Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 29 2015 @ 15:52PM

కాయ్... రాజా కాయ్

  • ఎమ్మెల్సీ అభ్యర్థులపై పందేలు!
  • తేరా గెలుస్తారని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధి రూ.5లక్షలు..
  • రాజగోపాల్‌రెడ్డి విజయంపై రూ.లక్ష కాసిన ఓ కాంగ్రెస్‌ నేత
(నార్కట్‌పల్లి)
ఇరువైపులా ఆర్థికంగా బలమున్న అభ్యర్థులు కావటంతో ఆకర్ష్‌... శిబిరాలు... ప్యాకేజీలతో శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల ఘట్టం అట్టహాసంగా ముగిసింది. ఇక ఫలితాలే తరువాయి... ఈ నేపథ్యంలో వారి గెలుపోటములపై బెట్టింగ్‌ జోరందుకుంది. నార్కట్‌పల్లి మండలంలో ఓ కాంగ్రెస్‌ నేత రాజగోపాల్‌రెడ్డి గెలుస్తారని లక్ష పందెం కాయగా, అధికార పార్టీకి చెందిన ఓ నేత ఏకంగా తేరాపై ఐదు లక్షలతో సవాల్‌ విసరటం చర్చనీయాంశమైంది.
 
నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠతో ఇరు పార్టీల్లో జోరుగా పందేలు మొదలయ్యాయి. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నార్కట్‌పల్లి మండలానికి చెందిన వ్యక్తికావడంతో అభ్యర్థుల గెలుపు ఓటములపై ఈ మండల ప్రజానీకంలో ఏర్పడ్డ ఆసక్తితో పందెం వార్తలకు ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 10 రోజుల పాటు ఇరు పార్టీల్లో కొనసాగిన క్యాంప్‌ రాజకీయాలు, బేరసారాలు, పార్టీ గుర్తుపై గెలిచిన ఓటర్ల సంఖ్యాబలాలు, ప్రజాప్రతినిధిగా భవిష్యత్‌ రాజకీయ అవసరాలు, పోలింగ్‌ సరళి తదితర సమీకరణల విశ్లేషణల ఆధా రంగా అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన (రాయడానికి పేర్లు నిరాకరించిన) ప్రజాప్రతినిధులు, నాయకులు పందాలకు సిద్ధమయ్యారు.
 
రాజగోపాల్‌రెడ్డి గెలుస్తాడని ఇదే మండలానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రూ.లక్ష బెట్టు కాయగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇంతకు నాలుగింతలు బెట్టు కాశారు. తేరా చిన్నపరెడ్డి జయకేతనం ఎగురవేయడం ఖాయమని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మండలంలోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి రూ.5లక్షలు బెట్టు కాసినట్లు విశ్వసనీయ సమాచారం. మరికొందరైతే ఇందుకు భిన్నంగా డబ్బుల ప్రమేయం లేకుండా సవాల్‌లు విసురుకున్నట్లు తెలుస్తోంది.
 
మా అభ్యర్థి ఓడిపోతే మేము..మీ పార్టీలోకి వస్తాం .... మీ అభ్యర్థి ఓడిపోతే మీరు మా పార్టీలోకి వస్తారా...? అంటూ పరస్పరం సవాల్‌ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోటీల్లో ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారై ఆర్థికంగా బలమైన నేపథ్యం గలిగి ఉండటంతో ఇరు పార్టీలకు చెందిన కొందరు నేతలు ఎవరికి వారు ధీమాతో బెట్టింగులకు దిగారు. వీరి బెట్టింగులను మాత్రం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ఎవరు గెలుస్తారో... ఎవరు ఓడతారో... ఈ నెల 30వరకు వేచి చూడాల్సిందే.