Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 30 2015 @ 11:37AM

అన్నదాతను మోసం చేసిన బ్యాంకు అధికారి

  • ఐఓబీలో రైతు సొమ్ము మాయం
  • అప్పు ఉందని చెప్పి ‘అసలు’ స్వాహా
  • ఎస్‌బీహెచ్‌లో మరో మాయ
  • కానరాని ష్యూరిటీ ఆస్తి పత్రాలు
  • ‘ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించిన బాధితులు

(ఆంధ్రజ్యోతి- ఖమ్మం)
బ్యాంకులంటే ప్రజాధనానికి భరోసాగా నిలిచేవి. వాటిపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉంది. బ్యాంకుల్లో నగదు జమచేస్తే ఎక్కడికీ పోవన్న ధీమా ఉంది. కానీ బ్యాంకుల అధికారులు మాత్రం ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసేకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. ‘ఖాతాదారులు ఎమైపోతేనేం నెల వచ్చేసరికి జీతం వస్తుందిగా’ అన్న రీతిలో కొందరు బ్యాంకు అధికారుల వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఎందరో జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు బ్యాంకు అధికారులు చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తూ దబాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు తమ తప్పును సరిదిద్దుకోవడానికి వినియోగదారులను సంవత్సరాల తరబడి బ్యాంకుల చుట్టూ తిప్పుకొంటున్నారు. బ్యాంకు అధికారుల తీరుతో విసుగు చెందిన బాధిత లబ్ధిదారులు మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
మొన్నటి వరకు నకిలీ పహాణీల వ్యవహారం.. ఆ తర్వాత మరో బ్యాంకులో దొంగ సొమ్ము డ్రా చేయడం లాంటి ఘటన ఖాతాలో ఇప్పుడు మరో సంఘటన చేరింది. చెల్లించిన సొమ్మును వేరే ఖాతాలో జమ వేసింది కాక తిరిగి డబ్బులు చెల్లించాలని వేధింపులకు మొదలు పెట్టా రు ఆ బ్యాంకు అధికారులు. అంతేనా పొలం తాకట్టు పెట్టుకుని రూ.1.80లక్షలు మంజూరు చేసి ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు. వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ముల్కలపల్లికి చెందిన షేక్‌ సైదులుకు మూడెకరాల భూమి ఉంది. తన తల్లి పేరు మీద ఉన్న ఆ మూడెకరాలను జులై29, 2008వ సంవత్సరంలో ఖమ్మం నాయుడుపేట ఐఓబీ బ్యాంకులో జమానతు పెట్టి రూ.50వేలు అప్పు తీసుకున్నాడు. ఆ సొమ్మును వడ్డీ సహా కలిపి జులై 18, 2011న రూ.65,737 చెల్లించి రశీదు తీసుకున్నాడు. అదే రోజు సాయంత్రం అతడికి రూ. 90 వేలు కొత్త లోను కూడా ఇచ్చారు.
 
పాత లోను కట్టగానే కొత్తలోను ఇచ్చినందుకు ఆ నగదును తీసుకుని సైదులు సంతోషంగా ఇంటికి వెళ్లాడు. ఇటీవల మొదటి విడత రైతు రుణమాఫీ అయిన సమయంలో ఎంత అయిందోనని తెలుసుకోడానికి బ్యాంకుకు వచ్చిన సైదులు ఖంగుతిన్నాడు. తన పేరుమీద మొదట తీసుకున్న అప్పు తీసేయలేదని... ఇదేంటని బ్యాంకు అధికారులను అడగ్గా రశీదు తీసుకురమ్మని పంపారు. తీరా రశీదును తీసుకువచ్చిన తర్వాత తాను చెల్లించిన నగదు అదే మండలం అందనాలపాడు గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఖాతాలో పడిందని, అతడిని తీసుకురావాలని చెప్పారు. అది తాను చేయాల్సిన పని కాకపోయినా.... అక్కడకు వెళ్లి ఆ వ్యక్తి కాళ్లా వేళ్లా పడి చివరకు బ్యాంకుకు తీసుకొచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడిన సదరు బ్యాంకు అధికారులు తన పేరు మీద ఉన్న ఆనగదును తొలగిస్తామని చెప్పి పంపించారు.
మళ్లీ కొద్ది రోజుల తర్వాత రెండో విడత రుణమాఫీ గురించి తెలుసుకోవడానికి వచ్చిన ఆయనకు రెండోసారి ఆయన తీసుకున్న రూ.90వేలల్లో రూ.25 వేలు మాఫీ అయింది ఇంకా రూ.75 వేలు బాకీ ఉందని చెప్పారు. మూడోసారి కొత్త రుణం పొందడానికి వచ్చిన ఆయనకు పొలం పాసుపుస్తకాలు పెట్టుకుని రూ.1.80వేలు మంజూరు చేశారు. కానీ ఆయన చేతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొదట తీసుకున్న రూ.50వేలు, రెండోసారి తీసుకున్న రూ.90వేలు.. వాటికి వడ్డీకి... మూడోసారి మంజూరైన నగదు సరిపోయిందంటూ బయటకు పంపారు. దీంతో ఏంచేయాలో అర్థంకాని ఆ రైతు ఆత్మహత్యే శరణ్యం అనుకుని బ్యాంకు వద్దకు వచ్చాడు. మొదట తీసుకున్న నగదు చెల్లించకపోతే రెండోసారి రుణం ఎలా ఇస్తారని, ఆరు నెలల కాలంగా తనను బ్యాంకు చుట్టూ తిప్పుకొంటున్నారని ఆ రైతు వాపోతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.
 
ఫిర్యాదు చేస్తే... ఉన్నతాధికారులకు పంపుతాం : రవికుమార్‌, ఐఓబీ మేనేజర్‌
రైతు తాను రుణం తీసుకుని చెల్లించిన మాట నిజమే... ఈ విషయం నా దాకా వచ్చింది. బ్యాంకు సిబ్బంది కరెంట్‌ అకౌంట్లో వేయాల్సింది. ఎస్‌బీ అకౌంట్లో వేశారు. సదరు ఖాతాదారుడిని కూడా పిలిపించి మాట్లాడాం. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే రీజనల్‌ కార్యాలయానికి పంపి... వారి ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటాం.
 
ఎస్‌బీహెచ్‌లో మరోమాయ..
స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) అంటే ప్రజల్లో ఒక గొప్ప నమ్మకం. ఆ నమ్మకాన్ని కొందరు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోల్పోవాల్సి వస్తోంది. జమానతు కోసం పెట్టిన అసలు పత్రాలు మాయం చేసింది కాక.... అవి వెతకాడానికి సంవత్సరకాలంగా బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారు. అది జిల్లాలో ఏ బ్రాంచిలోనో జరిగిందనుకుంటే పొరపాటే...... జిల్లా కేంద్రంలోని ఎస్‌బీహెచ్‌ ప్రధానశాఖలోనే.... నగరానికి చెందిన పాల్వాయి రాధిక ఫిబ్రవరి 2, 2010న బ్యాంకు లోనుకోసం ఇంటి పత్రాలు జమానతు పెట్టి దరఖాస్తు చేసుకున్నారు. లోను పొందడానికిగాను కింద యామసాని ముత్తయ్య ఇంటి అసలు పత్రాలు జమానతుగా పెట్టారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన బ్యాంకు అధికారులు ఫిబ్రవరి 17, 2010న రూ.7.18లక్షల రుణం మంజూరు చేశారు. ప్రతి నెల రూ.7600ను వాయిదా పద్ధతిలో చెల్లిస్తున్న ఆమె డిసెంబరు4,2014న లోను నగదును పూర్తిగా చెల్లించారు.
 
ఆ సమయంలో ఆమె తాను ష్యూరిటీగా పెట్టిన ఇంటి పత్రాలు ఇవ్వాలని కోరగా అవి ఎక్కడ ఉన్నాయో దొరకలేదని, వెతికి తర్వాత ఇస్తామని చెప్పి... డాక్యుమెంట్లు తమకు ముట్టినట్టు సంతకం చేయించుకున్నారు. ఆ తర్వాత రేపు ఇస్తాం, మాపు ఇస్తామంటూ సంవత్సర కాలంగా ఆమెను బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారు. విసుగు చెందిన ఆమె ఇటీవల అధికారులను నిలదీయగా... అసలు ష్యూరిటీ పేపర్లు ఇచ్చినట్టు తమ లెడ్జర్‌లో లేదని బ్యాంకు అధికారులు సమాధానమిచ్చారు. ఆ సమయంలో ఆమె తన వద్ద ఉన్న బాండు పేపరును కూడా చూపించారు. అందులో ముత్తయ్యకు చెందిన ఇంటి పత్రాలను ష్యూరిటీగా పెట్టుకున్నట్టు ఉంది. అయినా అధికారులు స్పందించడం లేదు.
 
అధికారులను గట్టిగా ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్లమని సమాధానమిస్తున్నారని, కొత్త లోను తీసుకునేందుకు వెళ్లే ఓరిజనల్‌ పేపర్లు ఉంటేనే ఇస్తామని మిగతా బ్యాంకు అధికారులు చెప్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె కోరుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వివాదంపై ఎస్‌బీహెచ్‌ ప్రధానశాఖ చీఫ్‌ మేనేజర్‌ను వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.