Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 9 2016 @ 12:16PM

కో.. ఢీ

 • ఏళ్ల చరిత్ర.. వేల ఖరీదు పందెం పుంజుల సొంతం 
 • పెంపకం నుంచి శిక్షణ వరకు అన్నీ ప్రత్యేకమే.. 
 • పందాలకు ముస్తాబవుతున్న గ్రామాలు 
 • సంక్రాంతికి పల్లెల్లో ప్రధాన సందడి ఇదే 
నల్ల డేగపై నాలుగు లక్షలు...కాకి పుంజుపై లక్షన్నర...మైలపచ్చపై సై అంటే సై...ఏంటీ లెక్కలనుకుంటున్నారా...సంక్రాంతి వస్తే పల్లెజనం నోట్లో నానే మాటలివి. గ్రామీణ ప్రజల సంక్రాంత్రి శోభకు అదనపు సొబగులద్దే కోడిపందాల్లో పందాలరాయుళ్లు కాసే మొత్తాలివి. లక్షల్లో కాదు కోట్లలో బిజినెస్‌. అంతా నోటిమాటే. చూసేందుకు సాధారణ పోటీలా ఎక్కడా ‘నోటు’ అలికిడే కనిపించకున్నా తెరవెనుక కోట్ల టర్నోవర్‌ వీటి స్పెషల్‌. పండగకు వారం రోజులే ఉండడంతో అప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో పందాల జాతర ప్రారంభమైంది. సై అంటే సై అంటున్న యజమానులు తమ కోళ్లను ఐదు నెలల ముందు నుంచే ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. కఠోర శిక్షణ, బలవర్థకమైన ఆహారంతో వాటి సామర్థ్యానికి అదనపు శక్తి సమకూర్చుకున్న
కోడిపుంజులు బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి.


చోడవరం : ఊరికి దూరంగా ఓ పెద్ద తోట...తోటలో ఓ మైదాన ప్రాంతం..చుట్టూ బారికేడ్లు...వాటి వెనుక జనం హోరు...మధ్యలో రెండు కోళ్ల మధ్య ఢీ అంటే ఢీ అంటూ సమరం... పోటీ పుంజుల్ని హుషారెత్తిస్తూ వాటి యజమానుల అరుపులు, కేకలు...వారితో గొంతు కలిపే పందెం రాయుళ్లు, చూసేందుకు వచ్చే ప్రేక్షకులు. తోటలో ఎక్కడ చూసినా కార్లు, ద్విచక్ర వాహనాలు, ప్రేక్షకుల్లో కొందరు వీఐపీలు, మరికొందరు అ(న)ధికారులు, ఇంకొందరు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు. చూస్తే ఓ జాతరను తలపించే ఈ సంబరం సంక్రాంతి సంబరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే దృశ్యం. సంక్రాంతి సమీపిస్తుండడంతో నెలరోజుల ముందే పందెం రాయుళ్లకు సంక్రాంతి వచ్చేసింది. ఎప్పుడెప్పుడు బరిలో దిగుదామా అన్న ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నారు. సంక్రాంతి తర్వాత వరుసగా ఐదు నెలలపాటు పల్లెల్లో జాతర్ల జోరు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పండగ జోష్‌ కనిపిస్తుంది. గ్రామీణ సంస్కృతిలో భాగంగా మారిపోయిన కోడిపందాలు ఈ జాతర్లలో భాగంగా కొనసాగుతాయి. సంక్రాంతితోపాటు జాతర స్థాయిని బట్టి ఒక్కో పందెం రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు సాగుతుంది. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిగిపోతాయి. క్షణాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారే ఈ పందాల కారణంగా చాలా మంది జాతకాలే మారిపోతుంటాయి. అప్పటికప్పుడు లక్షాధికార్లు అయినవారు, బికార్లుగా మారిన వారూ ఉంటారు. ఇళ్లు, పొలాలూ కోల్పోయిన వారూ కనిపిస్తారు. అయినా జీవితాలను మార్చేసే ఈ జూదానికి క్రేజ్‌ తగ్గక పోవడమే విశేషం. సంక్రాంతి సమీపిస్తున్న వేళ కోడిపందాలు, వాటి వెను కథా కమామీషుపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.


