Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 29 2015 @ 02:15AM

బీజేపీలో ‘సంస్థాగత’ వేడి

  • జిల్లా అధ్యక్ష పదవులకు పోటా పోటీ
  • అధిష్టానానికి తలనొప్పిగా నెల్లూరు!
హైదరాబాద్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): బీజేపీలో సంస్థాగత ఎన్నికల వేడి రాజుకుంది. అటు కేంద్రంలో పూర్తిస్థాయిలోను, రాష్ట్రంలో టీడీపీతో మిత్రపక్షంగా అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ సారి జిల్లా అధ్యక్ష్య పదవిని ఆశిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న వారితోపాటు పలుకుబడి, ఆర్థిక స్థోమత ఉన్నవారు కూడా ఈసారి జిల్లా అధ్యక్ష పదవులకు పోటీ పడుతున్నట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో జిల్లా బాధ్యతలు మోసిన తమకు మరో అవకాశం ఇవ్వాలని ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా ఉన్నవాళ్లు పార్టీ పెద్దలను కోరుతున్నారు. అయితే, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నవారు కూడా బారీగానే ఉన్నారు. సంస్థాగత ఎన్నికల సమయంలో ఇటువంటివి సాధారణమేనని చెబుతున్నా ఈసారి కొత్తగా సామాజిక, ఆర్థిక, ప్రాంతీయ కోణాలను నేతలు తెరపైకి తెస్తున్నారు. జిల్లా అధ్యక్ష ఎన్నికల సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కొన్ని జిల్లాల్లో నెలకొన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న పి.సురేందర్‌రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని పెద్దలపై ఒత్తిడి తెస్తుంటే.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన.సురే్‌షరెడ్డి మాత్రం ఈసారి కొత్త వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోయినా తెరవెనక మాత్రం సురేందర్‌రెడ్డికే మద్దతు పలుకుతున్నట్లు చెబుతున్నారు. సురేందర్‌రెడ్డి కూడా వెంకయ్య మద్దతు తనకే ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎన్నిక పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. ఈ జిల్లాలోని 12 మండలాల్లో ఎన.సురే్‌షరెడ్డి, పి సురేందర్‌రెడ్డి వర్గీయులు పోటా పోటీగా నామినేషన్లు వేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధ్యక్ష ఎన్నిక పార్టీలో చర్చనీయాంశమైంది. జిల్లా అధ్యక్ష్య పదవిని ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్లు తెలిసింది. మఽధ్యే మార్గంగా సురే్‌షరెడ్డికి జాతీయ కార్యదర్శి వర్గంలో అవకాశం కల్పించడం ద్వారా వివాదానికి తెర దించాలనే ఆలోచన కూడా పార్టీలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీకి ప్రాతినిధ్యం ఉన్న విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒకవిధమైన పరిస్థితి ఉంటే ఎటువంటి ప్రాతినిథ్యం లేని మిగిలిన జిల్లాల్లో పోటీ కనిపిస్తోంది. ప్రాతినిధ్యం ఉన్న చోట నేతల సిఫారసులకు మొగ్గు కనిపిస్తుండగా.. మిగిలిన చోట్ల మాత్రం పోటీ పడుతున్న అభ్యర్ధులు సంఖ్య బాగానే ఉంది. అనంతపురం జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు అంకాల రెడ్డితోపాటు డి.వెంకటేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి, లలిత కుమార్‌, కర్నూలులో జిఎస్‌ నాగరాజుకు పోటీగా సోమశేఖర్‌రెడ్డి, కడపలో శశిభూషణ్‌కు పోటీగా వంటేరు శ్రీనివా్‌సరెడ్డి, లాయరు శ్రీనివాసురెడ్డి తమ ప్రయత్నాల్లో ఉన్నారు. చిత్తూరులోనూ చాలా పేర్లు వినిపిస్తున్నాయి.