Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 12 2016 @ 02:15AM

దేశాభివృద్ధికి ఏపీయే కీలకం!: జయంత్ సిన్హా

  • రేపు దేశంలో జరిగే అభివృద్ధి 
  • ఏపీలో నేడే జరుగుతుంది 
  • ఇది చంద్రబాబు ఘనత 
  • సంక్షేమంలోనూ ఏపీ భేష్‌ 
  • త్వరలో 15% వృద్ధి రేటు 
  • రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం

విశాఖపట్నం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): భారతదేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత సిన్హా పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయంత మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనను ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రబాబు తన సామర్థ్యంతో ఏపీని మరో కాలిఫోర్నియాగా తీర్చిదిద్దగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రేపు అమెరికాలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో అది కాలిఫోర్నియాలో నేడే జరుగుతుందన్నది నానుడి. భారతదేశానికి దీన్ని అన్వయించుకుంటే.. రేపు భారతదేశంలో జరిగే అభివృద్ధి ఏపీలో నేడే జరుగుతుందని చెప్పుకోవచ్చు’ అని జయంత వ్యాఖ్యానించారు. సామాజిక దృక్పథాన్ని వీడకుండా మార్కెట్‌ సంస్కరణలు అమలు చేయడం ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుల ఘనత అని జయంత కొనియాడారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు అటు మార్కెట్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూనే సంక్షేమ పథకాల అమల్లోనూ ఏపీ దూసుకెళుతోందన్నారు. ఏపీ చేస్తున్న విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌ సీఎంని కోరానని జయంత తెలిపారు. ఏపీలో వ్యవసాయ రంగాన్ని కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారని, పోలవరం, నదుల అనుసంధానం ప్రశంసనీయంగా ఉన్నాయని కొనియాడారు. భూసమీకరణ విధానం వినూత్నమని అభిప్రాయపడ్డారు. ఏపీలో రక్షణ, పెట్రోలియం, రిఫైనింగ్‌, ఫార్మా, పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఎలకా్ట్రనిక్స్‌ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఏపీ 14 నుంచి 15 శాతం వృద్ధిరేటు సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు అనుకూల రాష్ట్రాల్లో గుజరాత తర్వాతి స్థానం ఏపీదేనన్నారు. సీఎం చంద్రబాబు అన్ని ఆలోచనలకు తలుపులు తెరిచే ఉంచుతారని, దేశాభివృద్ధికి ఈ రాష్ట్రం నుంచే కొత్త ఆలోచనలు రావాలని ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు.