desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 02:28AM

కొత్తగా 14 లక్షల కార్డులు

  • చంద్రన్న కానుకకు రూ.400 కోట్లు 
  • పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎం.లింగారెడ్డి 
రాజమండ్రి, డిసెంబరు 31: ‘రాష్ట్రంలో కొత్తగా 14 లక్షల రేషన్‌ కార్డులు ఇవ్వనున్నాం. వీటిని జన్మభూమి కమిటీలు, ఆహార సలహా కమిటీల ఆధ్వర్యంలోనే పంపిణీ చేస్తాం. చంద్రన్న కానుక కింద రూ.400 కోట్లతో కిట్‌లు సిద్ధం చేస్తున్నా’మని రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎం.లింగారెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం రైస్‌మిల్లర్స్‌, రేషన్‌షాపు డీలర్లతో ప్రజాపంపిణీపై ఆయన సమీక్షించారు. గోదాముల నిర్మాణానికి రూ.100 కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.
 
భారీవర్షాల వల్ల రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నా, రైతులెవరూ ఆ ధాన్యం ఎక్కువగా తేవడం లేదన్నారు. తెలంగాణలో మాదిరిగా ఆంధ్రలోనూ రైస్‌మిల్లింగ్‌ చార్జీలు 15నుంచి 30శాతానికి పెంచాలని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు అంబటి రామకృష్ణారెడ్డి కోరగా, ఆయన పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎస్‌.సత్యనారాయణ, పౌర సరఫరాల డీఎం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.