desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 8 2016 @ 10:46AM

అమెరికన్ మగాళ్ళ కంటే ఎన్నారై మహిళలే టాప్

వాషింగ్టన్ :  భారతీయ మహిళలు అత్యంత ప్రతిభావంతులని మరోసారి రుజువైంది. అమెరికాలో భారతీయ అమెరికన్ మహిళలు అక్కడి శ్వేతజాతి పురుషుల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారని తాజాగా వెల్లడైంది. అయితే ఆసియన్ అమెరికన్ పురుషులతో పోల్చితే ఆసియన్ అమెరికన్ మహిళలు డాలర్‌కు 78 సెంట్లు మాత్రమే ఆర్జిస్తున్నారని తెలిసింది. అమెరికా కార్మిక గణాంకాల బ్యూరో నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు తెలిశాయి.
 
ఆఫ్రికన్ అమెరికన్లలో స్త్రీ, పురుషుల సంపాదనలో తక్కువ తేడా కనిపిస్తోంది. నల్ల జాతి పురుషులు ఒక డాలర్ సంపాదిస్తే నల్ల జాతి మహిళలు 90 సెంట్లు సంపాదిస్తున్నారు. చదువులో స్పానిష్ మాట్లాడని శ్వేత జాతీయులకన్నా ఆసియన్ అమెరికన్లు ముందు ఉన్నారు. విద్యార్హతల విషయంలో 25 ఏళ్ల వయసు పైబడిన శ్వేత జాతీయులు, ఆసియన్ అమెరికన్లను పరిశీలించినపుడు డిగ్రీ, అంత కన్నా ఎక్కువ చదివినవారు శ్వేతజాతీయుల్లో 33 శాతం మంది మాత్రమే, కాగా ఆసియన్ అమెరికన్లలో 50 శాతం మందికి పైగా ఉన్నారు. ఇండియన్ అమెరికన్లలో దాదాపు 72 శాతం మందికి కాలేజీ డిగ్రీలు, 40 శాతం మందికి వృత్తి విద్య, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ డిగ్రీలు సాధించడంలో శ్వేతజాతీయులకన్నా ఇండియన్ అమెరికన్లే పైచేయి సాధించారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఆసియన్ అమెరికన్లలో 21.8 శాతం మందికి గ్రాడ్యుయేట్ లేదా ప్రొఫెషనల్ డిగ్రీలు ఉన్నాయి. స్పానిష్ మాట్లాడని శ్వేతజాతీయుల్లో 12.8 శాతం మందికి మాత్రమే ఇటువంటి అర్హతలు ఉన్నాయి.
 
2014 లెక్కల ప్రకారం ఫుల్ టైమ్ జాబ్ చేసే ఆసియా పురుషుల (871 డాలర్లు) కన్నా ఆసియా మహిళలు (841 డాలర్లు) వారానికి కేవలం 3 శాతం మాత్రమే తక్కువగా సంపాదిస్తున్నారని వెల్లడైంది. 2014లో ఫుల్ టైమ్ జాబ్ చేసే నల్ల జాతీయులు వారానికి 680 డాలర్లు, స్పానిష్ మాట్లాడే పురుషులు 616 డాలర్లు సంపాదించారు. వీరికన్నా ఆసియా మహిళల సంపాదన ఎక్కువగా ఉందని తెలిసింది.