Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 02:59AM

గోల్కొండపై కబ్జాకాండ...!

రాజసం కోల్పోతున్న రాతికోట
ఇప్పుడు సర్కారు వేడుకలకు వేదిక.. అయినా మారని కోట రాత
గుప్త నిధుల కోసం చొరబాట్లు.. అవశేషాలుగా మిగిలిన దర్వాజాలు
ఆకృతిని కోల్పోతున్న మహళ్లు.. పురావస్తు శాఖ హెచ్చకరికలూ బేఖాతరు
కోటని మింగేస్తున్న అక్రమ నిర్మాణాలు

తెలుగు నేల ఎన్ని వంపులు తిరిగిందో, ఎన్ని రూపులు తీసుకొందో గోల్కొండా..అన్ని దశలు దాటి వచ్చింది. అవిభాజ్య పరిపాలన స్థిరపడిన ఘట్టం మొదలు, తెలుగు ప్రజలు రెండు రాషా్ట్రలుగా ఏర్పడిన ఘటన దాకా..ప్రతి మలుపుపైనా తన ముద్దరని అద్దింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తొలి స్వాతంత్య్ర వేడుకలకు వేదికగా నిలిచిన గోల్కొండ కోట..ఒక ప్రేమైక, కళా, సామరస్య జీవన సరళికి తార్కాణం! చారిత్రక ప్రాంతంగా పురావస్తు శాఖ, పర్యాటక కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా.. తెలంగాణ ప్రభుత్వపు అధికార వేడుకల శాశ్వత వేదికగా మారినా..
ఆ వెలుగు రేఖలేవీ గోల్కొండ ప్రాంతాన్ని తాకడం లేదు. ఈ చారిత్రక సౌందర్య రవళిపై కబ్జా కేళి ఆగడం లేదు.
(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ) పది కిలోమీటర్ల విస్తీర్ణంలో గోల్కొండ కోట నిర్మాణమయింది. దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు అనేక మార్పులకు లోనవుతూ..చివరకు ఇప్పుడు మనం చూస్తున్న రూపంలో ‘కోట’ సిద్ధమయింది. మట్టి కోటను ఉక్కు కోటగా మలిచేందుకు వందల ఏళ్లు పడితే..దాన్ని పరిరక్షించేందుకు మరెన్నో వందల ఏళ్లు.. ఎన్నో రాజవంశాలు అంకితమయ్యాయి. కానీ, ఆ ఉక్కుకోటని ‘వట్టి’ కోటగా కుదించేందుకు అట్టే కాలం పట్టడం లేదు.

గోల్కొండ కోటని చారిత్రక కట్టడంగా పురావ స్తు శాఖ గుర్తించింది. అలాంటప్పుడు చిన్న నిర్మాణం చేయాలన్నా పురావస్తు శాఖ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకోవాలి. అలాగే.. జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు అనుమతితోనే రోడ్లు, తాగునీటి నిర్మాణాలు చేపట్టాలి. ఆ ప్రాంతంలో ఇవన్నీ కనిపిస్తాయి గానీ, ఎక్కడా అనుమతులు పొందిన దాఖలా ఉండదు. మరోవైపు, ఆక్రమణల పర్వం యథేచ్ఛగా సాగుతూనే ఉంటుంది. గో ల్కొండ పరిసరాలను గమనిస్తే.. ఫతేదర్వాజ నుంచి కోట ప్రధానద్వారం వరకు రోడ్డుకు ఇరువైపులా ఎ న్నో నిర్మాణాలు చూస్తాం. వాటిలో అధిక భాగం అక్రమ కట్టడాలే!పురావస్తు శాఖ స్వాధీనంలో ఉండగానే..ఇన్నిన్ని నిర్మాణాలు ఎలా వెలిశాయనే ప్రశ్నకు సమాధానం దొరకదు. అంతేకాదు, అన్ని చారిత్రక ప్రదేశాలు ఎదుర్కొంటున్న ‘గుప్త నిధుల వేట’ బెడద కోటకూ తప్పడం లేదు.
