desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 23:23PM

తి.....మ్మి....ర్లు వ్యాదుల సంకేతలు

సూదులతో గుచ్చినట్టు, జివ్వుమని లాగేస్తున్నట్టు విచిత్రమైన బాధను కలిగించే లక్షణం... తిమ్మిర్లు. ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే కాళ్లు రెండూ తిమ్మిరెక్కిపోతాయి. నాలుగడుగులు అటూ ఇటూ నడిస్తే గానీ తిమ్మిరి పట్టిన కాళ్లు స్వాధీనంలోకి రావు. అలాగే చేతులు కూడా! అరికాళ్లు, అరచేతుల్లో తిమ్మిర్లు సర్వసాధారణం. ఇవి అందరినీ ఏదో ఓ సందర్భంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కానీ అవే తిమ్మిర్లు వారాల తరబడి వేధిస్తూ క్రమంగా తీవ్రమవుతూ ఉంటే? అలాంటి తిమ్మిర్లను శరీరంలోని తీవ్రమైన వ్యాధులకు సంకేతాలుగా భావించాలి. లక్షణం మూలాల్లోకి వెళ్లకుండా తిమ్మిర్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే తిరిగి కోలుకోలేనంతగా నరాలు దెబ్బతింటాయి అంటున్నారు సీనియర్‌ న్యూరోఫిజీషియన్‌ డాక్టర్‌ ఆర్‌.ఎన్‌.కోమల్‌ కుమార్‌.

నరాలు ఒత్తిడికి గురయినప్పుడు బహిర్గతమయ్యే లక్షణం...తిమ్మిర్లు. దీన్నే మొద్దుబారటం అని కూడా అంటారు. వైద్య పరిభాషలో న్యూరోపతీగా పిలిచే ఈ తిమ్మిర్లలో పాజిటివ్‌, నెగిటివ్‌ అనే రెండు రకాలుంటాయి. ఒకే యాంగిల్‌లో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్లలో తిమ్మిర్లు రావటం సహజం. సూదులతో గుచ్చినట్టుండే ఇలాంటి తిమ్మిర్లు, మంటలు పాజిటివ్‌ రకానికి చెందినవి. ఇవి 10- 15 నిమిషాల్లో తగ్గిపోతాయి. నెగిటివ్‌ తిమ్మిర్లలో క్రమంగా స్పర్శ తగ్గిపోవటం, నొప్పి ఉండటం, అవయవాలు బలహీనమవటం ఉంటుంది. ఇలాంటి నెగిటివ్‌ లక్షణాలను నరాలు పదే పదే ఎక్కువకాలంపాటు ఒత్తిడికి గురవటం వల్ల కలిగే న్యూరోపతీగా భావించాలి. ఈ రకమైన సమస్యనే వైద్య పరిభాషలో ‘ప్రెషర్‌ పాల్సీ’ అంటారు.
ప్రెషర్‌ పాల్సీ ఎవరికి ఎక్కువ
నరాలకు సంబంధించిన సమస్యలు మధుమేహల్లో ఎక్కువ. హైపోథైరాయిడ్‌, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, స్థూలకాయులు, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ చికిత్స తీసుకునే రోగులు, కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్‌ ఉన్న రోగుల్లో కూడా ప్రెషర్‌ పాల్సీ కనిపిస్తుంది. విటమిన్‌ బి12, థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ లోపం, పైరిడాక్సిన్‌ డెఫిషియన్సీతోపాటు పైరిడాక్సిన్‌ ఎక్సెస్‌కి గురయినవారిలో కూడా ప్రెషర్‌ పాల్సీ కనిపిస్తుంది. క్షయ రోగులకు ఇచ్చే మందుల ప్రభావం వల్ల పైరిడాక్సిన్‌ డెఫిషియన్సీ వస్తుంది. ఫలితంగా క్షయ రోగులు ప్రెషర్‌ పాల్సీకి గురవుతారు. కాబట్టి క్షయ రోగుల చికిత్సలో భాగంగా ఇచ్చే మందులకు అదనంగా పైరిడాక్సిన్‌ డెఫిషియన్సీ రాకుండా మందులివ్వటం జరుగుతుంది. మద్యపానం చేసే వారిలో కూడా ప్రెషర్‌ పాల్సీ తలెత్తుతుంది. దీన్ని ఆల్కహాలిక్‌ న్యూరోపతీ అంటారు. అలాగే ధూమపానం చేసేవారు కూడా నరాల సంబంధ రుగ్మతలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుష్టు రోగుల్లో కూడా ప్రెషర్‌ పాల్సీ కనిపిస్తుంది.
