Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 00:33AM

సెల్వరాజ్‌కు ప్రముఖులతో సంబంధాలు?


చెన్నై, సెప్టెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఇటీవల చెన్నైలో పట్టుబడ్డ పాకిస్థాన్‌ తీవ్రవాది అరుళ్‌ సెల్వరాజ్‌కు పలువురు ప్రముఖులతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, సైనికాధికారులు, సినీ ప్రముఖులతో అతను సన్నిహితం గా మెలగినట్లు విచారణలో వెల్లడైంది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు అరు ళ్‌సెల్వరాజ్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు అతన్ని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సోమవారం కోర్టును అభ్యర్థించారు. కాగా ఎన్‌ఐఏ విచారణలో పలు దిగ్ర్భాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శితో అరుళ్‌సెల్వరాజ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన కుటుంబీకులకు చెందిన వివాహ కార్యక్రమంలో కూడా అరుళ్‌సెల్వరాజ్‌ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అరుళ్‌సెల్వరాజ్‌ చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు పాల్గొన్నట్లు ఫోటోలు లభ్యమవ్వడంతో వీరి మధ్య ఏమేరకు సాన్నిహిత్యముందన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చెన్నైకి చెందిన ఓ మెడికో అరుళ్‌సెల్వరాజ్‌తో ప్రేమలో పడిందని, ఆమె కోరిక మేరకు అతను సినీ ప్రముఖులకు ఓ పార్టీ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. ఈ పార్టీకి కొంతమంది బాలీవుడ్‌ నటులు, డ్యాన్స్‌ మాస్టర్లు కూడా వచ్చారు. ఈ చనువుతోనే అరుళ్‌సెల్వరాజ్‌ ముంబాయిలో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ సందర్భంగా జరిగిన చర్చలు, కొన్ని ఫోటోలను శ్రీలంకలోని పాకిస్థాన్‌ రాయబారికి పంపినట్లు విచారణలో తేలింది. అరుళ్‌కు చెన్నైలోని ఆరు బ్యాంకుల్లో ఖాతాలుండగా, వాటిల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి లక్షలాది రూపాయలు జమ అయ్యాయని తేలడంతో ఆ ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు.