Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 4 2016 @ 23:53PM

మిలట్రీకి మాధవరం

దేశం కోసం యువత ముందుకు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, అలా ముందుకు వచ్చే వీరుడు తమ ఇంట్లో పుట్టాలని మాత్రం ఎవరూ కోరుకోరు. కానీ, మాధవరం వాసులు మాత్రం ఇందుకు భిన్నం. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో ఉన్న ఈ గ్రామంలోని ప్రతి గడప నుంచి ఓ వీరజవాన్‌ కదనరంగంలో కాలుదువ్వినవాడే. దేశరక్షణ కోసం ప్రాణాలివ్వడానికి సై అన్నవాడే. అందుకే ఈ ఊరు మిలట్రీ మాధవరంగా పేరుగాంచింది.

మాధవరంలో పొద్దుపొడిచే వేళకు.. ఓ యాభై మంది యువకులు క్రమశిక్షణతో పరిగెత్తుతుంటారు. ఆ తర్వాత బస్కీలు తీయడం, కుస్తీలు పట్టడం, కండలు పెంచే వ్యాయామాలు చేస్తుంటారు. ఎందుకివన్నీ చేస్తున్నారని అడిగితే మా ఊరుపేరు నిలబెట్టడానికని చెబుతారు. వీరంతా భారత సైన్యంలో చేరడానికి కసరత్తు చేస్తున్నవారే. మాధవరం యువతకు మిలట్రీ మోజు ఇప్పుడు పుట్టింది కాదు. ఈ ఊళ్లో తరతరాలుగా వీరజవాన్లు పుడుతూనే ఉన్నారు.
 
సైన్యం కోసం..
మాధవరం గ్రామం నిర్మించిందే సైన్యం కోసం. పదిహేడో శతాబ్దంలో గజపతి వంశానికి చెందిన రాజు పూసపాటి మాధవ వర్మ.. తన రాజ్య రక్షణ కోసం ఈ గ్రామానికి సమీపంలో ఓ కోటను నిర్మించాడట. ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి ప్రత్యేకంగా సైన్యాన్ని రప్పించి వారికిక్కడ సాగుభూమిని కూడా ఇచ్చాడట. అలా వచ్చిన సైనికులే మాధవరం గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారని చరిత్ర. ఆ తర్వాతి కాలంలో మాధవరం వేలాది మంది సిపాయి చిన్నయ్యలకు పురిటిగడ్డగా మారింది. నేటికీ ఈ గ్రామం నుంచి దాదాపు నాలుగు వందల మంది జవాన్లు సరిహద్దు భారతంలో గస్తీ తిరుగుతున్నారు. భారత సైన్యంలో సేవలందించి రిటైర్‌ అయినవారు మరో ఐదువందల మందికిపైగా కనిపిస్తారు.

ప్రపంచయుద్ధాల్లో..
మొదటి ప్రపంచయుద్ధంలో మాధవరం వీరులు పదుల సంఖ్యలో పాల్గొన్నారు. ఆ యుద్ధంలో దాదాపు 19 మంది వీరమరణం పొందారు. రెండో ప్రపంచయుద్ధంలోనూ వెయ్యికిపైగా మంది సైనికులు పాల్గొన్నారు. రెండు ప్రపంచయుద్ధాల్లో అమరులైన వీరులకు గుర్తుగా ఈ గ్రామంలో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం రెండు స్మారక స్తూపాలను ఏర్పాటు చేసింది కూడా. ప్రస్తుతం ఆ రెండింటిని ఒకటిగా చేసి కొత్తగా అమరవీరుల స్మారక స్తూపం నిర్మించారు.

జై జవాన్‌..
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కూడా సైన్యానికి ఈ ఊరు వరంగా నిలిచింది. 1947-48 ఇండో-పాక్‌ వార్‌ నుంచి కార్గిల్‌ వార్‌ వరకు అన్ని యుద్ధాల్లోనూ మాధవరం జవాన్లు పాల్గొన్నారు. పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ నేటికీ ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరైనా సైన్యంలో చేరుతున్నారు. మిలట్రీలో చేరాలని అంతలా ఎందుకు కోరుకుంటారని ప్రశ్నిస్తే.. ‘అంతా ఇక్కడి మట్టి మహిమ’ అన్న సమాధానం వస్తుంది. పచ్చని పంట పొలాలు.. ఇంటింటికీ ఇన్నేసి కొబ్బరిచెట్లతో.. నిండా పచ్చదనంతో కళకళలాడే మాధవరాన్ని చూడగానే ఎవరైనా ముందుగా జై కిసాన్‌ అంటారు. ఈ ఊరు చరిత్ర తెలిశాక మాత్రం జై జవాన్‌ అనకుండా ఉండలేరు.
 
రొద్దం కిశోర్‌, తాడేపల్లిగూడెం
  • సైన్యంలో చేరేవారిని అల్లుడిగా చేసుకోవాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. మిలట్రీ మాధవరంలో మాత్రం సైనికులు ఉండే కుటుంబం నుంచే కోడలు రావాలని, తమ ఇంటి ఆడపిల్లను సైనికుడున్న ఇంటికే ఇవ్వాలని కోరుకుంటారు. గ్రామంలోని ప్రతి కుటుంబంలో కొడుకు లేదంటే అల్లుడైనా ఆర్మీలో ఉంటాడు.
  • దేశరక్షణలో మిలట్రీ మాధవరం ప్రాధాన్యాన్ని గుర్తించిన రక్షణ శాఖ గ్రామ అభివృద్ధికి రూ.10.23 కోట్ల నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇలా రక్షణ శాఖ ఓ గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించడానికి ఆసక్తి చూపడం ఇదే తొలిసారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.