Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 12 2016 @ 02:00AM

బుల్లెట్‌ రైళ్ళతో సామాజిక లబ్ధి

బుల్లెట్‌ రైలును ప్రవేశపెట్టడం మంచిదే. దానితో పాటు ఏసీ 1, ఏసీ 2 తరగతులను తొలగించి, స్లీపర్‌, సెకండ్‌ క్లాసెస్‌ బోగీల నిర్వహణకు ప్రభుత్వం నగదు సబ్సిడీలను సమకూర్చాలి. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్ళు ప్రయాణించగలిగేలా ప్రస్తుత రైల్వే ట్రాక్స్‌ను తప్పనిసరిగా మెరుగుపరచాలి. 

బై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలుకు అవసరమైన సాంకేతికతలను, ఆర్థిక సహాయాన్ని సమకూర్చేందుకు జపాన్‌ ప్రభుత్వంతో మోదీ సర్కార్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎత్తుగా ఉండే రైలు పట్టాలపై గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌ రైలు ప్రయాణిస్తుంది. పశ్చిమ భారతంలోని ఆ రెండు నగరాల మధ్య ప్రయాణకాలం ప్రస్తుత 6-8 గంటల నుంచి 2 గంటలకు తగ్గుతుంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు ఇతోధిక మేలు చేకూరుతుంది. ప్రయాణికులు కాలక్షేపంగా కూర్చోకుండా ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొనే వీలు ఉంటుంది.
 
అయితే బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ఆచరణీయం కాదేమో?! ఈ ప్రాజెక్టు నిర్మాణపు మూల ధన వ్యయాలను తిరిగి రాబట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చని జాతీయ రవాణా అభివృద్ధి విధాన కమిటీ నివేదిక పేర్కొనడం గమనార్హం. అయినప్పటికీ బుల్లెట్‌ రైళ్ళ వల్ల దేశానికి లబ్ధి సమకూరుతుందని చెప్పవచ్చు. ఎలా? ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను నిర్మిస్త్తున్నాయి. ఈ రోడ్ల మూలంగా సమకూరే ఆర్థిక లబ్ధి చెప్పుకోదగింది కాదు. అయితే వాటి వల్ల సమకూరే సామాజిక ప్రయోజనాలు గణనీయమైనవి. ఇదే తర్కం బుల్లెట్‌ రైలుకు కూడా వర్తిస్తుంది. ఈ అధునాతన రవాణా వాహనంలో ప్రయాణించే వారు ఆర్థికంగా గణనీయమైన లబ్ధి పొందుతారు. అది క్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థలో సమ్మిళితమై ప్రభుత్వ రాబడిని పెద్దఎత్తున పెంచుతుంది.
 
సువిశాల భారతీయ రైల్వే వ్యవస్థను మరింతగా మెరుగుపరచడమనేది ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్‌. 2010 సంవత్సరంలో భారతీయ రైల్వేలు 337 కోట్ల మంది ప్రయాణీకులను వారి గమ్యాలకు చేర్చాయి. వీరిలో 303 కోట్ల మంది సాధారణ సెకండ్‌క్లాస్‌ బోగీల్లో ప్రయాణించారు. 26కోట్ల మంది స్లీపర్‌క్లాస్‌ బోగీల్లో ప్రయాణించారు. ఎనిమిది కోట్ల మంది ఏసీ క్లాస్‌ బోగీల్లో ప్రయాణించారు.
 