తాళపత్ర గ్రంథాల్లో పందాల సమాచారం
కోడిపందాలు ప్రాచీన సంప్రదాయమనేందుకు తాళపత్ర గ్రంథాలు సాక్ష్యం. కోడి పుంజులు, వాటి రకాలు, ఏ రకం పుం జు పోరాట లక్షణం ఏమిటి, ఏ రకం పుంజుపై ఏ రకాన్ని బరి లోదించితే విజయావకాశాలు ఉంటాయనే వివరాలు ఈ తాళ పత్ర గ్రంథాల్లో లభిస్తుండడం విశేషం. ఈ కారణంగానే కొం దరు ప్రత్యేకంగా ఈ తాళ పత్ర గ్రంథాలను వెంట పెట్టుకుని మరీ పోటీలకు హాజరవుతుం టారని పందెం కోళ్ల యజమా నులు చెబుతున్నారు. విజయ నగరం రాజు, బొబ్బిలి రాజుల మధ్య యుద్ధానికి అగ్గిరాజేసింది కూడా కోడిపందాలే అన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. అనాదిగా గ్రామీణ సంస్కృతిలో భాగమైపోయిన కోడిపందాలు, పుంజుల పెంపకం ఓ యజ్ఞంలా సాగుతుండడమే చరిత్ర చెబుతున్న వాస్తవం.

అమ్మో...ఎన్నో రకాలు

 • సాధారణ కోడిపుంజులకు భిన్నంగా పందెం పుంజులు దృఢంగా ఉంటాయి. రంగు, సామర్థ్యాన్ని అనుసరించి దాన్ని పలానా తెగ అని గుర్తిస్తారు. 
 • ఎరుపు రంగులో ఉండే పుంజును డేగ అని, నీలం రంగులో ఉంటే కాకి అని పిలుస్తారు. 
 • పందెం కోళ్లను రంగు, ఎత్తు, ఈకలు, శరీర నిర్మాణాన్ని అనుసరించి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. 
 • ప్రధానంగా డేగ, నల్లసవల, పూల, పింగళ, సేతువ, డేగపర్ల, నల్లపాశ, మైల, కాకి, పచ్చకాకి, పెట్టమర్రి తదితర రకాలు ముఖ్యమైనవి. 
 • కోడిపుంజు ఈకల్లో కాస్త తెల్లరంగు ఎక్కువ ఉంటే దాన్ని తెల్లసవలగా, నల్లరంగులో ఉంటే నల్లసవలగా గుర్తిస్తారు. 
 • డేగ ఈకల్లా ఉండే కోడిని డేగగా పిలుస్తారు. కొన్ని రకాల కోడి తోకలు నెమలి తోకల్ని పోలి ఉంటాయి. ఈ రకాలను కాకి, మైలపచ్చకాకి రకాలుగా పిలుస్తారు. 
 • పందెంకోడి జాతి, సామర్థ్యాన్ని అనుసరించే బెట్టింగ్‌ బాబులు పందెం కాస్తారు. 
పందెం కోళ్ల మెనూ ఇది...
ఇంట్లో పిల్లలకు ఎలా బలవర్థక ఆహారం అందించి వారి పెరుగుదల, సామర్థ్యాలను పరిరక్షించాలని ప్రయత్నిస్తామో పందెం కోడిపుంజుల యజమానులు కూడా వాటిని అదే స్థాయిలో సాకుతారు. ఓ వీఐపీ ఆహార మెనూ ఎలా ఉంటుందో కోడిపుంజు ఆహారం మెనూ అలా ఉంటుంది. తక్కువలో తక్కువగా వారానికి రూ.2 వేలు వీటి ఆహారానికి ఖర్చవుతుంది. వీటి ఆహారంలో ప్రధానంగా జీడిపప్పు, బాదం పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్‌మిస్‌, కోడిగుడ్డులో తెల్లసొన, మేకపాలుతోపాటు బలవర్థకమైన ఇతర ఆహార పదార్థాలు కూడా సమకూర్చుతారు. దంపుడు బియ్యం, రాగులు, గంట్లు, మినపపప్పు, శెనగపప్పు, గోధుమలు కలిపిన మిశ్రమ ఆహారం పెట్టి కోడి శరీరాన్ని దృఢంగా తయారు చేస్తారు. పందాలకు అనుగుణంగా వీటి ఆహారం మెనూలో కూడా మార్పులు చేర్పులు చేస్తారు. పోటీకి సిద్ధమయ్యే సమయానికి కోడిపుంజులకు ఇచ్చే ఆహారం పూర్తిగా మార్చివేస్తారు.

పందాలు రెండు రకాలు
సాధారణంగా కోడిపందాలు రెండు రకాలు. ఎక్కువగా కత్తి పందాలు, డింకీ పందాల రూపంలో నిర్వహిస్తారు. గ్రామాల్లో ఆయా పరిస్థితులను బట్టి ఈ రెండు రకాల పందాలు జరుగుతుంటాయి. కత్తిపందానికి దించాలా, డింకీ పందానికా అన్నది కోడి యజమాని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఒకే రకమైన పందెం కోళ్లను సమ ఉజ్జీగా భావిస్తారు. కోడి జాతి, ఆ పుంజు సామర్థ్యంపై ఉన్న అంచనాను అనుసరించి పందెం జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కోడి యజమాని కట్టే బెట్టింగ్‌ కంటే బయట జరిగే బెట్టింగ్‌లే వందల రెట్లలో ఎక్కువ ఉంటాయి.

కత్తి పందెం: పోటీల్లో పాల్గొనే కోడి పుంజుల కాళ్లకు కత్తులు కట్టి బరిలో దించితే దాన్ని కత్తిపందెం అంటారు. పోటీ పుంజుల్లో కత్తిదెబ్బ కాచుకుని చివరి వరకు ఏ పుంజు నిలుస్తుందో అది విజేత అవుతుంది. ఈ పందెంలో కత్తిగాటుపడి పందెంకోళ్లు మృత్యువాత పడుతుంటాయి. చాలా తక్కువ సమయంలో ఈ పోటీలో ఫలితం వస్తుంది.
డింకీ పందెం: కోడి పుంజులను మామూలుగా బరిలోకి దింపితే దాన్ని డింకీ పందెం అంటారు. ఈ పోటీ పూర్తిగా కోడి శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. రెండు కోళ్ల శక్తిసామర్థ్యాలను బట్టి ఈ పోటీలో ఫలితం ఒక్కోసారి చాలా ఆలస్యమవుతుంది. కత్తిపందాల్లో పాల్గొనే పుంజుల కంటే డింకీ పందాల్లో పాల్గొనే పుంజులు చాలా దృఢంగా ఉంటాయి.

కఠోర శిక్షణ
పందెం కోళ్ల పెంపకం అంటే ఏదో ఆహారం పెట్టేస్తే సరిపోతుందనుకుంటే పొరపాటు. వాటికి మిలిట్రీ శిక్షణ అందజేస్తారు. బల వర్థకమైన ఆహారం తినిపించడంతోపాటు రన్నింగ్‌, స్మిమ్మింగ్‌, ఇతరత్రా శిక్షణలు అందజేస్తారు. కఠోర శిక్షణ అనంతరం ఒంట్లో నొప్పులు పోయేందుకు మసాజ్‌ చేస్తారు. రోజూ ఉదయాన్నే కోడిపుంజును పరిగెత్తిస్తారు. కోడి బాగా అలసిపోయాక దాని నోట్లో నీరుకొట్టి కఫాన్ని బయటకు తెప్పిస్తారు. దీనివల్ల పోటీ సమయంలో కోడిపుంజు అలసిపోకుండా ఉంటుంది. అనంతరం పచ్చికోడిగుడ్డు తెల్లసొన తినిపించి కాసేపటి తర్వాత మరో అరగంట పరిగెత్తిస్తారు. తర్వాత కాసేపు విశ్రాంతి ఇస్తారు. అనంతరం జీడిపప్పు, బాదంపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, నల్లజీలకర్ర, తెల్లజీలకర్ర, గసగసాలు దంచిన మిశ్రమాన్ని ముద్దగా తయారుచేసి కోడిపుంజులకు తినిపిస్తారు.
 
