desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 00:34AM

షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు స్వయం పాలనాధికారాలను పెంచాలి


- కేంద్ర పంచాయతీరాజ్‌ వ్యవహారాల శాఖ
సంయుక్త కార్యదర్శి నీరజా శేఖర్‌

రాజేంద్రనగర్‌/ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 : షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ విస్తరణ చట్టం ద్వారా (పీసా- 2011) స్వయం పాలనా అధికారాలను పెంచాల్సిన అవసరముందని కేంద్ర పంచాయతీ రాజ్‌ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి నీరజా శేఖర్‌ అన్నారు. రాజేంద్రనగర్‌లోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ అకాడమీ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (ఎఎంఆర్‌ అపార్డ్‌)లో సోమవారం పీసా చట్టం అమలు గురించి జరిగిన వర్క్‌షాపులో ఆమె పాల్గొని ప్రంగించారు. పీసా చట్టంలో ఉన్న హక్కులను గిరిజనులకు కల్పించి వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. గిరిజనులకు కల్పించిన హక్కులకు భంగం కలగకుండా చూడాలన్నారు. గిరిజనులకు స్వయం పాలనా అధికారాలను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణననుసరించి 1996, 2001లో చేసిన సవరణల ద్వారా గవర్నర్‌ ఆదేశాలకనుగుణంగా గిరిజనులకు దక్కాల్సిన అన్నిరకాల హక్కులను కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ, గిరిజనులకు మైనింగ్‌ హక్కులు, సంపదననుసరించి భాగస్వామ్యం కల్పించాలన్నారు. మైదాన ప్రాంతాలలోని గిరిజనుల హక్కులను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖల సమన్వయంతో గిరిజనులకు అందాల్సిన అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ కమిషర్‌ డి. ప్రసాదరావు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ బి.ఉదయ లక్ష్మి, అపార్డ్‌కు చెందిన సూర్యనారాయణరెడ్డి, కె.యాదయ్యతోపాటు ఐటీడీఏ అధికారులు, జిల్లా, మండల పరిషత్‌ సభ్యులు, గ్రామ సర్పంచ్‌లు మైనింగ్‌, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.