Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 03:01AM

ఏర్పేడుకు మహర్దశ


శ్రీకాళహస్తి/ఏర్పేడు: శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఏర్పేడు మండలం దశ మారుతోంది. ఇప్పటివరకు వ్యాపాశ్రమంతో మాత్రమే ఈ ప్రాంతానికి గుర్తింపు ఉం డేది. అయితే మండల పరిధిలో కేంద్ర విద్యాసంస్థలు ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ నెలకొల్పాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించడంతో ఏర్పేడుకు జాతీయస్థాయి గుర్తింపు లభించనుంది. 2015 విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఇక ఐటీ పార్క్‌ కూడా ఇదే ప్రాంతంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్ర విద్యాసంస్థలు, ఐటీ పార్క్‌ ఏర్పాటు చేస్తుండటంతో ఏర్పేడు ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు ఆశిస్తున్నారు.
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ సూచించింది. ఈ మేరకు ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు ఏర్పేడు మండలంలో స్థలసేకరణ చేస్తున్నారు. మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, నారాయణ ఇటీవల ఏర్పేడు మండలంల పర్యటించి భూములను పరిశీలించారు. మేర్లపాక సమీపంలో ఐఐటీ కోసం 440 ఎకరాలు, ఇదే మండలంలోని పంగూరు వద్ద ఐఐఎస్‌ఈఆర్‌ విద్యాసంస్థ ఏర్పాటుకు 398 ఎకరాలు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీరించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నీలం సహానీ ఐదు రోజుల కిందట కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖకు లేఖలు రాశారు. ఈ స్థలాల ఎంపిక కోసం కేంద్ర మానవ వనరుల శాఖ వేర్వేరు కమిటీలను నియమించింది. అయితే ఐఐటీ స్థల ఎంపికకు ఇప్పటికే కమిటీ నియమించారు. ఈ కమిటీలు స్థలపరిశీలన చేసి నివేదికలు అందచేసిన తరువాత భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు కూడా సుముఖంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
ఏర్పేడులో అనుకూల అంశాలివీ
ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌, ఐటీ పార్క్‌ ఏర్పాటుకు ఏర్పేడు ప్రాంతం అనుకూలంగా ఉంది. రేణిగుంట విమానాశ్రయం ఇక్కడకు కేవలం 10 కి.మీ. మాత్రమే. ఇక రేణిగుంట రైల్వేజంక్షన్‌ కూడా సమీపంలోనే ఉంది. ఏర్పేడులో రైల్వేస్టేషన్‌ కూడా ఉంది. ఈ మండల కేంద్రం మీదుగానే పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి వెళుతుంది. ఇక ఏర్పేడు- వెంకటగిరి మార్గాన్ని నాలుగులేన్ల రోడ్డుగా మారుస్తున్నారు. రవాణా సౌకర్యాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. భూగర్భ జలాల సమస్య లేదు. కేవలం 100 అడుగుల లోపే నీరు పుష్కలంగా లభిస్తుంది. ఇక సోమశిల-స్వర్ణముఖి అనుసంధాన కాలువ కూడా పంగూరు, మేర్లపాక గ్రామాల పక్కగానే వెళుతుంది. ఈ కారణంగా ఒక వేళ భూగర్భజలాలు అంతరించినా...నీటి సమస్య ఉత్పన్నం కాదు. భౌగోళిక అంశాలు అన్నీ అనుకూలంగా ఉండటంతో ఏర్పేడు సమీపంలోని పంగూరు వద్ద ఐఐఎస్‌ఈఆర్‌, మేర్లపాక వద్ద ఐఐటీ విద్యాసంస్థలు నెలకొల్పడానికి అధికారులు మొగ్గు చూపుతున్నారు.
నలుదిశలా శ్రీకాళహస్తి ఖ్యాతి వ్యాప్తి
దక్షిణ కైలాసంగా పేరు పొందిన శ్రీకాళహస్తి ఖ్యాతి మరింత వ్యాప్తి చెందుతోంది. ఎన్‌బీపీపీఎల్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మన్నవరం విద్యుత్‌ ఉపకరణాల తయారీ ప్రాజెక్టుతో శ్రీకాళహస్తికి అంతర్జాతీయ చిత్రపటంలో చోటు దక్కింది. ఇక ఇదే నియోజకవర్గ పరిఽధిలో ఉన్న రేణిగుంట విమానాశ్రయం స్థాయి పెంచుతున్నారు. ఐఐటీ, ఐఐఐఎస్‌ఈఆర్‌ వంటి కేంద్ర విద్యాసంస్థలు ఈ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేస్తుండటంతో ఈ ప్రాంత ఖ్యాతి మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐటీ పార్క్‌ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తుండటం కూడా అభివృద్ధికి దోహదపడుతుంది. శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివోలు సమీపంలో ఆక్టోపస్‌ కమెండో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు 600 ఎకరాల స్థలం అవసరమని అఽధికారులు చెబుతున్నారు. ఈ స్థలం ఇప్పటికే అధికారులు పరిశీలించి వెళ్లారు. ఈ సంస్థల కారణంగా శ్రీకాళహస్తికి మంచి గుర్తింపు రానుంది. ఝశీ్ఠఛ్రి