్సి ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో పలు పారిశ్రామిక సమ్మిట్‌లు జరిగాయని, వాటిలో ఎన్ని కార్యరూపం దాల్చాయని సత్తిబాబు నిలదీశారు. నాలుగు నెలల కిందట చైనా వెళ్లారని, సుమారు 9000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు జరిగాయన్నారని, అవేమయ్యాయని ప్రశ్నించారు.