Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 30 2015 @ 10:06AM

ఆ రోజున అతి చేస్తే ఊరుకోరట !

  • ఆంగ్ల సంవత్సరాదికి భారీ బందోబస్తు
  • నగరంలో 10 వేల మందికి ప్రత్యేక భద్రత 
  • పోలీసుల హెచ్చరిక
ఆంధ్రజ్యోతి, చెన్నై: ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని రాష్ట్ర పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. మరీ ముఖ్యంగా 31వ తేదీ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సాయుధ బలగాలను పెంచాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్క నగరంలోనే 10 వేలమందితో భద్రత ఏర్పాటు చేయనున్నారు. వీరంతా 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 1వ తేదీ ఉదయం వరకూ విధుల్లో వుండాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. మరీ ముఖ్యంగా అర్ధరాత్రి మెరీనాలో, నగరంలోని రోడ్లపై యువత చేసే హడావుడి అంతాయింతా కాదు.
 
ఈ సందర్భంగా ప్రతి యేడాది అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతేగాక కొంతమంది యువకులు బైక్‌ రేసులతో బీభత్సం సృష్టిస్తున్నారు. ఇంకొంతమంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత భద్రత పెంచారు. ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా నగరంలో మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వారిని హేళనచేస్తూ దూషించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. నగరంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ నగరవాసులు పెద్దయెత్తున వేడుకలు జరుపుతారు.
 
నగరమంతటా యువతీయువకులు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కేక్‌లు, స్వీట్లు తింటూ రోడ్లపై బైకుల్లో ప్రయాణిస్తారు. వరద పరిస్థితుల నేపథ్యంలో ఈ యేడాది ఈ వేడుకలు కాస్త తగ్గుముఖంగా ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. నగరంలోని స్టార్‌ హోటళ్లల్లో ఆంగ్ల సంవత్సరాది వేడుకలను అట్టహాసాలు లేకుండా నిరాడంబరంగా జరపాలని వాటి యజమాన్యాలు నిర్ణయించాయి. మెరీనాబీచ, బీసెంట్‌నగర్‌ బీచ్, అన్నాసాలై తదితర కీలకమైన ప్రాంతాల్లో జనం అధికంగా గుమికూడే అవకాశాలు ఉండటంతో ఆ ప్రాంతాలలో మహిళలు, యువతులపట్ల అసభ్యంగా ప్రవర్తించేవారిపై, హేళనగా మాట్లాడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.