Dec 31 2015 @ 18:31PM

మోదీ ముద్రను మాయ చేస్తున్నారా ?

  • అభాసుపాలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం
  • కొసిరి కొసిరి రుణాలు విదిలిస్తున్న బ్యాంకులు
  • లబ్ధిదారులు 7,217 మంది.. మంజూరైన మొత్తం రూ. 79.85 కోట్లు
  • సగటున ఇచ్చిన రుణం లక్ష రూపాయలు
  • ప్రయోజనం కన్నా ప్రచార ఆర్భాటమే ఎక్కువ
  • నివ్వెరపోతున్న పేద, మధ్య తరగతి వర్గాలు
  • క్షేత్ర స్థాయిలో నెరవేరని ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ లక్ష్యం

నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి ముద్ర యోజన’ పథకం క్షేత్ర స్థాయిలో అభాసుపాలవుతోంది. లబ్ధిదారులకు రుణాలు కొసిరి కొసిరి విదిలిస్తూ సంఖ్యా పరంగా ఎక్కువ మందికి ఇచ్చినట్టు చూపిస్తున్నారు. దీంతో ఈ పథకం తీరు ‘సంఖ్య ఘనం-రుణం శూన్యం’ అన్న చందంగా మారింది. ఇప్పటి వరకు 7,217 మందికి రుణాలు ఇవ్వగా, సగటున ఒక్కొక్కరికి రూ. 1,10,641 మాత్రమే అందింది. ఈ పాటి రుణం ఇవ్వడానికి కూడా బ్యాంకులు రకరకాల కొర్రీలు పెడుతూ తిప్పించుకుంటున్నాయి. ఫలితంగా పథకం లక్ష్యం నీరుగారిపోతోంది.

ఆంధ్రజ్యోతి, హన్మకొండ
జిల్లాలో ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం అత్యంత అధ్వాన్నంగా అమలవుతోంది. ముద్ర పథకం కింద మూడు కేటగిరీల కింద ఇవ్వాల్సిన రుణం ఇవ్వడం లేదు. అధికారులు సంఖ్యా పరంగా ఎక్కువ మందికి రుణాలు ఇచ్చినట్టు చూపిస్తున్నారు. వాస్తవంగా వారందిరికి ఇచ్చిన మొత్తం రుణం స్వల్పమే. ముద్ర అమలు తీరు సంఖ్య ఘనం-రుణం శూన్యం చందంగా ఉంది. శిశు విభాగంలో రూ 50వేలకు బదు లు రూ 20 నుంచి రూ 30వే లు. కిశోర్‌ విభాగంలో రూ 50వేల నుంచి రూ 5లక్షలకు బదులు రూ 1.50 లక్షల నుంచి రూ 2లక్షలు. తరుణ్‌ కింద రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షలు కాగా ఈ విభాగంలో మాత్రం అధికారులు ఉదారంగా సగటున రూ 8 లక్షల వరకు ఇచ్చారు.
 
లక్ష్యం మంచిదే..
నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు, తద్వారా ఆసమానతలను తొలగించేందుకు కేంద్ర ప్రభు త్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకా న్ని ప్రవేశపెట్టింది. మంచి లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకం బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం అధికార పార్టీ నాయకుల పక్షపాతం వల్ల ఆశించిన ప్రయోజనం పేదల కు అందడం లేదు.
 
తయారీ సేవారంగాల్లో చిన్న వ్యాపారం చే సుకునే వారు తెల్లకాగితంపై బ్యాంకు అధికారులు అడిగి న సమాచారం రాసిస్తే చాలు పీ ఎంఎంవై కింద రుణా లు అందిస్తామని మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీనితో వేలాది మంది ప్రభుత్వ రంగ బ్యాంకులకు పరుగులు పెట్టారు. రుణం కోసం ధరఖాస్తులు చేసుకున్నారు.పథకంలో చెప్పింది ఒకటి.. అధికారులు చేస్తున్నది మ రొకటి. బ్యాంకు అధికారులు ధరఖాస్తు దారులను పట్టించుకోవడమే లేదు. గట్టిగా ఒత్తిడి చేస్తే వారి స్థిరాస్తులు ఏమున్నాయి? వాటి విలువ ఎంత? రుణాలు తిరిగి ఎలా చెల్లిస్తా వు? అంటూ సవాలక్ష ప్రశ్నలు వేస్తున్నారు. ఆస్తు లు లేనివారిని అధికారులు పట్టించుకోవడం లేదు.
 
ఆర్భాటంగా..
ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 2వ తేదీన కేం ద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేంద్ర సింగ్‌ నగరంలో అట్టహాసంగా ఈపథకానికి ప్రా రంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ జిల్లాలో 9500 మందికి ముద్ర రుణాలు ఇవ్వనున్నట్టు ప్రకటించా రు. మూడు నెలల్లో వీరందిరికి రుణాలు చేతికి అందుతాయని కూడా చెప్పారు. ఆ యన మాటలు పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోలేదు.
 
రుణం తీసుకోవడానికి కొల్లేటరల్‌ హామీ అవసరంలేదని పైకి చెబుతున్నా బ్యాంకు అధికారులు ససేమిరా అంటున్నారు. రుణం తగ్గించే ఇస్తున్నా తగిన పూచీకత్తు ఉండాల ని నిబంధన పెడుతున్నారు. ముద్ర రుణాల మంజూరుకు ముందు పరపతి కార్డులు ఇస్తామని చెప్పినప్పటికీ అది కూడా జారీ అ యిన దాఖలాలు లేవు. ఈ కార్డులు పొందిన లబ్దిదారులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.
 
