Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 13 2016 @ 09:21AM

టీఆర్‌ఎస్‌లో ఆగని చేరికలు

  • ఆశావహుల్లో గుబులు 
  • మాజీలకు టికె ట్‌ దక్కేనా...? 
  • రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మెదలైనా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది. నగరంలో ఓ వైపు ప్రచారం నిర్వహిస్తున్న నేతలు, మరో పక్క బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. కర్మన్‌ఘాట్‌లో మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌రెడ్డిల సమక్షంలో మాజీ కార్పొరేటర్‌లు గజ్జెల సుష్మ, సామ రమణారెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి సోమవారం టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే స్థాయిలో పలు డివిజన్లలో నేతల చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుపార్టీల నుంచి 35 మంది మాజీకార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌ పార్టీ కండువాలు కప్పుకున్నారు. పలు పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో ఉద్యమ సమయంలో పనిచేసి, కార్పొరేటర్‌ టికెట్‌ అశిస్తున్న అభ్యర్థుల గుండెల్లో గుబులు మొదలైంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే నుంచి పార్టీలో పనిచేస్తున్న నేతలను కాదంటూ కొత్త వాళ్లకు టికెట్‌ ఇస్తే ఏంచేయాలంటూ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒక్కో డివిజన్‌లో ఇద్దరి నుంచి ముగ్గురి వరకు ఆశావహులు ఉండటంతో పలు డివిజన్లలలో అభ్యర్థుల ఎంపిక కొంత ఇబ్బందిగా మారింది.

ప్రచారంలో ఉత్సాహం... అభ్యర్థుల్లో టెన్షన్‌
గ్రేటర్‌ వ్యాప్తంగా ఇప్పటికే డివిజన్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్న డివిజన్‌ నేతలకు టికెట్‌ దక్కెనా అనే టెన్షన్‌ పట్టుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో అశావహుల సంఖ్య ఎక్కువగానే ఉందని ఓ సీనియర్‌ నాయకుడు తెలిపారు. గతంలో అభ్యర్థులు లేరని అనుకుంటే ఇప్పుడు ఎక్కువమంది అభ్యర్థులు పోటీపడుతున్నారనే పరిస్థితులు వచ్చాయన్నారు. అభ్యర్థుల ఎంపిక కమిటీ చేస్తుందని టికెట్‌ ఎవరికి వస్తుందో పేర్లు ప్రకటించే వరకు తెలియని పరిస్థితులుండటంతో నేతలు ఉత్కంఠకు గురవుతున్నారు. మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో పార్టీలో చే రేందుకు పలుపార్టీల నేతలు ఉత్సాహం చూపడంతో నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు కేటీఆర్‌ను తమ నియోజకవర్గాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
 
రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
ఎన్నికల అభ్యర్థుల జాబితా రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. అభ్యర్థుల ఎంపిక కమిటీకీ ఇప్పటికే అభ్యర్థుల బయోడేటాలు, సర్వేల రిపోర్టులు పరిశీలించడంతో పాటు మంగళవారం భేటీ అయిన కమిటీ సభ్యులు అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. దీంతో సంక్రాంతి పండుగముందే అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు.