Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 23:24PM

పాట చిత్రీకరణలో ‘ఢీ అంటే ఢీ’


శ్రీకాంత్‌, సోనియా మాన్‌ జంటగా రూపొందుతున్న ‘ఢీ అంటే ఢీ’ చిత్రం షూటింగ్‌ ముగింపుకొచ్చింది. మహాలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ నిర్మాణంలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టాకీ పార్టు ఇప్పటికే పూర్తికాగా, హైదరాబాద్‌ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హీరో హీరోయిన్లు, డాన్సర్లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. చంద్రబోస్‌ రాసిన ‘ప్రసన్నా ప్రసన్నా ప్రసన్నా ప్రసన్నా/నువ్వే నా ప్రపంచం అంటూ ఉన్నా..’ అంటూ సాగే ఈ పాటకు ప్రేమ్‌రక్షిత్‌ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘‘భూపతిరాజా అందించిన చక్కని కథను జొన్నలగడ్డ చాలా బాగా తెరమీదకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం తీస్తున్న పాట కాకుండా ఇంకో ఐటమ్‌ సాంగ్‌ మాత్రమే బేలెన్స్‌ ఉంది. పిల్లల చుట్టూ తిరిగే ఈ కథలో చక్కని సెంటిమెంట్‌ ఉంది. నా కెరీర్‌కు ఇది ఓ కొత్త తరహా సినిమా అవుతుంది’’ అని చెప్పారు. ప్రేమ్‌రక్షిత్‌ సారథ్యంలో శ్రీకాంత్‌ కొత్త స్టెప్స్‌ వేస్తున్నాడని దర్శకుడు జొన్నలగడ్డ తెలిపారు. ‘‘20 నుంచి రీరికార్డింగ్‌ జరుపుతాం. 24 నుంచి మూడు రోజుల పాటు చిత్రీకరించే ఐటమ్‌ సాంగ్‌తో షూటింగ్‌ అయిపోతుంది. అక్టోబర్‌ మొదటి వారానికి తొలికాపీ వస్తుంది. బ్రహ్మానందం పాత్ర ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది’’ అని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో హీరోయిన్‌ సోనియా మాన్‌, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌ కూడా మాట్లాడారు. జయప్రకాశ్‌రెడ్డి, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, సత్యప్రకాశ్‌, బ్రహ్మాజీ, సత్యకృష్ణ, జ్ఞానీస్‌, జీవా, అదుర్స్‌ రఘు, తాగుబోతు రమేశ్‌, వేణుగోపాల్‌ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రకుమార్‌, పాటలు: చంద్రబోస్‌, సంగీతం: చక్రి, ఫైట్స్‌: కణల్‌కణ్ణన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: జి. లక్ష్మణ్‌రెడ్డి, సి.ఎన్‌.రెడ్డి, జి. జ్యోతిక.