Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 07:38AM

ఏ సమస్యకైనా ‘పరిష్కారం’


కొత్త కార్యక్రమంపై ప్రభుత్వ యోచన ... ప్రతి అర్జీకి జవాబుదారీ..
ప్రత్యేక కాల్‌ సెంటర్ల ఏర్పాటు .. ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా సమాచారం
పరిష్కారం కాని అర్జీలకు ఆడిటింగ్‌... మూడు జిల్లాల కలెక్టర్లతో సూచన కమిటీ
సీఎం చంద్రబాబుకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
నెల్లూరు, సెప్టెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యలు, పౌర సంబంధాలు, పోలీసు, సంక్షేమం ఇలాంటి విషయాల్లో ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తారు. సంబంధిత కార్యాయంలోని అధికారులకు ఈ విషయమై ఓ అర్జీ పెట్టుకుంటారు. మరి... సమస్య పరిష్కారం అవడానికి ఎంత కాలం పడుతుంది? కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు కాళ్లు అరిగేలా తిరగాలి? ఇదంతా కాదు... అసలు మీ అర్జీ ఏ దశలో ఉంది? ఇవేమైనా తెలుసా? ఇన్ని బాధలు కాకుండా.. మీ సమస్య పరిష్కారానికి ఓ నిర్ణీత గడువు ఉంటే! అర్జీ కదలికలను ఎప్పటికప్పుడు ఫోన్‌ ద్వారా మీకు సమాచారం అందిస్తే! ఆ గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అఽధికారులపై చర్యలు తీసుకుంటే! ఏంటీ ఇదంతా జరిగే పనేనా అనుకుంటున్నారా..?! ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్లు, డివిజన్‌, మండల స్థాయి అధికారులకు ప్రజలు అందించే ఫిర్యాదులకు పూర్తి స్థాయి ‘పరిష్కారం’ ఇచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. శాసీ్త్రయ పద్ధతిలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మూడు జిల్లాల కలెక్టర్లతో సూచన కమిటీని నియమించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపే వరకు అధికారుల వెంట పడడం, లేదంటే ఆ అర్జీపై స్వచ్ఛంద సంస్థలచే ఆడిటింగ్‌ విధానం నిర్వహించడం చేస్తారు. ఫిర్యాదు చేసిన వారికి ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్ల ద్వారా సమాచారం చేరవేస్తారు. రెండ్రోజుల క్రితం సీఎం చంద్రబాబు, సీఎస్‌ కృష్ణారావు సమక్షంలో ‘పరిష్కారం’పై ప్రాఽథమికంగా రూపొందించిన వివరాలతో అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అన్నీ అనుకూలిస్తే నవంబర్‌ నుంచి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.
నెల్లూరు జిల్లానే ప్రేరణ
ప్రతి సోమవారం జిల్లా, డివిజన్‌, మండల స్థాయిల్లో గ్రీవెన్స్‌ సెల్‌ (ప్రజా ఫిర్యాదులు) నిర్వహించి వాటిని ఆయా అధికారుల ద్వారా పరిష్కారం చూపుతూ వస్తున్నారు. ఇది అన్ని జిల్లాల్లో అమలవుతున్నా.. నెల్లూరు జిల్లాలో మాత్రం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ‘పరిష్కారం’ పేరుతో అధికారులకు అందిన ఫిర్యాదులను పరిష్కరిస్తూ వస్తున్నారు. ప్రతివారం సుమారు 700కు పైగా అందిన అర్జీలను ఎప్పటికప్పుడు వాటిని క్రోడీకరించి పరిష్కరించడం లేదా వాటిని ఎందుకు పరిష్కరించలేకపోయారో ఫిర్యాదుదారుకు తెలియజేసే విధంగా జిల్లా కేంద్రంలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డేటాను సేకరించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీనిపై ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు రాష్ట్ర స్థాయిలో అర్జీల పరిష్కారం కోసం సూచన, సలహాలు అందించే విధంగా నెల్లూరు కలెక్టర్‌ శ్రీకాంత్‌, కృష్ణా కలెక్టర్‌ రఘునందరావు, అనంతపురం కలెక్టర్‌ సాల్మన్‌ ఆరోగ్యరాజ్‌తో సూచన కమిటీని నియమించారు. ఈ మూడు జిల్లాల కలెక్టర్లు చర్చించుకుని అర్జీల పరిష్కారానికి కొత్త విధానాన్ని రూపొందించి రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని వీక్షించి కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు నవంబరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
అర్జీ అంటే..?
మీ సేవ కేంద్రాలలో లభించని పరిష్కారాలన్నింటినీ అర్జీలుగా నిర్ణయించారు. ప్రధానంగా భూ సమస్యలు, సివిల్‌ సప్లయ్‌, పోలీసు, సంక్షేమం తదితర సమస్యలపైనే 50 నుంచి 60 శాతం వరకు అధికారులకు అర్జీలు అందుతున్నాయి. సీఎం నుంచి కలెక్టర్లు, డివిజన్‌ అధికారులు, మండల స్థాయి అధికారులను ప్రజలు కలిసి వారి వ్యక్తిగత, సామాజిక సమస్యలపై అర్జీలు అందిస్తూనే ఉన్నారు. ఎవరికి వారుగా అందిస్తున్న ఈ సమస్యలు చాలా వరకు ఒకే రకమైనవిగా ఉండడంతో వీటిని వర్గీకరణ చేసి గడువు మేరకు పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నారు. పిటిషనర్‌ అందిస్తున్న సమస్య చరిత్ర తెలుసుకోవడమే కాక, వాటిని ఏ అధికారి పరిష్కరిస్తారో ఆ అధికారికి సంబంధిత అర్జీని అందచేస్తారు. పరిష్కార వ్యవస్థలో శాఖల పరంగా సీఎం, హెచ్‌వోడీ కార్యాలయాలు, జిల్లా కేంద్రాల్లో 20 కౌంటర్లు చొప్పున మండల స్థాయిలో ఒకే కౌంటర్‌ ఏర్పాటు చేసి కాల్‌ సెంటర్లను నిర్వహిస్తారు. ఆధార్‌ నెంబరుతో ఈ అర్జీలను రిజిసే్ట్రషన్‌ చేసి ఫిర్యాదుదారుడికి రసీదు అందిస్తారు. ఆ తరువాత అర్జీ కదలికను ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్ల ద్వారా కాల్‌ సెంటర్ల నిర్వాహకులే ఫిర్యాదు దారుడికి ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. ప్రతి ఫిర్యాదుకు జవాబుదారీతనం ఇవ్వడమే కాక, వాటి పరిష్కార బాధ్యత కూడా అధికారులే చూస్తారు. ప్రతి అర్జీని పది వర్గాలుగా విభజించి భూ సమస్యలు, వ్యక్తిగత లబ్ధి, జీవనోపాధి, విద్య, ఆరోగ్యం, రక్షణ, ఉద్యోగులు, అవినీతి ఇతర అంశాలతోపాటు ఉప అంశాలను కూడా చేర్చారు. ఒక వేళ ఫిర్యాదును ఇచ్చిన గడువులోగా పరిష్కరించలేకపోతే ఆ ఫిర్యాదు కాల్‌ సెంటర్ల వారీగా ఉన్న స్వచ్ఛంద సంస్థల ఆడిటింగ్‌ విభాగానికి చేరుతుంది. ఈ ఆడిటింగ్‌లో అధికారులు నిర్లక్ష్యంతో పరిష్కారం కాలేదేమోనని పరిశీలిస్తారు. కాల్‌ సెంటర్ల స్థాయిలో పీఎంయూ టీఎంలు పని చేస్తాయి. మొత్తం మీద ప్రజలు ఒకే సమస్యపై ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా వాటికి పరిష్కారం కాక పదే పదే అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం వంటి అగచాట్లకు ఈ విధానంతో అడ్డుకట్ట పడుతుంది.