Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 9 2016 @ 01:08AM

అడుగడుగునా అక్రమాలు

  • ఆర్డినెన్స్‌కు సహకరించకండి: ఉత్తమ్‌..
  • గవర్నర్‌కు కాంగ్రెస్‌ ఫిర్యాదు


హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్ని అడ్డదారులు తొక్కిందో, అక్రమాలకు పాల్పడిందో గవర్నర్‌ నరసింహన్‌కు వివరించామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల షెడ్యూలు మొదలుకొని అనేక అక్రమాలకు టీఆర్‌ఎస్‌ పాల్పడిందని గవర్నర్‌కు వివరించామని చెప్పారు.
 
శుక్రవారం టీపీసీసీ నేతలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల లక్ష్యయ్య, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, దానం నాగేందర్‌, క్యామ మల్లేష్‌ తదితరులు గవర్నర్‌ నరసింహన్‌ కలిశారు. అనంతరం ఉత్తమ్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తొలి దశలో ఓటర్ల తొలగింపు కార్యక్రమం చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించడం, మరికొన్ని లక్షల మందికి నోటీసులు పంపి.. పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకొనేందుకు టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రయత్నం చేసిందని ఉత్తమ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెటిలర్ల ఓట్ల తొలగింపుపై ప్రధానంగా దృష్టి సారించిందని మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ అలుపెరగని పోరాటం చేసి ఢిల్లీ వరకు వెళ్లిందని గుర్తు చేశారు. వార్డుల పునర్విభజన ప్రక్రియలో కూడా అధికార పార్టీ తనకు అనుకూలమైన విధానం పాటించిందని, రిజర్వేషన్ల ప్రక్రియనూ ఇష్టానుసారం చేపట్టిందని ధ్వజమెత్తారు.
 
ఇది ఆయా వర్గాలను తీవ్రంగా నష్టపరుస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం చేయడం ద్వారా గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ లాభపడాలని చూస్తోందని విమర్శించారు. చట్ట విరుద్ధంగా మున్సిపల్‌ చట్టంలో మార్పులు చేసి ప్రతిపక్షాలకు ప్రచారానికి అవకాశం లేకుండా చేయాలనుకున్నారని.. అయితే హైకోర్టు జోక్యంతో ఈ విషయం సమసిపోయిందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వం ఆర్డినెన్స జారీ చేయాలని ప్రయత్నిస్తే అందుకు సహకరించ కూడదని తాము గవర్నర్‌ను కోరినట్లు ఉత్తమ్‌ కుమార్‌ తెలిపారు. తమ వినతికి గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.