Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 12 2016 @ 02:21AM

టెక్‌ మా బలం .. పెట్టుబడులకు అనుకూలం: చంద్రబాబు

  • ప్రతి సమస్యా మాకు ఓ అవకాశమే 
  • మార్చి నాటికి ఇంటింటికీ ఇంటర్నెట్‌ 

విశాఖపట్నం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ‘పెట్టుబడులు పెట్టేందుకు దేశంలో ఏ రాష్ట్రానికి లేనన్ని అనుకూలతలు ఏపీకి ఉన్నాయి. సహజవనరుల పరంగా.. టెక్నాలజీ వినియోగంలోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం రాష్ట్రం సొంతం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో రెండో రోజైన సోమవారం ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో ఎగుమతులు, తయారీ రంగానికి హబ్‌గా ఏపీని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అమెరికా అభివృద్ధి సాధించడానికి 100 ఏళ్ల సమయం పట్టిందని, కానీ టెక్నాలజీ సాయంతో ఏపీ అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ‘భారతదేశం ఓ స్లీపింగ్‌ జెయింట్‌. అంతర్గతంగా ఈ దేశం ఎంతో శక్తివంతమైనది. 120 కోట్ల జనాభాతో అతిపెద్ద మార్కెట్‌ భారత సొంతం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి సమస్యను ఒక అవకాశంగా తీసుకొని ముందుకు వెళుతున్నామని తెలిపారు. సువిశాలమైన సముద్ర తీరమే రాష్ట్రాభివృద్ధికి అతిపెద్ద వనరు అని, దీన్నే పెట్టుబడిగా పెట్టి ముందుకు వెళుతామన్నారు. ఈ ఏడాది సముద్రతీర ప్రాంతం, పోర్టుల అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి సారించనున్నట్లు తెలిపారు. బెంగళూరు-చెన్నై కారిడార్‌తోపాటు బెంగళూరు-కర్నూలులో మరో కారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. విద్యుదుత్పత్తి.. సరఫరాలో ఏపీ నెంబర్‌వన్‌గా ఉందని తెలిపారు. పెట్టుబడులకు ఏపీ కన్నా మంచి రాష్ట్రం మరొకటి ఉండదని పునరుద్ఘాటించారు. సమ్మిళిత అభివృద్ధిలో భాగంగా సంక్షేమ పథకాల అమలుకూ ప్రాధాన్యం ఇస్తున్నామంటూ ప్రభుత్వ పథకాలను వివరించారు. మార్చి నాటికి ప్రతి ఇంటికీ 10 నుంచి 15 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో రూ.100 నుంచి 150లకే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.