యుద్ధాల సమయంలో నవాబులు తమ సంపదనంతా భూగర్భాల్లో దాచేవారనే ప్రచారం ఈ ప్రాంతంలో వినిపిస్తూ ఉంటుంది. కోటలో అనేక చోట్ల గుప్త నిధుల వేటగాళ్లు త వ్వకాలు జరిపినట్టు గుర్తులు కనిపిస్తాయి. కోట గోడల్లో బంగారం, వజ్రాలు నిక్షిప్తమయ్యాయన్న ఆలోచనతో, గోడలను బద్దలుకొడుతున్నారు. కోట లోపలే కాదు.. బయటా విధ్వంసం పెరిగిపోయింది. పట్టణీకరణ వల్ల కొంత, కబ్జాదారుల చేతివాటం వల్ల మరికొంత కోట కళ తప్పుతోంది. సఫిల్‌ (ప్రహరీ) చుట్టూ దాదాపు 60 శాతం మేర కబ్జాకు గురైందనేది ఒక అంచనా!. వజ్రాల విక్రయ కేంద్రం (మోతీమహల్‌).. ధాన్యాలు నిల్వచేసే ధాన్‌కోట్‌ ఆక్రమణదారుల చెరలో బందీ అయ్యాయి. చుట్టూ చెరువులు, ఉద్యానవనాలు, పచ్చని చెట్ల మధ్య కోట కూడా ఒక అందమైన ప్రకృతి ఆవిష్కరణని తలపించేది. కానీ, ఇప్పుడా హృదయానంద దృశ్యాలేవీ కనిపించవు.
కుతుబ్‌షాహీలు స్నానం చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు ఉండేది. దానిని కఠోరా హౌస్‌ అనేవారు. అదెప్పుడూ సుగంధ ద్రవ్యాల సువాసనలు వెదజల్లుతూ ఉండేదట! కానీ ఇప్పుడు ఆ పరిసరాల్లో దుర్గంధం అలుముకొని ఉంది. దానికి సమీపంలోని చెరువు గుర్రపుడెక్కలతో నిండిపోయింది. బాగ్‌ అంటే ఉద్యానవనమని అర్థం. కళా, ప్రకృతి ప్రియులైన కుతుబ్‌షాహీలు ప్రత్యేకంగా కోటలో వనశాలను ఏర్పాటు చేశారు. దాన్నే నగీనాబాగ్‌ అంటారు. ఇప్పుడది నామ్‌కేవాస్తేగా మిగిలిం ది. కోటలో ఎనిమిది దర్వాజాలు ఉంటే..రాకపోకలకు రెండు తలుపులనే ఉపయోగించేవారు. సైనికులు వచ్చిపోవడానికి ఒకటి, మేతకు వెళ్లిన పశురాలు లోపలకి రావడానికి మరొకటి తెరిచేవారు. ఏనుగులతో దండెత్తినా దర్వాజాలు విరక్కుండా.. త లుపులకు అంకుశాలను అమర్చారు.
అదంతా ఇప్పుడు ఒక పురా అవశేషంగా మిగిలిపోతోంది. దర్వాజాలు దాదాపుగా బీటలు వారిపోయాయి. 52 కిటికీలూ ఆకృతిని కోల్పోతున్నాయి. కాగా, గోల్కొండకు అనుబంధంగా నిర్మించిన నయాఖిల్లాని కూడా కోటలో భాగంగానే గుర్తించాలని చరిత్రకారులు కోరుతున్నారు. ఈ ఖిల్లాలోని అట్టరాసిడి (18 మెట్లు) పరిధిలోని దాదాపు వంద ఎకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఇటీవల స్వాతంత్య్ర వేడుకల కోసం ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకొనే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి, భారత సైన్యానికి మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అట్టరాసిడి పరిధిలోని ప్రాంతమంతా తమకు చెందుతుందని ఆర్మీ వాదిస్తోంది.
పర్యాటక కేంద్రమైనా..
