desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 11:22AM

కొత్త కార్డులు గందరగోళం

  • ఫొటోలు లేకుండా రేషన్ కార్డులు పంపిణీ
  • పేర్లులో కూడా తప్పులతడకలు
  • కుటుంబ సభ్యులందరి పేర్లూ లేని వైనం
  • యజమాని పేరుంటే సభ్యుల పేర్లు గల్లంతు
  • దిద్దుబాటు చర్యల్లో అధికారులు
కొత్త రేషన్‌ కార్డులు వచ్చాయన్న ఆనందాన్ని... వాటిలో వున్న తప్పుల తడకలు మింగిశాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో అధికారులు అందజేస్తున్న కొత్త రేషన కార్డులో తప్పులు విపరీతంగా వున్నాయి. కార్డులపై ఫొటోలు లేకపోవడం, పేర్లు సరిగా లేకపోవడం, కార్డుపై యజమాని పేరుండి కుటుంబ సభ్యుల పేర్లు లేకపోవం వంటి ఎన్నో విచిత్రాలు జరిగాయి. వీటిని అందుకుంటున్న వారు విస్మయం చెందుతున్నారు. దీనిపై కొన్నిచోట్ల అధికారులను నిలదీస్తున్నారు. తప్పుల తడకలతో ఉన్న ఇటువంటి కార్డులపై చంద్రన్న సంక్రాంతి కానుకలు, తరువాత ఫిబ్రవరి నుంచి నిత్యావసర సరుకులు అందుతాయో లేదోనని ఆయా కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు, దిద్దుబాటు చర్యల కోసం ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)
సుదీర్ఘకాలం నిరీక్షణ తరువాత జిల్లాలో లక్షా 15 వేల 356 మందికి కొత్త రేషన కార్డులు మంజూరు అయ్యాయ. వాస్తవంగా కొత్త రేషన కార్డుల కోసం లక్షా 75 వేల దరఖాస్తులురాగా, వడపోతల అనంతరం అర్హుల లెక్క తేల్చారు. వీరందరికీ ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమి కార్యక్రమంలో కొత్త రేషన కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులను పురమాయించింది. ఇదిలావుండగా దరఖాస్తుల స్వీకరణ సమయంలో అర్జీదారుడితోపాటు కుటుంబ సభ్యులంతా ఉన్న ఫొటో అందజేయాలన్న నిబంధనను పాటించలేదు. దీంతో కొంతమంది కుటుంబ సభ్యులతో కూడిన ఫొటో కాకుండా పాస్‌పోర్టు సైజు ఫొటోను మాత్రమే దరఖాస్తుతోపాటు అందజేశారు. మొత్తం లక్షా 15 వేలు అర్జీలు అర్హమైనవిగా అధికారులు తేల్చగా, వాటిలో 16,800 మంది మాత్రమే మొత్తం కుటుంబ సభ్యులు వున్న ఫొటోను దరఖాస్తుతోపాటు అందజేశారు. మిగిలిన వారెవరూ కుటుంబ ఫొటోను ఇవ్వకుండా, కేవలం పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో మాత్రమే ఇచ్చారు. దీంతో కొత్త రేషన్‌ కార్డుల మంజూరుపై తర్జనభర్జనలు సాగాయి.
 
           తొలుత కార్డులకు బదులు కూపన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. కానీ తరువాత ఈ నిర్ణయాన్ని మార్చుకుని, కార్డులివ్వాలని అధికారులను ఆదేశించింది. ముందు ప్రభుత్వ అధికారులు, ఆ తరువాత జన్మభూమి కమిటీల ఆమోదముద్రతో జాబితాను ఖరారు చేయాలని ఆదేశించింది. దీంతో జన్మభూమి కార్యక్రమం ప్రారంభం ముందు రోజు వరకు కార్డుల ముద్రణపై సరైన స్పష్టత ఇవ్వలేదు. చివరి నిమిషంలో ముద్రణకు అనుమతివ్వడంతో హడావుడిగా కొత్తకార్డులను ముద్రించాల్సి వచ్చింది. వీటిని జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేయాలని, తరువాత చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇవ్వాలని, ఫిబ్రవరి నుంచి నిత్యావసర సరుకులు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  
 
                   దీంతో రెండో తేదీన ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమంలో కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఆనందంగా వీటిని అందుకున్నవారు, వాటిలోని వివరాలను చూసి కంగుతింటున్నారు. చాలా కార్డుల్లో తప్పులు వున్నాయి. పేరు ఒకరిది వుంటే ఫొటో మరొకరిది వుంది. పేర్లు కూడా మారిపోయాయి. కొన్నింటిలో కుటుంబ యజమాని పేరు మాత్రమే వుంది. దీంతో చంద్రన్న కానుకులు, ఫిబ్రవరి నుంచి నిత్యావసర సరుకులు తమకు అందుతాయో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాలు ప్రభుత్వ దృష్టికి రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దరఖాస్తుదారుల ఆధార్‌ వివరాల సాయంతో కార్డులపై కుటుంబ సభ్యుల ఫొటోను ముద్రించాలని భావిస్తున్నది.