Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 12 2016 @ 02:14AM

‘అభ్యర్థుల’పై టీఆర్‌ఎస్‌ కమిటీ

  •  అధ్యక్షుడు కేకే... సభ్యులుగా డీఎస్‌, కడియం, కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ 
  •  ఆశావహుల పేర్లతో రెండ్రోజుల్లో నివేదిక.. 
  • సీఎందే తుది నిర్ణయం 
హైదరాబాద్‌/సిటీ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల బరిలో అధికార టీఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది. అన్ని అంశాల్లోనూ నిర్ణయాలపై ముందంజలో ఉన్న పార్టీ అధినాయకత్వం అభ్యర్థుల ఎంపికలోనూ అదే జోరు చూపుతోంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ ఎంపీ కె.కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు ధర్మపురి శ్రీనివాస్‌, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఎంపిక నిష్పక్షపాతంగా సాగాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌ నేతలకు ఇందులో స్థానం కల్పించలేదని పార్టీవర్గాలు పేర్కొన్నాయి. పార్టీ సర్వే, సంప్రదింపుల ఆధారంగా ఈ కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపడుతుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, పార్టీ పరిశీలకులతో చర్చిస్తుంది. అవసరమైతే కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఆయా డివిజన్లలో ప్రజాబలంగల నేతలను ఇద్దరు, ముగ్గురు వంతున గుర్తిస్తుంది. దీంతోపాటు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేస్తుంది. ఈ కసరత్తు పూర్తయ్యాక డివిజన్లవారీగా బలమైన అభ్యర్థులతో జాబితాను రూపొందిస్తారు. అయితే, ఇదంతా శరవేగంగా రెండు రోజుల్లోనే పూర్తిచేయనున్నట్లు సమాచారం. ఆశావహులతో రూపొందిన జాబితా అందిన తర్వాత సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా... ఎంపిక ప్రక్రియ పూర్తి నిష్పాక్షికంగా, పారదర్శకంగా సాగాలని, పార్టీపరంగా చేపట్టిన సర్వేలను ప్రామాణికంగా తీసుకోవాలని కమిటీ సభ్యులకు సీఎం సూచించారు. ఇక 50 డివిజన్ల అభ్యర్థుల తొలి జాబితా ఇప్పటికే సిద్ధమైందని, రెండుమూడు రోజుల్లో ప్రకటిస్తారని ప్రచారం సాగుతుండటంతో ఆశావహుల గుండెల్లో గుబులు రేగుతోంది. మూడు నాలుగు విడుతల్లో మొత్తం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఓ సీనియర్‌ నేత తెలిపారు. దీంతో ఇన్‌చార్జి ఎమ్మెల్యేలతో కలసి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్న అనేకమంది ఆశావహలు తొలి జాబితాలోనే తమ పేరు చూసుకోవాలన్న తపనతో మంత్రులచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టికెట్‌ ఎవరికి వచ్చినా పార్టీ విజయం కోసం కృషిచేస్తామంటున్నా అనుచరులతో మాత్రం పోటీ ఎక్కువగానే ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పలు డివిజన్లలో రెండు రోజులపాటు పెద్ద ఎత్తున చేరికలుంటాయన్న వర్తమానంతో ఏ స్థాయి నాయకులు వస్తారోనని ఆరాతీస్తున్నారు. ప్రభుత్వ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం కలిసివస్తుందని ఆశిస్తున్న ఆశావహులు టికెట్‌ కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ తమకు అవకాశం దక్కకపోయినా, మహిళలకు రిజర్వేషన్‌ స్థానాల్లో తమ కుటుంబంలో ఒకరికి టికెట్‌ తెచ్చుకునేలా పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేలతో ప్రచారంలో పాల్గొంటూనే వీలు చిక్కినప్పుడల్లా వారికి బయోడేటాలు అందిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. మరికొందరి కుటుంబసభ్యులు పలు ఆలయాల్లో పూజలు చేయిస్తూ దైవానుగ్రహంతో అధిష్ఠానం దృష్టి తమవారివైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొందరు తమవెంట ఒక్క అనుచరుడూ లేకపోయినా బంధుమిత్ర పరివారమంతా తమ పక్కనే ఉండాలంటూ ఫోన్లమీద ఫోన్లతో రప్పించుకుంటున్నారు. మొత్తంమీద నగరంలోని చాలామంది నేతలు మంత్రి కేటీఆర్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ‘సార్‌ ఓకే చెబితే చాలు టికెట్‌ వచ్చినట్టే’నని, ఆయన ప్రచారం కూడా కలిసివస్తుందని ఓ నాయకుడు పేర్కొన్నారు.