
- మారనున్న పాలవాగు రూపురేఖలుఫ వాగుపై ఎనిమిది వంతెనలు
- ఇరువైపులా పచ్చదనం అభివృద్ధి ఫ ఒడ్డన రిసార్టులు.. వాగులో వాటర్ ట్యాక్సీలు
- మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన సింగపూర్
గుంటూరు, ఆంధ్రజ్యోతి: భారీ వర్షాల సమయంలో ఉద్ధృతంగా ప్రవహిస్తూ భయపెట్టే పాలవాగును అమరావతి రాజధాని నగర కేంద్ర ప్రాంతానికి ఒక మణిహారంగా అభివృద్ధి చేయాలని మాస్టర్‌ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్థ అభిప్రాయపడింది. తద్వారా పర్యాటకాన్ని విశేషంగా ఆకర్షించవచ్చని పేర్కొంది. రాజధాని తుది మాస్టర్‌ప్లాన్ లో పాలవాగు అభివృద్ధిని నిర్దేశించింది. దీంతో పాలవాగు రూపురేఖలే మారిపోతాయని సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్దాలుగా ముంపు సమస్య అమరావతి, తాడికొండ మండలాల్లో ఆవిర్భవించే పాలవాగు రాజధాని నగరంలో అనంతవరం, వడ్డమాను, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, రాయపూడి, వెలగపూడి, మందడం, తాళ్లాయపాలెం మీదగా ప్రవహించి కొండవీటి వాగులో కలుస్తుంది. కొండవీటివాగులో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న సమయంలో పాలవాగు ఉప్పొంగి పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. దశాబ్ధాల తరబడి పాలవాగు ముంపు సమస్యను ఎదుర్కొన్న రాజధాని ప్రాంత ప్రజలు రాయపూడి వద్ద కృష్ణానది రేవులో కలిసేలా కాలువను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కొంతమేరకు ముంపు సమస్య తగ్గింది.
పర్యాటక ప్రాంతంగా..
పాలవాగును అమరావతి రాజధాని కేంద్ర ప్రాంతానికి ఇవతలి వైపున ఒక మణిహారంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. పాలవాగును దాటి రాజధాని కేంద్రం ప్రాంతంలోకి అవలీలగా చేరుకునేలా వంతెనలు ప్రతిపాదించారు. రాయపూడి, లింగాయపాలెం, మోదుగులింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, తాళ్ళాయపాలెం సమీపంలో వంతెనల నిర్మాణం చేపడతారు. మొత్తం ఎనిమిది వంతెనలను నిర్మిస్తారు. పాలవాగుకు ఇరువైపులా పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారు. తద్వారా కోడై కెనాల్ మాదిరిగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు విశ్లేషిస్తున్నాయి. వాగులో వాటర్ ట్యాక్సీలను నడుపుతారు. పాలవాగు పొడవునా కొన్ని చోట్ల రిసార్టులు నిర్మిస్తారు. దీంతో ఇదొక గొప్ప పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటుంది. సినిమా షూటింగ్‌లకు అనువుగా మారుతుంది.