Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 3 2016 @ 01:17AM

100 గజాల క్రమబద్ధీకరణకు గడువు పెంపు

  • మార్చి వరకూ తాజా అవకాశం 
  • తొలి విడత దరఖాస్తులపై పూర్తికాని విచారణ 
  • పరిశీలన తర్వాతే పట్టాలు 
హైదరాబాద్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణలో దరఖాస్తుల స్వీకరణ గడువును మరో మూడు నెలలు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లుకు సమాచారం ఇచ్చింది. ప్రజలకు ఈ సమాచారం చేరవేయాలని, విస్త్రతంగా ప్రచారం కల్పించాలని, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) అనిల్‌ చంద్రపునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ఆదేశాలతో అధికారులు డిసెంబరు నెలాఖరుతో దరఖాస్తుల స్వీకరణను నిలిపివేశారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి నెలాఖరు వరకూ పొడిగించారు. మరోవైపు, ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తులపై విచారణను వేగంగా పూర్తిచేయాలని సీసీఎల్‌ఏ ఆదేశాలు ఇచ్చారు.
2014 తర్వాత ప్రభుత్వ భూముల్లో ఇళ్లువేసుకున్న పేదలకు 100 గజాల వరకూ ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని అమలుకు ప్రభుత్వం జీవో 296ను జారీ చేసింది. అభ్యంతరం లేని భూములనే క్రమబద్ధీకరించేలా మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు ‘మీ-సేవ’ కేంద్రాల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.
 
దరఖాస్తులు అందిన 90 రోజుల్లోగా రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి పట్టాలు ఇచ్చేస్తామని తెలిపింది. కానీ, ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ పట్టాలు ఇవ్వలేదు. సామాన్య ప్రజలకన్నా ఎక్కువగా దళారులే ఇందులో భాగస్వాములయ్యారని అధికారులు గుర్తించారు. దరఖాస్తులను విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న నిబంధనను జీవోలో చేర్చారు. ఇది అధికారులకు ప్రధాన సమస్యగా మారింది. విచారణ సందర్భంగా తమపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని అధికారులు వాపోతున్నారు. దీంతో ఏడు జిల్లాల్లో ఇప్పటికీ విచారణ ప్రక్రియను పూర్తిచేయలేదు.
 
తాజా సమాచారం ప్రకారం 80,031 దరఖాస్తులు రాగా 2,026 తిరస్కరించి 78,005ను పరిశీలనకు స్వీకరించారు. విశాఖపట్టణం జిల్లా నుంచే అత్యధికంగా 35,682 దరఖాస్తులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 19,027 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్‌ నాటికే దరఖాస్తులపై విచారణ ప్రక్రియను పూర్తిచేయాలని టార్గెట్‌ విధించారు. అయితే ఇప్పటి వరకూ కడప, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో విచారణ దాదాపుగా పూర్తయింది. దరఖాస్తులు అత్యధికంగా ఉన్న విశాఖపట్టణం, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, గోదావరి జిల్లాల్లో దరఖాస్తుల విచారణ పూర్తికాలేదు. దీంతో గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.