Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 03:51AM

పేదల బియ్యం కోళ్లకు దాణా

  • పక్కదారి పడుతున్న రేషన్‌ సరుకులు
  • ఖద్దరు అండతో చెలరేగుతున్న అక్రమార్కులు
 
హైదరాబాద్‌ సిటీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా తక్కువధరకు బియ్యం అందజేస్తుండగా.. కొందరు అక్రమార్కులు పేదల పొట్టకొడుతూ వాటిని బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఒకప్పుడు మిల్లర్ల వద్దకు చేరి.. అటునుంచి తిరిగి బహిరంగ మార్కెట్‌కు చేరిన రేషన్‌ బియ్యం.. ప్రస్తుతం మిల్లుల్లో నూకలుగా మారి కోళ్ల ఫారాలకు చేరు తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థలోని లోపాలు, సిబ్బంది సహకారంతో అక్రమార్కులు యథేచ్ఛగా దందాకు పాల్పడు తున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడుతున్న కొందరు రేషన్‌ డీలర్లు, అధికారులు ఈ దందాలో పరోక్షంగా పాలుపంచుకుం టున్నారు. టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌లు దాడులు నిర్వహించి పట్టుకుంటున్నా.. ఖద్దరు నేతల అండదండలతో వారు తేలిగ్గా బయటపడుతున్నారు.
 
రూటు మారిన దందా
గతంలో కొందరు డీలర్లు రేషన్‌ బియాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండానే తప్పుడు రికార్డులు నమోదుచేసి వాటిని మిల్లర్లకు విక్రయించేవారు. మిల్లర్లు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి తిరిగి మార్కెట్‌లో విక్రయించేవారు. అయితే ఆ తరువాత బియ్యం ముఠాలు రూటు మార్చాయి. కాకినాడ, గుజరాత ఓడరేవుల ద్వారా రేషన్‌ బియ్యాన్ని విదేశాలకు తరలించడం మొదలుపెట్టాయి. బేవరేజ్‌ కంపెనీలకు కూడా రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రేషన్‌ సరుకులను నల్లబజారుకు తరలించకుండా టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌వోటీ పోలీసులు తరచూ దాడులు నిర్వహించారు. దీంతో జంట కమిషరేట్ల పరిధిలో మూడేళ్ల క్రితం రూ.5 కోట్ల సరుకు పట్టుబడితే 2015లో సుమారు రూ.40 కోట్ల సరుకు పట్టుబడింది. అయితే ఈ దాడుల నేపథ్యంలో అక్రమార్కులు మళ్లీ రూటు మార్చారు. తెలంగాణ, ఏపీల్లో పెద్దఎత్తున కోళ్లఫారాలుం డడం, కోళ్లకు నిత్యం టన్నులకొద్దీ దాణా అవసరం ఉండడంతో దొడ్డిదారిన సేకరించిన బియ్యాన్ని హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని మిల్లుల్లో నూకలుగా మారుస్తున్నారు.
 
కీలక సూత్రదారులెక్కడ?
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో రేషన్‌ బియ్యం దందా ఏటా సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అధికారులే అంగీకరిస్తున్నారు.రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, ఘట్‌కేసర్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లోని కొంతమంది రేషన్‌ డీలర్లు కొందరు ప్రజాప్రతినిధుల అండతో చెలరేగుతున్నారనే ఆరోపణలున్నా యి. 2015లో ఎస్‌వోటీ పోలీసులు 375 మందిని అరెస్టుచేసి నా.. కీలక సూత్రధారులు తప్పించుకున్నట్లు సమాచారం. వీరిపై కేసులు లేకుండా స్థానిక పోలీసులపై ఆ ప్రజాప్రతి నిధులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీనికితోడు ఓ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు ఎస్సైలు అక్రమదందాకు సహకరిస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది.
 
ఎస్‌వోటీ పేరిట వసూళ్లు..
శివారు ప్రాంతాల్లోని కొందరు కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఎస్‌వోటీ పేరిట వ్యాపారులను బెదిరిస్తున్నట్లు, డీలర్లు, మిల్ల ర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎల్బీనగర్‌, హయతనగర్‌ ఠాణాల్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డులు బియ్యం లారీలను ఆపి.. మామూళ్లు డిమాండ్‌ చేయటంతో విషయం వెలుగుచూసింది. మామూళ్లు తీసుకుంటూనే కేసులు నమో దు చేస్తున్నారని ఓ రేషన్‌ డీలర్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో నిజమేనని తేలడంతో ఓ కానిస్టేబుల్‌, హోంగార్డుల అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.