Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 4 2016 @ 00:00AM

సాహిత్యానికి ఒత్తిడిని తగ్గించే శక్తి

  • శాసన మండలి చైర్మన్‌ చక్రపాణి
  • రాగద్వేషాలను చక్కదిద్దే బాధ్యత మానసిక నిపుణులదే
  • ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌
 
విజయవాడ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సాహిత్యంలో ఒత్తిడిని తగ్గించే ఉత్తేజం ఉందని, మంచి పుస్తకాలు చదవటం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి అన్నారు. మంచిని పాటిస్తూ, చెడుని విస్మరిస్తే.. టెన్షన తగ్గుతుందని ఆయన చెప్పారు. విజయవాడలో జరుగుతున్న 27వ పుస్తక మహోత్సవంలో ఆదివారం చలసాని ప్రసాద్‌ సాహిత్య వేదికపై ఎమెస్కో ప్రచురణ డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్‌ రచించిన ‘ఒత్తిడి కూడా వరమే’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చక్రపాణి మాట్లాడుతూ, ఒత్తిడిని తగ్గించుకోవటం మన చేతిలోనే ఉందని చెప్పారు. చట్టసభలో ఉండగా ఎంతో ఒత్తిడికి లోనైన సందర్భంలో ఛాంబర్లో కూర్చుని మంచి పుస్తకంలో రెండు వ్యాక్యాలు చదివినా ఎంతో ఉత్ర్పేరణ పొందుతానని చెప్పారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ మనలో ఉండే అంతరాలు, రాగద్వేషాలు మనుషులను చెడ్డవాళ్ళను, బలహీనులుగానూ చేస్తాయన్నారు. వీటన్నింటిని చక్కదిద్దే బాధ్యత మానసిక వికాస నిపుణులు తీసుకుంటున్నారని చెప్పారు. ముందుకు వెళ్ళాలనుకునే దేశంలో వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం పెంపొందించే పుస్తకాలే ఎక్కువగా వస్తాయని అమెరికాకు చెందిన నిపుణుడొకరు చెప్పారన్నారు. పాతికేళ్లుగా యువకులు, రైతుల్లో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఇవన్నీ వ్యవస్థాగతమైన వైనా వాటిని ఎదిరించటానికి వ్యక్తిగతంగా అయినా సహాయం చేసే వారు కావాలని, అలాంటి ప్రయత్నం చేసిన పట్టాభిరామ్‌ను అభినందిస్తున్నానని చెప్పారు. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ మాట్లాడుతూ, పట్టాభిరామ్‌ రచనలు ప్రజల నిత్యజీవిత పరిష్కారాలకు అనువైన పరిష్కారాలు చూపిస్తాయన్నారు. పుస్తక రచయిత పట్టాభిరామ్‌ మాట్లాడుతూ గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఒత్తిడి ఒక వరం అవుతుందని చెప్పిన అంశాన్ని ప్రస్తావిస్తూ, తాను అనేక మంది మనస్తత్వనిపుణులతో మాట్లాడిన తర్వాత ఈ రచనకు అంకురార్పణ చేసినట్టు తెలిపారు.