desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 02:54AM

కేసీఆర్‌కు కళ్లెం వేద్దాం!


ఆయన పోకడపై పోరు తీవ్రం
బడ్జెట్‌ సమావేశాలే వేదిక
శ్రేణుల్లో స్తబ్దత పోగొట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ
ఎర్రబెల్లి ఇంట 3 గంటలకుపైగా టీ-టీడీపీ నేతల చర్చ

హన్మకొండ, సెప్టెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒంటెద్దు పోకడకు కళ్లెం వేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని టీడీపీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీర్మానించారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పటిష్ఠం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన తెలంగాణ సీనియర్‌ నేతలు.. అసెంబ్లీలో టీడీపీపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంట భేటీ అయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆదివారం ఆ పార్టీకి చెందిన ఒక లోక్‌సభ సభ్యుడు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, పది మంది ఎమ్మెల్యేలు వరంగల్‌ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సాలరమ్మ దేవతలను దర్శించుకున్నారు.
హైదరాబాద్‌కు తిరిగి వెళ్ళేముందు హన్మకొండలోని ఎర్రబెల్లి నివాసంలో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై లోతుగా చర్చ జరిగింది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యాచరణపై స్థూలంగా చర్చించారు. కేసీఆర్‌పై పోరాటానికి బడ్జెట్‌ సమావేశాలను వేదిక చేసుకోవాలని స్థూలాభిప్రాయానికి వచ్చారు. టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌లపై రాజకీయ పోరాటాన్ని ముమ్మరం చేస్తూనే పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయి నుంచి ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు.
కేడర్‌లో నెలకొన్న స్తబ్దతను తొలగించేందుకు ప్రత్యేక కృషి సాగించాలన్న అభిప్రాయం వ్యక్తమయింది. ఈ సమావేశంలో ఎంపీ నల్లమల్లారెడ్డి (మల్కాజిగిరి), రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్‌రావు (వరంగల్‌), గుండు సుధారాణి (వరంగల్‌), చల్లా ధర్మారెడ్డి (పరకాల), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీం పట్నం), తీగల క్రిష్ణారెడ్డి (మహేశ్వరం), కృష్ణారావు (కూకట్‌పల్లి), గాంధీ (షేర్‌లింగంపల్లి), సాయన్న (కంటోన్మెంట్‌), వివేక్‌ గౌడ్‌ (కుత్బుల్లాపూర్‌), రేవంత్‌రెడ్డి (కొడంగల్‌), మాగంటి గోపీనాథ్‌ (జూబ్లీహిల్స్‌), తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, మాజీ ఎమ్మె ల్యేలు ప్రకాశ్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, భూపాలపల్లి ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.