Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 3 2016 @ 00:22AM

యథేచ్ఛగా తిరిగిన ఉగ్రవాదులు

24 గంటలపాటు అక్కడే విహారం
ఎస్పీని కిడ్నాప్‌ చేసినా బేపర్వా
పఠాన్‌కోట్‌లో భద్రతా వైఫల్యం

పఠాన్‌కోట్‌ (పంజాబ్‌), జనవరి 2: జైషే ఉగ్రవాదులు ఏకంగా ఎస్పీని కిడ్నాప్‌ చేశారు! ఆ తర్వాత అదే ప్రాంతంలో 24 గంటలపాటు యధేచ్ఛగా తిరిగారు! చివరికి పఠాన్‌కోట చేరుకుని అక్కడ వైమానిక స్థావరంపై దాడి చేశారు. అయినా.. పంజాబ్‌లోని భద్రతా బలగాలు వారిని పట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పఠాన్‌కోట్‌ ఘటన వెనక భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి, బుధవారం రాత్రి దాదాపు 15 మంది ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి భారత్ లోకి చొరబడ్డారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దాంతో పంజాబ్‌లోని రక్షణ సంస్థలన్నిటిలో శనివారం హై అలర్ట్‌ ప్రకటించారు. మరోవైపు ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ను ఉగ్రవాదులు గురువారం రాత్రి అపహరించారు. ఆ తర్వాత 24 గంటలపాటు ఆ ప్రాంతంలో తిరిగినా వారిని గుర్తించడంలో భద్రతా బలగాలు విఫలమయ్యాయి. హై అలర్ట్‌ ప్రకటించినా ఉగ్రవాదులు భద్ర తా వలయాలను దాటుకుని పఠాన్‌కోట్‌ వరకు వచ్చి.. భారత వైమానిక స్థావరంపై దాడి చేశారు.
 
అయినా భద్రతా బలగాలు ఎటువంటి చర్య లూ తీసుకోలేదు. ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ అపహరణ తర్వాత.. ఆయనను ఉగ్ర చెర నుంచి విడిపించేందుకు పోలీసులు, భద్రతా బలగాల గాలింపు చర్యలు మొక్కుబడిగా, తూతూ మంత్రంగా సాగడం వల్లనే జైషే ఉగ్రవాదులు.. పోలీసుల కళ్ళు గప్పి గ్రామాలు, కుగ్రామాల మీదుగా పఠాన్‌కోట్‌ వచ్చి, వైమానిక స్థావరంపై దాడి చేశారని భావిస్తున్నారు. ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ అపహరణను పోలీసులు తీవ్రంగా పరిగణించలేదని, ఆయనను ఉగ్ర చెర నుంచి విడిపించేందుకు గాలింపు ముమ్మరం చేయలేదని పంజాబ్‌ పోలీస్‌ మాజీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అదే ఉగ్రవాదులకు సానుకూలంగా మారిందని చెబుతున్నారు.