టార్గెట్లు సరే..
పీఎంఎంవై కింద లీడ్‌ బ్యాంక్‌ జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు టార్గెట్లను కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ నేరుగా నిర్ణయించింది. పైగా ఈ పథకం అమలును పర్యవేక్షించే బాధ్యతను జిల్లా లీడ్‌ బ్యాంక్‌కు అప్పగించలేదు. కనీస భాగస్వామ్యం కూడా చేయలేదు. దీనితో లీడ్‌ బ్యాంక్‌ అధికారులు ముద్ర గురించి పట్టించుకోవడం లేదు. ము ద్ర పథకం అమలుపై ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశం జరగలేదు.

పైన పటారం..
పేదవారికెవరికి ఈ పథకం కింద రుణా లు పూర్తి స్థాయిలో అందడం లేదు. ముద్ర (మైక్రో యూనిట్స్‌ డెవల్‌పమెంట్‌ రిఫైన్సాసింగ్‌ ఏజెన్సీ) కింద జిల్లాలో 9500 మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కాని ఇప్పటి వరకు 7217 మందికి రుణాలు మం జూరయ్యాయి. సంఖ్యా పరంగా చూస్తే లక్ష్యం 83 శాతం పూర్తి చేసినట్టు పైకి కనిపిస్తోంది. కాని ఇంత మందికి వాస్తవంగా ఇచ్చిన రుణ మొత్తం రూ 79.85 కోట్లే. అంటే సగటు న ఒక్కొక్కరికి అందిన ఆర్ధిక సాయం రూ 1,10,641లు మాత్రమే. ఈ పాటి రుణం ఇవ్వడానికి కూడా బ్యాంకులు రకరాల కొర్రీలు పెట్టి తిప్పించుకుంటున్నాయి. ఫలితంగా ముద్ర పథకం లక్ష్యం నీరుగారిపోతోంది.

మూడు కేటగిరీల్లో..
పీఎంఎంవై కింద ఇచ్చే రుణాలను శిశు, కిశోర్‌, తరుణ్‌ అని మూడు కేటగిరీలుగా విభజించారు. శిశు విభాగంలో చిన్న వ్యాపారం నిర్వహించుకునే వారికి ఎటువంటి ఆస్తుల తనఖా లేకుండా రూ 50వేల వరకు రుణం అందిస్తారు. లబ్దిదారులకు రకరకాల కొర్రీలు పెట్టి ఎక్కువగా బ్యాంకుల చుట్టూ తిప్పించుకోకుం డా కొల్లేటరల్‌ హామీ, ప్రాసెసింగ్‌ ఫీజు వంటివి ఏవీ లేకుండా బ్యాంకులు రుణా లు ఇవ్వాల్సి ఉంటుంది. వడ్డీ 1శాతం మాత్రమే. రుణ చెల్లింపు గరిష్ట కాలం అయిదేళ్ళు. ఇక కిశోర్‌ విభాగంలో తయారీ సేవా రంగాలతో పాటు ఇతర వ్యాపారాల నిర్వహణకు రూ. 50వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందిస్తారు. ఈ రుణాల మంజూరికి బ్యాంక్‌ అధికారులు అడిగిన సమాచారం అందిస్తే చాలు. తరుణ్‌ విభాగం లో లబ్దిదారులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తారు.

మార్గదర్శకాలు గాలికి..
ముద్ర రుణాల మంజూరు ఆశించినదానికన్నా భిన్నంగా అమలవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద సూచించిన మార్గదర్శకాలను ఏమాత్రం పాటించడం లేదు. శుశు విభాగం కింద 4213 మందికి రూ 13.24 కోట్లను మంజూరు చేశారు. ఈ విభాగంలో రూ 50వేల వరకు రుణం అందించాలి. ఈ లెక్కన వీరికి సగటున అందిన రుణ మొత్తం రూ.30,862 మాత్రమే. కిశోర్‌ విభాగంలో 2202 మందికి రూ 42.19 కోట్లను మంజూరు చేశారు. వాస్తవంగా ఈ విభాగంలో ఒక్కో లబ్దిదారుడికి రూ 50వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇవ్వాలి. కానీ వీరికి మంజూరు చేసింది సగటు న రూ.1,91,598. ఇక తరుణ్‌ కేటగిరిలో 303 మంది లబ్దిదారులకు రూ 24.42 కోట్లు మంజూరు చేశారు.
ఈ విభాగంలో ప్రతీ లబ్దిదారుడికి రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకు మంజూరు చేయాలి. ఈ లెక్కన ఒక్కో లబ్దిదారునికి మంజూరైన రుణ మొత్తం రూ 8,08,609. శిశు, తరుణ్‌ విషయంలో అధికారులు ఉదారంగా వ్యవహరించారు.
 
తక్కువ మందే అయినా ఎక్కువ మొత్తం రుణం ఇచ్చారు. ఇందుకు కారణం ఈ కేటగిరి కింద రుణం పొందిన వారిలో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందినవారేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పలుకుడి ఉనవారే ఈ రుణాలను తన్నుకు పోయారు. ఏ పలుకుబడి లేని నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ధరఖాస్తు దారులను పట్టించుకోవడం లేదు. జిల్లాలో ముద్ర రుణాలను ఎస్‌బీహెచ్ ఎక్కువగా మంజూరు చేసింది. ఈ బ్యాంక్‌ 3517 మందికి రూ 63.24 కోట్లను ఇచ్చిం ది. ఆ తర్వాత స్థానం ఆంధ్రాబ్యాంకుది. ఈ బ్యాంక్‌ 1397 మందికి రూ. 8.33 కోట్లను వితరణ చేసింది. మిగతా బ్యాంకు లు పెద్దగా పట్టించుకోవడం లేదు.