Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 7 2016 @ 10:46AM

ఆటలో అరటి పండులా మారిన డిప్యూటీ సీఎం.... కడియం డిప్యూటీ పదవి వదులుకోక తప్పదా ?

ఆయనో డిప్యూటీ సీఎం.. తన జిల్లాకు తానే రాజనుకుంటారు..పార్టీ మారకముందు.. పార్టీ మారిన తర్వాత ఒకే పంథాను అనుసరిస్తున్నారు. జిల్లాలో గ్రూపు రాజకీయాలకు తెరదీసిన ఈ రాజకీయ నాయకుడు కొంతకాలమే తన హవా కొనసాగించారు. ఆ తర్వాత తన ప్రాతినిధ్యం తగ్గుతుందనుకుంటున్న తరుణంలో ఏదో ఒకటి చేయాలనుకున్నా.. తెరాస అధినేత ముందు ఈ నేత కుప్పిగంతులు సాగడం లేదు. ఎంపీ ఎన్నికలు మొదలుకొని ఎమ్మెల్సీ వరకు.. నియోజకవర్గాల వారీగా ఆ నేతకు గులాబీ దళపతి ఆంక్షలు విధించారట. అంతేకాదు.. జిల్లాలో ఉన్న తన పార్టీ ఎమ్మెల్యేలలో కొందరితో పూర్తి స్థాయి వైరం.. మరికొందరు పైకి నటించినా.. అంతర్గతంగా విభేదిస్తున్న పరిస్తితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆ డిప్యూటీ సీఎం గారు కేవలం సమీక్షలకు తప్ప పర్యటనలే తక్కువై కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకూ ఎవరా నేత.. ఏంటా కథ..
 
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది.. టీఆర్ఎస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన జిల్లా ఓరుగల్లు.. తెలంగాణలో ఎక్కడ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. ఈ జిల్లాలో మాత్రం గులాబీదళం ఎదురులేని శక్తిగా ఎదిగింది. ఇక్కడి నేతల తలరాతలు గతంలో ఎలా ఉన్నా.. తెలంగాణ రాష్ర్ట సమితిలోకి మారిన తర్వాత చాలా మంది జాతకాలే మారిపోయాయి. ఆకర్షణలు, వికర్షణలతో కొందరు ఊహించని పదవులు దక్కించుకుంటే.. మరికొందరు దక్కించుకున్న పదవులు కాపాడుకోలేక చతికిలపడిపోయారు. ఈ క్రమంలో కడియం శ్రీహరి గురించి చెప్పుకోవాలి. వరంగల్ ఎంపీగా రికార్డు స్థాయి మెజారిటీ సాధించిన కడియం శ్రీహరి ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు డిప్యూటీగా ఉన్న డాక్టర్‌ .టి.రాజయ్యపై కొన్ని ఆరోపణలతో కేసీఆర్ హఠాత్తుగా ఈ మార్పు చేయడం జిల్లాలో కొంత సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలలో గ్రూప్ వార్ మొదలైంది. అంతకుముందు వరకు స్తబ్దుగా ఉన్న కడియం శ్రీహరి ఒక్కసారిగా డిప్యూటీ సీఎంగా అడుగుపెట్టడంతో చాలా మంది నేతలకు కొంత ఇబ్బంది మొదలైంది. గతంలో తెలుగుదేశం పార్టీలో కడియం శ్రీహరి బాధితులుగా ఉన్నవారు కొందరు ఈ వ్యవహారంతో మరింత ఇబ్బంది పడ్డారు.
 
కడియం శ్రీహరి డిప్యూటీగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన సొంత నియోజకవర్గమైన స్టేషన్ ఘన్‌పూర్‌లో గొడవలు మొదలయ్యాయి. అంత క్రితమే డాక్టర్‌ రాజయ్య వర్గానికి, కడియం వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో రాజయ్యను తొలగించి కడియంకు పదవి కట్టబెట్టడంతో పరిస్థితి మరింత సీరియస్ అయింది. ఒకదశలో కడియం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పర్యటించడానికి వచ్చినప్పుడు ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో సాక్షాత్తు కేసీఆరే కడియంను స్టేషన్ ఘన్‌పూర్‌కు వెళ్లొద్దంటూ ఆదేశించారట. ఆ తర్వాత రాజయ్య కూడా కడియం తన నియోజకవర్గంలో అడుగుపెడితే తన తడాఖా చూపిస్తానంటూ అనుచరులతో, తోటి నేతలతో అన్నట్టు సమాచారం. దీంతో వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో కడియం పెద్దగా స్టేషన్‌ ఘన్‌పూర్‌పై దృష్టి పెట్టలేదట. తన సీజీఎఫ్ నిధుల నుంచి ఎక్కువ మొత్తంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికే కేటాయించినా.. కడియం మాత్రం అక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడం అయన వర్గంలో కొంత అసహనం కనిపిస్తోంది. రాజయ్య మాత్రం మరోసారి కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అంతేకాదు.. తన పదవికి చెక్ పెట్టిన కడియంకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారట!
 
