Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 13:19PM

ఢిల్లీ తర్వాత దేశంలో తొలి స్మార్ట్‌సిటీ విజయవాడే : వెంకయ్య

విజయవాడ,సెప్టెంబర్‌ 15 : ఢిల్లీ తర్వాత దేశంలో తొలి స్మార్ట్‌సిటీ విజయవాడే అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం నగరంలో జరిగిన స్మార్ట్‌ సిటీ అవగాహన సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ దేశంలో 100 స్మార్ట్‌సిటీల నిర్మాణం మోదీ కల అని వెల్లడించారు. మనదేశంలో 32 శాతం మందే పట్టణాల్లో నివసిస్తున్నారని, 2050 నాటికి 50 శాతం మంది పట్టణాల్లో నివసిస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
 
పట్టణాల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలన్నారు. వీజీటీఎంలో మెట్రో రైలు తన కల అని వెంకయ్య పేర్కొన్నారు. విజయవాడలాంటి నగరాల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని, మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోవాలన్నారు. పన్నుల వసూలుతోనే పనులు జరుగుతాయని, నిధులు లేకుండా పనులు జరగవని అభిప్రాయపడ్డారు.
 
ప్రజల ఆలోచనలో మార్పురాకపోతే పట్టణాలు మురికి కూపాలుగా మారతాయని వెంకయ్య తెలిపారు. రాజధానిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఏపీ మంత్రులు ఆచరణ సాధ్యమైన హామీలే ఇవ్వాలని వెంకయ్య సూచించారు. భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో అనుమతులివ్వాలని తెలిపారు. ఆలస్యం జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. 10 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలే మోదీ లక్ష్యమని, ఇప్పటికే 3 కోట్ల మంది ఎన్‌రోల్‌ చేసుకున్నట్లు వెంకయ్యనాయుడు తెలియజేశారు.