సర్వసాధారణమైన ప్రెషర్‌ పాల్సీ ‘కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌’
ప్రెషర్‌ పాల్సీలో సర్వసాధారణంగా కనిపించే రుగ్మత ‘కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌’. అరచేతిలోని మీడియన్‌ నరం పదేపదే ఒత్తిడికి గురవటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. దాంతో అరచేతుల్లో తిమ్మిర్లు మొదలవుతాయి. ఈ సమస్య కంప్యూటర్‌ ముందు కూర్చుని ఎక్కువ సేపు పనిచేసేవాళ్లలో, గర్భిణుల్లో, స్థూలకాయుల్లో, హైపో థైరాయిడ్‌, మధుమేహులు, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్థూలకాయులు, గర్భిణీల్లో మణికట్టు దగ్గర ద్రవాలు చేరి మీడియన్‌ నరం ఒత్తిడికి గురవటం మూలంగా ఈ సమస్య మొదలవుతుంది. అరచేతుల్లో తిమ్మిర్లతోపాటు చేతిని వంచినప్పుడల్లా మణికట్టు దగ్గర నొప్పి మొదలవుతుంది. మీడియన్‌ నరంతో సంబంధం ఉన్న బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు మొద్దుబారతాయి. వ్యాధి తీవ్రమయ్యేకొద్దీ రాత్రివేళ వేళ్ల తిమ్మిర్లతో నిద్ర మెలకువొచ్చే పరిస్థితి వస్తుంది. అరచేతిలో ఉండే 20 కండరాల్లోని నాలుగు కండరాలు మీడియం నరంతో అనుసంధానమై ఉంటాయి. మిగతా 16 కండరాలు చేతి అడుగు భాగంలో ఉండే అల్నార్‌ నరంతో కనెక్ట్‌ అయి ఉంటాయి. కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ తీవ్రమయ్యేకొద్దీ మీడియం నరంతో సంబంధం ఉన్న కండరాలు బలహీనపడతాయి. ముఖ్యంగా బొటనవేలితో సంబంధం ఉండే అరచేతిలోని కండరం బలహీనపడిపోతుంది. దాంతో బొటనవేలి కదలికలు నిలిచిపోతాయి. ఈ వ్యాధికి చికిత్స మూడు రకాలుగా ఉంటుంది. ప్రధమంగా వ్యాధి మూలాల్లోకి వెళ్లి అసలు రుగ్మతను కనిపెట్టి చికిత్సనందించటం ద్వారా కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ను కట్టడి చేయవచ్చు. అలాగే చేతి కదలికలను నియంత్రించటం కోసం మణికట్టు దగ్గర స్ల్పింట్‌ అమర్చటం, వ్యాధి మరీ తీవ్రంగా ఉంటే స్టిరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇవ్వటం, అప్పటికీ సమస్య తగ్గుముఖం పట్టకపోతే సర్జరీ చేసి మీడియన్‌ నరాన్ని వదులు చేయటం జరుగుతుంది.
అల్నార్‌ న్యూరోపతీ
మోచేతిని తాకినప్పుడు వేళ్లకు తగిలే లావాటి నరం అల్నార్‌. మోచేయి బలంగా గోడకు గుద్దుకున్నప్పుడు ఈ నరం ఒత్తిడికి గురై షాక్‌ కొట్టినట్టు వేళ్లు జివ్వుమంటాయి. అల్నార్‌ నర్వ్‌ మోచేతి కింది భాగం నుంచి ముంజేతి వరకూ సాగుతుంది. ఈ నరం ప్రెషర్‌ పాల్సీకి గురవటాన్ని అల్నార్‌ న్యూరోపతీ అంటారు. దీన్నే ఫ్లూటిస్ట్‌ న్యూరోపతీ అని కూడా అంటారు. చేతిలోని చివరి రెండు వేళ్లను ఎక్కువగా కదిలించే ఫ్లూట్‌ కళాకారులే ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతూ ఉండటమే ఇందుకు కారణం. అలాగే చేతి వేళ్లను ఎక్కువగా కదిలించే తబల కళాకారులు కూడా అల్నార్‌ న్యూరోపతీ బారిన పడుతూ ఉంటారు. అల్నార్‌ న్యూరోపతీలో అల్నార్‌ నరంతో సంబంధం ఉండే చిటికెన వేలు, ఉంగరపు వేళ్లలో తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి. ఈ నరంతో సంబంధం ఉన్న చేతిలోని 16 కండరాలు కూడా వ్యాధి ప్రభావానికి గురవుతాయి.
పిండి కట్టుతో ప్రెషర్‌ పాల్సీ
ఎముకలు విరిగినప్పుడు వాటిని జోడించి పిండి కట్టు వేస్తూ ఉంటారు. ఇలా కట్టు కట్టేటప్పుడు ఎముకకు, కట్టుకు మధ్య నరం నొక్కుకుపోకుండా చూసుకోవాలి. లేదంటే పిండి కట్టు వల్ల విరిగిన ఎముక అతుక్కున్నా నరం ఒత్తిడికి గురై ప్రెషర్‌ పాల్సీ బారిన పడుతుంది. ఫలితంగా కట్టు కట్టించుకున్న ఆ అవయవం పూర్తిగా పని చేయకుండాపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను ప్రారంభంలోనే గ్రహించగలిగితే నరం ప్రెషర్‌ పాల్సీకి గురవకుండా కాపాడవచ్చు. లేదంటే పూర్తి అవయవమే పనికిరాకుండా పోవచ్చు.
తిమ్మిర్లను ఎప్పుడు సీరియస్‌గా పరిగణించాలి?
రెండు వారాలు అంతకంటే ఎక్కువ కాలం తిమ్మిర్లు వేధిస్తూ ఉంటే ఆ పరిస్థితిని సీరియస్‌గా భావించాలి. అలాగే తిమ్మిర్లు కంటిన్యుయస్‌గా ఉంటూ రోజు రోజుకీ ఎక్కువవుతూ ఉంటే ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పరిస్థితికి న్యూరోపతీ లేదా శరీరంలో అంతర్గతంగా ముదిరిపోతున్న వ్యాధికి సూచనగా భావించాలి.
తిమ్మిర్ల లక్షణాన్ని బట్టి వ్యాధిని గుర్తించే పరీక్షలు
తిమ్మిర్ల కారణాన్ని గుర్తించే పరీక్షల్లో ‘నర్వ్‌ కండక్షన్‌ స్టడీ’ ప్రధానమైనది. అలాగే మధుమేహం, థైరాయిడ్‌, విటమిన్‌ డెఫిషియన్సీ పరీక్షలు చేస్తారు. తిమ్మిర్లతోపాటు కీళ్ల నొప్పులు, నోటి అల్సర్లు కూడా ఉండే కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్‌గా నిర్ధారిస్తాం. 20ు రోగుల్లో తిమ్మిర్లకు అసలు కారణాన్ని కనిపెట్టడం కష్టం. పరీక్షలన్నీ చేసినా మూల కారణం కనిపించకపోవచ్చు. కారణం లేకపోయినా ఈ రకమైన రోగుల్లో నరాలు ప్రభావితవుతూ ఉంటాయి. ఈ రకమైన రుగ్మతను ఇడియోపతిక్‌ న్యూరోపతీ అంటారు. ఇలాంటప్పుడు ఆ రోగులకు సింప్టమాటిక్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తాం. అంటే తిమ్మిర్లు తగ్గటానికి మందులిస్తూ క్రమం తప్పక చెకప్‌కి రావాలని సూచిస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో చికిత్స మొదలుపెట్టిన కొంత కాలానికి తిమ్మిర్లకు కారణమైన అసలు వ్యాధి బయటపడొచ్చు. అలాగే ఇలాంటి పరీక్షలతో పనిలేకుండా కూడా తిమ్మిర్ల లక్షణాన్ని బట్టి కూడా వ్యాధిని కనిపెట్టవచ్చు. తిమ్మిర్ల లక్షణం, తీవ్రత, ప్రదేశం, ప్రసరించే వేగంతోపాటు తిమ్మిర్ల పాజిటివ్‌ లేదా నెగిటివ్‌ లక్షణాల ఆధారంగా వ్యాధిని అంచనా వేయొచ్చు.
మధుమేహం చికిత్సతో న్యూరోపతీ
మధుమేహ వ్యాధికి నరాలకు దగ్గర సంబంధం ఉంది. ఈ రోగుల్లో ప్రధానంగా కనిపించే లక్షణం తిమ్మిర్లు. ప్రారంభంలో కాళ్లకే పరిమితమైనా వ్యాధి పెరిగేకొద్దీ తిమ్మిర్లు అన్ని అవయవాలకూ పాకొచ్చు. కొన్ని సందర్భాల్లో శరీరం మొత్తం కూడా తిమ్మిర్లు కనిపించొచ్చు. మధుమేహ చికిత్సలో భాగంగా ఇచ్చే ఇన్సులిన్‌ వల్ల కూడా ఇన్సులిన్‌ న్యూరైటిస్‌ అనే వ్యాధి రావచ్చు. ఈ వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
వంశపారంపర్య తిమ్మిర్లు
తిమ్మిర్ల లక్షణం వంశపారంపర్యంగా కూడా సంక్రమించవచ్చు. ఈ రకమైన రుగ్మతను ‘హెరిడిటరీ న్యూరోపతీ లయబిలిటీ టు ప్రెషర్‌ పాల్సీస్‌’ అంటారు. ఈ వ్యాధిగ్రస్థులు చాలా తేలికగా తిమ్మిర్లకు గురవుతూ ఉంటారు. కొద్దిసేపు చేతులను కుర్చీకి ఆనించిపెట్టినా తిమ్మిర్లు మొదలవుతాయి. అంటే వీళ్లకు ప్రెషర్‌ పాల్సీ టెండెన్సీ ఉంటుంది.
పక్షవాతం - తిమ్మిర్లు
పక్షవాతానికి తిమ్మిర్లకు చాలా దగ్గర సంబంధం ఉంది. ముఖ్యంగా కొన్ని వ్యాధుల్లో మొదట తిమ్మిర్లు కనిపిస్తాయి. కొంతకాలానికి అవే పక్షవాతానికి దారి తీస్తాయి. పిల్లల్లో, 25 ఏళ్లలోపు వయసు వారిలో వచ్చే ఫ్యాబ్రీస్‌ డిసీజ్‌ తిమ్మిర్ల లక్షణంతో దాడిచేస్తుంది. చర్మంపై పిగ్మెంటేషన్‌ కూడా కనిపిస్తుంది. ఈ వ్యాధిగ్రస్థులే తర్వాతి దశలో పక్షవాతానికి కూడా గురవుతారు. కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్‌ రోగులో, మధుమేహ రోగుల్లో తిమ్మిర్లతోపాటు పక్షవాతమూ కనిపించవచ్చు. ఈ వ్యాధిగ్రస్థుల్లో శరీరంలోని ఏ అవయవమైనా ఎఫెక్ట్‌ అవ్వొచ్చు. కొన్నిసార్లు పక్షవాతం వచ్చిన తర్వాత ఎఫెక్ట్‌ అయున అవయవంలో తిమ్మిర్లు రావొచ్చు.
తిమ్మిర్లను తగ్గించే మందులు
తిమ్మిర్ల లక్షణాన్ని బట్టి రోగాన్ని నిర్ధారించి చికిత్స చేయటంతోపాటు తిమ్మిర్ల తీవ్రతను తగ్గించటానికీ చికిత్స చేస్తారు. ఇందులో భాగంగా నోటి మాత్రలతోపాటు క్యాప్సేసిన్‌ అనే పైపూత మందును కూడా వాడవచ్చు. తిమ్మిర్లు కలిగే ప్రదేశంలో ఉపయోగించే లోకల్‌ అనస్థటిక్‌ స్ర్పేలు కూడా ఉపయోగించవచ్చు.
తిమ్మిర్లు రాకుండా ఉండాలంటే?
తాత్కాలికంగా తలెత్తే తిమ్మిర్లను పాజిటివ్‌ సింప్టమ్స్‌గా భావించాలి. వీటి వల్ల ప్రమాదమేమీ లేకపోయినా కొద్దిపాటి ఇబ్బంది మాత్రం ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది ఉండకూడదనుకుంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
- కూర్చుని పని చేసేవారు ప్రతి 40 నిమిషాలకోసారి లేచి 5 నిమిషాలపాటు నడవాలి.
- బిగుతుగా ఉండే బూట్లు ధరించకూడదు.
- వాహనాలు నడిపేవాళ్లు కూడా ప్రతి రెండు గంటలకోసారి వాహనం దిగి కనీసం 5 నిమిషాలపాటు నడవాలి.
- ఫ్లూటిస్ట్‌, తబలా కళాకారులు వేళ్లు ఒత్తిడికి గురయ్యే ప్రదేశాల్లో కుషన్స్‌ లేదా ప్యాడ్స్‌ ఉపయోగించాలి.
- డాక్టర్‌. ఆర్‌. ఎన్‌. కోమల్‌ కుమార్‌

నర్వ్‌ బయాప్సీ
క్యాన్సర్‌ను కనిపెట్టడం కోసం రోగగ్రస్థమైన భాగాన్ని బయాప్సీ చేయటం మనకు తెలిసిందే! అదే పద్ధతిలో కొన్ని రకాల న్యూరోపతీలను, వ్యాధి రకాన్ని కనిపెట్టలేకపోయిన సందర్భాల్లో నర్వ్‌ బయాప్సీ చేస్తారు. ఇందుకోసం లావాటి నరం లేదా వ్యాధి గ్రస్థమైన సన్నని నరాన్ని ఎంచుకుంటారు. కాలి చీలమండలంలో సూరల్‌ అనే లావైన నరం ఉంటుంది. దీన్లో కొంత భాగాన్ని సేకరించి బయాప్సీకి పంపుతారు. సన్నని నరాలను బయాప్సీ చేయాలంటే వాటిని కత్తిరించక తప్పదు. ఇలాంటప్పుడు నరం కత్తిరించిన ప్రదేశంలో రోగులు స్పర్శ కోల్పోతారు. మధుమేహం, థైరాయిడ్‌, విటమిన్‌ డెఫిషియన్సీ రోగులకు ఆల్కహాలిక్‌ న్యూరోపతీ పేషెంట్లకు నర్వ్‌ బయాప్సీ చేయరు.
రసాయనాల ప్రభావంతో తిమ్మిర్లు
కొన్ని రకాల రసాయనాల ప్రభావం వల్ల కూడా పెయిన్‌ఫుల్‌ న్యూరోపతీ (తిమ్మిర్లు) రావొచ్చు. అవేంటంటే...
1. ఆర్సెనిక్‌, 2. మెర్క్యురీ (పాదరసం),
3 ఎలుక మందు, . లెడ్‌ (సీసం)

శరీర అవయవాలు - తిమ్మిర్లు - వ్యాధులు
కొన్ని వ్యాధుల లక్షణాలు తిమ్మిర్లతోనే మొదలవుతాయి. ఇందుకు ఉదాహరణగా ప్రధానంగా మధుమేహం గురించి చెప్పుకోవచ్చు. ఈ వ్యాధి నరాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపించటమే ఇందుకు కారణం. మధుమేహ రోగుల్లో మొదట శరీరంలోని అతి పొడవాటి నరం ఎఫెక్ట్‌ అవుతుంది. ఈ నరాలు కాళ్లలో ఉంటాయి కాబట్టి తిమ్మిర్లు కాళ్ళలోనే మొదలవుతాయి. సాధారణంగా మధుమేహం వ్యాధిని గుర్తించే సమయానికే శరీరంలో 20ు నరాలు దెబ్బతిని ఉంటాయి.
- చేతుల్లో తిమిర్లు - టాంజియాస్‌, అమెలాయిడోసిస్‌
- కాళ్లలో తిమ్మిర్లు - డయాబెటిస్‌. ట్రైజెమినల్‌ న్యూరోపతీ
- ముఖంలో తిమ్మిర్లు - జాగ్రెంట్‌ సిండ్రోమ్‌, ట్రైజెమిరల్‌ న్యూరాల్జియా
- ముఖంలో తిమ్మిర్లతోపాటు నొప్పి - మల్టిపుల్‌ స్క్లిరోసిస్‌
- మొండెం భాగంలో తిమ్మిర్లు (పొట్ట, ఛాతీ) - మధుమేహం, క్యాన్సర్‌
- తొడల్లో తిమ్మిర్లు - మెరాల్జియా పారస్థెటికా (డ్రైవర్లకు ఎక్కువ)
- నాలుకలో తిమ్మిర్లు - మల్టిపుల్‌ స్క్లిరోసిస్‌
- కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు - మెదడు సంబంధ సమస్యలు