వరంగల్ తూర్పులోనూ కడియంకు చెక్ పెట్టేశారు కొండా కపుల్. తన అడ్డాలో కడియం అడుగుపెట్టొద్దంటూ కొండా దంపతులు హుకుం జారీ చేశారు. ఎంపీ ఎన్నికల సమయంలో వరంగల్ తూర్పులో ఇన్‌ఛార్జ్‌ హరీశ్ రావుతో పాటు తాము ప్రచారం చేస్తామే తప్ప కడియం రావొద్దని కొండా మురళి స్వయంగా కేసీఆర్‌కు చెప్పారట. అసలు కడియం వస్తే.. మెజారిటీ తగ్గడం కాదు.. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దెబ్బతింటామని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత కొండాకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకుండా కడియం అన్ని ప్రయత్నాలు చేశారు. ఒక దశలో ఆయన అలిగి బయటకు వచ్చినట్లు కూడా అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో కడియం స్వయంగా కొండా పేరు ప్రకటించి అటు తర్వాత నామినేషన్ వరకు కొండా మురళితో సఖ్యంగా కనిపించారు. వరంగల్ పశ్చిమలోనూ కడియం సీన్ అంతంత మాత్రమే.
 
నోట్లో నాలుక లేనట్లుగా కనిపించే వినయ్ భాస్కర్ అంతర్గతంగా కడియంను విభేదిస్తూనే.. బయటకు మాత్రం ఏమనలేక కొన్ని కార్యక్రమాలకు సహకరిస్తున్నారు. ఇక వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తన నియోజకవర్గంలో కడియంను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తే.. భవిష్యత్‌లో తనకు చెక్ పెట్టే ప్రమాదాన్ని ముందే ఊహించి ఏదో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా కడియంకు దూరంగానే ఉంటున్నారట! వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితాలు వస్తున్న సమయంలో దయాకర్‌...కడియం కంటే ఎక్కువ మెజారిటీ సాధించారని మీడియాలో చెబుతుంటే కడియం తట్టుకోలేక తన పేరెందుకు చెబుతారని ఆవేశపడినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పసునూరి తనకు కేసీఆర్ అండదండలు ఉండగా కడియంతో పనేంటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట!
 
పాలకుర్తి నియోజకవర్గంలో తన చిరకాల ప్రత్యర్థి ఎర్రబెల్లిని కట్టడి చేయడానికి ప్రయత్నించి విఫలమైన కడియం అక్కడ కూడా పెద్ద గొడవకు కారణమయ్యారని తెలంగాణ రాష్ర్ట సమితి వర్గాలు చెబుతున్నాయి. దీంతో కడియంను పాలకుర్తికి కూడా పోవద్దంటూ కేసీఆర్ సూచించారట! ఇక మిగిలిన పరకాలలో తన పాతమిత్రుడు చల్లా ధర్మారెడ్డితో అడపాదడపా కలిసిమెలిసి తిరుగుతున్నట్లు కనిపించినా.. ధర్మారెడ్డి మాత్రం కడియంతో అవసరపూర్తి స్నేహం చేస్తున్నారని, కేసీఆర్‌కు కడియంకు మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయని తెలిసినప్పటినుంచి కడియంకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడొకరు చెప్పారు. జనగామలో కడియంకు అసలు అవకాశమే లేదు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఏకంగా కేసీఆర్ ఆంతరంగికుడు కావడంతో జనగామ విషయంలో కడియం జోక్యం తగ్గించారు. భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీ సమావేశాలు మినహాయిస్తే.. మిగిలిన సమయంతా సొంత నియోజకవర్గంలో ఉంటూ అభివృద్ధి పనులు చేస్తుండడం.. అక్కడ డిప్యూటీగా తనను పెద్దగా పట్టించుకోకపోవడంతో కడియం కొంత ఆగ్రహంతో ఉన్నారట! అయితే ఈ విషయం కేసీఆర్ కు చెప్పినా.. పెద్దగా లాభం లేదని తనకుతానే కుమిలిపోతున్నట్లు సమాచారం. ఈ విషయం గ్రహించిన స్పీకర్ కొన్ని కార్యక్రమాలకు కడియంను కూడా పిలుస్తున్నారు. నర్సంపేటలో కూడా కడియంకు చుక్కెదురే అవుతోంది. స్థానిక నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని కాదని అక్కడ ఎలాంటి పని చేయొద్దంటూ కేసీఆర్ ఆర్డర్ ఉందట.
 
 
దాదాపుగా ములుగు, మహబూబాబాద్ నియోజకవర్గాలు మినహాయిస్తే.. అన్నిచోట్లా కడియంకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో అడపాదడపా కలెక్టరేట్‌లో సమీక్షలు నిర్వహిస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన సమీక్షలు, జిల్లా అభివృద్ది పనుల సమీక్షలు మినహాయిస్తే.. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో పెద్దగా తిరిగిందేమీ లేదని అధికారులే చెబుతున్నారు. ఇటీవల రెండురోజులు జిల్లా పర్యటన ఉన్నట్లుగా ముందస్తు సమాచారం ఇచ్చి చివరి నిముషంలో క్యాన్సిల్ చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు కడియం డిప్యూటీ సీఎంగా కొనసాగుతారా..? లేదా అన్న సందిగ్ధత ప్రస్తుతం ఓరుగల్లు టీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఈ దిశగా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో తన శాఖ కాకుండా.. ఇతర శాఖల వ్యవహారంపై తనకు తోచినదేదో మాట్లాడేందుకు ప్రయత్నించిన కడియం అనవరసర పెత్తనం చెలాయించినట్లుగా ఫిర్యాదులు రావడంతో కేసీఆర్ కడియంను మందలించారట! మొత్తంగా కడియం సమీక్షలకు తప్ప జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ తిరిగే పరిస్థితి లేకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చి అందరు ప్రజాప్రతినిధులతో కలిసిపోతారా .. ?లేక కేసీఆర్ ఆగ్రహానికి గురికావలసిన పరిస్థితి కడియంకు తప్పదా....?