సెకండ్‌ క్లాస్‌ బోగీల్లో ప్రయాణించే వారి అవస్థలు వర్ణనాతీతమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనీస సదుపాయాలు కూడా ఆ బోగీల్లో ఉండవు. కిక్కిరిసిన బోగీలో గంటల పాటు నుంచొని ప్రయాణించడం వల్ల ప్రయాణికులు భౌతికంగానే కాదు మానసికంగానూ పూర్తిగా అలసిపోవలసివస్తుంది. ఇది వారి వృత్తి, ఉద్యోగ కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని నెరపుతోంది. దీనికితోడు రైళ్ళు చాలా తక్కువ వేగంతో నడవడం వల్ల ప్రయాణికులు అదనంగా ఎంతో నష్టపోతున్నారు.
ముంబై, అహ్మదాబాద్‌లకు చెందిన వస్త్రవ్యాపారుల విలువైన సమయాన్ని కాపాడితే సరిపోతుందా? కాన్పూర్‌ నుంచి సరుకుల కొనుగోలుకు న్యూఢిల్లీ వచ్చే కిరాణా వ్యాపారుల సమయం కూడా విలువైనది కాదూ? స్లీపర్‌, సెకండ్‌క్లాస్‌ బోగీల్లో ప్రయాణించే వారి నుంచి రైల్వే్‌సకు లాభాలు సమకూరడం లేదు. వారికి అందించే సేవల వల్ల రైల్వే్‌సకు నష్టాలు మినహా లాభాలు ఉండడం లేదు. నిజానికి ఒక్క 3 ఏసీ క్లాస్‌ ప్రయాణీకుల నుంచి మినహా మరే తరగతి ప్రయాణీకుల నుంచి రైల్వేస్‌కు లాభాలు సమకూరడం లేదు. 1 ఏసీ, 2 ఏసీ తరగతుల చార్జీలు పెంచితే ఆ తరగతుల్లో ప్రయాణించే వారు విమానయానం వైపు మొగ్గుచూపడం ఖాయం. భారీ నష్టాలకు కారణమవుతున్న హైక్లాస్‌ కంపార్ట్‌మెంట్స్‌ను దశలవారీగా తొలగించడమే పరిష్కారం. ఇక స్లీపర్‌, సెకండ్‌ క్లాస్‌ బోగీలపై సమకూరుతున్న నష్టాలను పాక్షికంగా ప్రభుత్వం భరించాలి. అధికఛార్జీల రూపేణా ప్రయాణికులూ పాక్షికంగా ఆ నష్టాలను భర్తీచేయాలి. సేవలు అందించేందుకు అవుతున్న ఖర్చుల కంటే తక్కువ చార్జీలు వసూలు చేస్తున్నందుకు రైల్వే్‌సకు ప్రభుత్వం నగదు రూపేణా సబ్సిడీ సమకూర్చాలి. స్లీపర్‌, సెకండ్‌ క్లాస్‌ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకుగాను ఆ సేవలు లాభదాయకంగా ఉండేలా చేయడం తప్పనిసరి.
 
రిజర్వేషన్‌ లేకుండా ప్రయాణించే వారికి మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా కల్కా మెయిల్‌ తదితర ఫ్యాస్ట్‌ రైళ్ళను నిర్వహించాలి. ఈ దృష్ట్యా సువిశాలమైన రైల్వేస్‌ నెట్‌వర్క్‌ను మరింతగా మెరుగుపరచడం తప్పనిసరి. ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం ద్వారా ప్రయాణికులకు ఆదా అయ్యే సమయంతో పోలిస్తే బుల్లెట్‌ రైలులో ప్రయాణించేవారికి ఆదా అయ్యే సమయం తక్కువగానే ఉంటుంది. అయితే ప్రస్తుత సంప్రదాయ రైల్వే ట్రాక్‌ పరిస్థితి సరిగ్గాలేదని మరి చెప్పనక్కరలేదు. కల్కా మెయిల్‌ లాంటి ఫ్యాస్ట్‌ రైళ్ళకు, గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యమున్నది. అయితే రైలు మార్గాల పరిస్థితి బాగాలేకపోవడం వల్ల గంటకు కేవలం 55 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించగలుగుతున్నాయి. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్ళు ప్రయాణించేలా ప్రస్తుత రైల్వేట్రాక్స్‌ను మెరుగుపరచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. రైలు మార్గాల వంపులను సూటిగా చేయడం, రైలు వంతెనలను పటిష్ఠ పరచడం, సిగ్నలింగ్‌ వ్యవస్థను అధునాతనం చేయడం, బోగీలను సరికొత్తగా డిజైన్‌చేయడం తదితర చర్యలకు మదుపులు చేయడం ద్వారా ప్రస్తుత ట్రాక్స్‌పైనే, గంటకు 160-200 కిలోమీటర్ల వేగంతో రైళ్ళు నడిచేలా చేయవచ్చని జాతీయ రవాణా అభివృద్ధి విధాన కమిటీ నివేదిక తెలిపింది. ఇందుకయ్యే వ్యయం బుల్లెట్‌ రైలుకు అవసరమైన ఎత్తైన పట్టాలను నిర్మించేందుకు అయ్యే వ్యయం కంటే తక్కువేనని మరి చెప్పనవసరం లేదు. బుల్లెట్‌ రైలును ప్రవేశపెట్టడం మంచిదే. అయితే దానితో పాటు ఏసీ 1, ఏసీ 2 తరగతులను తొలగించి, స్లీపర్‌, సెకండ్‌ క్లాసెస్‌ బోగీల నిర్వహణకు ప్రభుత్వం నగదు సబ్సిడీలను సమకూర్చాలి. వీటితో పాటు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్ళు ప్రయాణించగలిగేలా ప్రస్తుత రైల్వే ట్రాక్స్‌ను తప్పనిసరిగా మెరుగుపరచాలి.
(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగళూరు ఐఐఎం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌)