Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 12 2016 @ 06:32AM

జల రవాణాపై.. సర్వే

తెనాలి: జల రవాణా దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు జల రవాణా పునరుద్ధరణకు రంగం సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. బకింగ్‌ హామ్‌ కెనాల్‌లో జరిగే జల రవాణా పునరుద్ధరణకు అవసరమైన భూసేకరణ కోసం కేంద్ర అంతర్గత జల రవాణా విభాగం సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా సీతానగరం నుంచి పెదగంజాం వరకు 112 కి.మీ మేర సర్వే ప్రారంభించారు. తొలి విడతగా సంగం జాగర్లమూడి లాకుల నుంచి బాపట్ల వరకు 40 కి.మీ మేర సర్వే పూర్తయింది. దీనికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌పై సోమవారం అంతర్గత జల రవాణా విభాగం ప్రతినిధులు తెనాలిలో జల వనరుల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. జల రవాణాకు వీలుగా బకింగ్‌ హామ్‌ కెనాల్‌ను 120 మీటర్ల మేర వెడల్పు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఎంత భూమి అవసరమవుతుందనే దానిపై అంతర్గత జల రవాణా విభాగం సర్వే చేస్తోంది. ప్రభుత్వ భూములు పోను ప్రైవేట్‌గా ఎంత మేర భూ సేకరణ చేయాల్సి ఉంటుందనే దానిపై డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను జల వనరుల శాఖ ద్వారా కేంద్ర అంతర్గత జల రవాణా విభాగానికి నివేదిస్తారు. తొలి విడతలో సర్వే పూర్తయిన 40 కి.మీల నిడివికి సంబంధించిన వివరాలపై సంబంధిత విభాగం ప్రతినిధులు జల రవాణా శాఖ ఈఈ పి.వెంకటరత్నం, ఇతర అధికారులతో చర్చించారు. రెండో విడతలో సంగం జాగర్లమూడికి ఎగువన, బాపట్లకు దిగువన సర్వే చేయనున్నారు. పూర్తి వివరాలతో డిపిఆర్‌ తయారు చేసి జల రవాణాకు అవసరమైన భూ సేకరణపై ఒక అవగాహనకు రానున్నారు. జాతీయ జల రవాణా మార్గం- 4గా గుర్తించిన ఈ మార్గంలో కాకినాడ కెనాల్‌, ఏలూరు కెనాల్‌, కొమ్మమూరు కెనాల్‌, నార్త్‌ బకింగ్‌ హామ్‌ కెనాల్‌, సౌత్‌ బకింగ్‌ హామ్‌ కెనాల్‌, గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి. ఈ మార్గం నిడివి 971 కి.మీ.గా ఉంది. ఇందులో 887 కి.మీ. ఆంధ్రప్రదేశ్‌లో, 84 కి.మీ. తమిళనాడులో విస్తరించి ఉంది. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు 1078 కి.మీ.గా ఉన్నట్లు గుర్తించారు. కాకినాడ పోర్టు నుంచి కృష్ణ పట్నం రేవు వరకు జల రవాణా ద్వారా అను సంధానం చేయనున్నారు. రాష్ట్రంలో ముఖ్యమైన ఈ రెండు పోర్టులను అను సంధానం చేయడం ద్వారా జల రవాణా పునరుద్ధరణకు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. దీని వల్ల రోడ్లపై అదనపు భారం తగ్గడమే కాకుండా తక్కువ ఖర్చుతో సరకు రవాణాకు వీలు కలుగుతుంది. పూర్వం ఈ మార్గంలో చెన్నై నుంచి విజయవాడ, కాకినాడ వరకు జల రవాణా కొనసాగింది. అప్పటిలో ఇందు కోసం కాల్వలు, వంతెనలు, లాకుల నిర్మాణం జరిగింది. అప్పట్ల్లో చిన్న పడవలు మాత్రమే జల మార్గంలో ప్రయాణించేవి. ప్రస్తుతం వంద మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి తగ్గకుండా జల రవాణాను ప్రవేశ పెట్టనున్నారు. దీనితో కాల్వలను, లాకులను వెడల్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. సోమవారం ఇరిగేషన్‌ అధికారులతో జరిగిన చర్చలలో అంతర్గత జల రవాణా విభాగానికి చెందిన రిటైర్డ్‌ ఇంజనీర్‌ ప్రసాద్‌తో పాటు ఇరిగేషన్‌ డీఈఈలు శ్రీరామమూర్తి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.