కోడిపుంజు కొత్తశక్తిని సంతరించుకునేందుకు ఈ ఆహారం ఉపయోగపడుతుంది. భోజనానంతరం రెండు గంటలపాటు కోడికి విశ్రాంతి ఇస్తారు. ఆ తర్వాత సమీపంలోని వాగు లేదా చెరువుకి తీసుకువెళ్లి ఈత కొట్టిస్తారు. రోజంతా ఈ ఎక్సర్‌సైజుల వల్ల కోడి ఓంట్లో నొప్పులు చేరితే తీసివేసేందుకు బాడీ మసాజ్‌ చేస్తారు. కట్టెల మంటపై మట్టిపిడత ఉంచి దాన్ని వేడిచేస్తారు. ఆ వేడిని ఓ గుడ్డకు పట్టించి ఆ గుడ్డతో కోడి తలకు, ఒంటికి, కాళ్లకు మసాజ్‌ చేస్తారు. దీనివల్ల కోడి ఒంట్లో ఎక్కడైనా నొప్పులు ఉంటే అవి పోవడానికి ఈ మసాజ్‌ ఉపకరిస్తుంది. రాత్రికి కూడా మంచి ఆహారం పెట్టి విశ్రాంతి ఇస్తారు.
 
కోళ్ల గుర్తింపు ఓ నైపుణ్యం
గ్రామాల్లో పందెం కోళ్లను గుర్తించడం ఓ నైపుణ్యంగా భావిస్తారు. పందెం కోళ్లను గుర్తించడం, వాటిని పోటీలకు సిద్ధం చేయడమే వృత్తిగా జీవిస్తున్నవారు ఎందరో ఉంటారు. వీరిలో నేరుగా పందాల్లో పాల్గొనే వారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది పం దెం కోళ్లను గుర్తించి శిక్షణతో తయారు చేశాక ఆసక్తి ఉన్న వారికి అమ్ముతారు. మరి కొందరు ఎవరో పెట్టుబడి పెడితే తమ సంరక్షణలో వాటికి శిక్షణ ఇచ్చి సిద్ధం చేస్తారు. పందెం కోళ్లకు విపరీతమైన గిరాకీ ఉం టుంది. పందాలపై ఆసక్తి ఉన్న వారు మంచి కోళ్లను కొనుగోలు చేసేందుకు గ్రామాల్లో తిరుగుతూ మంచి శిక్షకుల గురించి వాకబు చేస్తారు. వారివద్దకు వెళ్లి ఎంపిక చేసి మరీ వీటిని కొనుగోలు చేస్తారంటే ఈ నిపుణులకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో అర్థం అవుతుంది.

ధర వేలు...లక్షలు
పందెం కోళ్ల ధర వేల నుంచి లక్షల్లో ఉంటుంది.
ఒక్కో పుంజు తక్కువలో తక్కువ రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతుంది. కోడిపుంజుల సాధారణ ధర రూ.15 వేల వరకు ఉంటుంది. కాకుంటే సామర్థ్యం, శిక్షణ కాలం, పోటీల సంఖ్య తదితరాల ఆధారంగా వీటి ధర పెరుగుతూ వస్తుంది. కొన్ని ప్రత్యేక అంశాల వల్ల ఒక్కోసారి ధర రూ.లక్షలు దాటుతుంది.