Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 12 2016 @ 00:56AM

ఫీజుల కోసం 200 కోట్లు విడుదల

  •   2602 కోట్లకు చేరిన బడ్జెట్‌ 
  •  అదనపు నిధులు కేటాయించిన ప్రభుత్వం 
హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.200 కోట్లను విడుదల చేసింది. 2014-15 విద్యాసంవత్సరానికి గాను 13,83,627 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత వీరి ఫీజుల కోసం రూ.2432 కోట్లు అవుతాయన్న అంచనాతో బడ్జెట్‌లో కేటాయించగా, విద్యార్థుల సంఖ్యతో పాటు ఫీజులు కూడా పెరగడంతో అదనంగా రూ.169.68 కోట్లను కలిపారు. దాంతో ఫీజులు, ఉపకారవేతనాలకు బడ్జెట్‌ మొత్తం కలిపి రూ.2602 కోట్లకు చేరింది. విద్యాసంవత్సరం ముగిసినప్పటికీ ఫీజులు సకాలంలో విడుదల చేయకపోవడంతో ఇటీవలే సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శులంతా భేటీ అయి, సమస్యపై చర్చించారు. ఫీజుల భారం తగ్గించడానికి వీలుగా నిధులు విడుదల చేయాలని వారంతా కోరడంతో సోమవారం ఆర్థిక శాఖ కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవోలు విడుదల చేశారు. అయితే, తాజాగా.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.135 కోట్లు, గిరిజనులకు రూ.20 కోట్లు, ఎస్సీలకు రూ.25 కోట్లు, మైనారిటీలకు రూ.20 కోట్లు కలుపుకొని రూ.200 కోట్లు ఇచ్చారు. దీంతో ఇదివరకే ఇచ్చిన రూ.1050 కోట్లను కలుపుకొంటే రూ.1250 కోట్లను 2014-15 సంవత్సరానికి విడుదల చేసినట్లయింది. మరోవైపు 2015-16 విద్యాసంవత్సరానికి రూ.13,69,564 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తాజా లెక్కల ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ. 4000 కోట్లు అవసరమవుతాయని, విడుదల చేసిన నిధులు ఏ మూలకూ సరిపోవని సంక్షేమశాఖల అధికారులతో పాటు విద్యార్థులు పెదవి విరుస్తున్నారు.