చారిత్రక కట్టడాలు గల ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న డిమాండ్‌ సాధారణంగా వినిపిస్తుంటుంది. దానివల్ల జీర్ణావస్థకు చేరిన కట్టడాల మరమ్మతులకు నిధులు లభించడంతోపాటు, ఆ ప్రాంతానికి పూర్వ వైభవం కలుగుతుందని భావిస్తారు. కానీ, గోల్కొండ పరిసరాలను గమనిస్తే, అలాంటి ఛాయలేవీ కనిపించవు. నిజానికి, గోల్కొండ కోటను చారిత్రక పర్యాటక కేంద్రంగా ఎప్పు డో ప్రకటించారు. కానీ రక్షణ గురించి పట్టింపు ఉన్నట్టు కనిపించదు. ఒకనాడు కోటని శత్రువుల నుంచి కాపాడిన పంచలోహ ఫిరంగులకు ఇప్పుడు రక్షణ కరువైంది. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని పగులగొట్టి లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు ఆగంతకులు. ఇప్పటికీ కొన్ని బురుజులపై ఫిరంగులు ఉన్నా..వాటి పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు. దుర్గం వద్ద అజమాయిషీనంతా ప్రైవేట్‌ వ్యక్తులకు వదిలిపెట్టడమే దీనికి కారణమని సామాజికవేత్తలు చెబుతున్నారు.
మట్టిని తొలుచుకొచ్చిన చరిత్ర
ఓరుగల్లు కేంద్రంగా పాలన సాగించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు క్రీస్తుశకం 1143లో మంకల్‌ కొండ చుట్టూ మట్టి కోటను నిర్మించారు. మంకల్‌ కొండపై దేవత వెలిసిందన్న సమాచారం అందుకొన్న ప్రతాప రుద్రుడు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ కొండ చుట్టూ మట్టి కోటని నిర్మించారు. ఆయనకు విషయం చెప్పి..ఆ ప్రాంతం దాకా తీసుకొచ్చిన ఒక గొల్ల బాలుని పేరిట..ఈ ప్రాంతానికి గొల్లకొండ అని పేరు వచ్చింది. కాకతీయుల అనంతరం కుతుబ్‌షాహీలు.. గోల్కొండ అభివృద్ధికి పలు చర్యలు చేపట్టారు.
గోల్కొండని రాజధాని చేసుకొని పాలించారు. ఈ క్రమంలో క్రీస్తుశకం 1518లో కొండ చుట్టూ రాతికోటను నిర్మించా రు. 400 మీటర్ల ఎత్తయిన కొండ చుట్టూ రక్షణ అవసరాల కోసం సఫిల్‌(ప్రహరీ) నిర్మించారు. మనల్ని ఇప్పుడు ఆశ్చర్యపరుస్తున్న అనేక కట్టడాలు, భారీ నిర్మాణాలన్నీ వీరి కాలంలోనే రూపు తీసుకొన్నాయి. దర్వాజ వద్ద నిలిచి..చ ప్పట్లు కొడితే మైళ్ల దూరంలోని దర్బారులోకి ఆ శబ్దం దూసుకెళ్లే ఏర్పాటు అందులో ఒకటి. ఈ దర్బార్‌ నుంచి చార్మినార్‌ వరకు గుర్రంపై వెళ్లేలా సొరం గ మార్గం నిర్మించారు. కోటలోని పంచలోహ ఫిరంగులు మరో ఆకర్షణ. కొండపై ఉన్న జగదాంబిక అమ్మవారికి నైవేద్యం ఇవ్వడంతో బోనాల ఉత్సవం మొదలయి.. అక్కడే ముగుస్తాయి.
ఆక్రమణల నుంచి కాపాడాలి!
గోల్కొండ కోట పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నదనే పేరిట చేతులు దులుపుకోవడం సరికాదు. సరిపడా నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగాలి. సినిమా షూటింగులకు అనుమతిస్తున్నక్రమంలో, కట్టడాలకు హాని కలగకుండా చూడాలి. ఔటర్‌ వాల్‌ నుంచి ఇన్నర్‌ వాల్‌ దాకా..అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఉదాసీనంగా వ్యవహరిస్తే కోటపైనా ఆక్రమణ జరిగే ప్రమాదం ఉం ది. నయాఖిల్లా కూడా కోటలో భాగమే.. దానినీ పరిరక్షించాలి.
- ఎం. వేదకుమార్‌, అధ్యక్షుడు, ఫోరం ఫర్‌ బెటర్‌ హైదరాబాద్‌