Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 29 2015 @ 00:55AM

షావుకారులూ పేద రైతులూ

నైరోబీలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మంత్రుల స్థాయి సమావేశం ఫలితాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విశాల అంశాల- వాణిజ్యం, మేధా సంపత్తి హక్కులు (ఐపీఆర్‌), మదుపులు - కోణంలో నైరోబీ చర్చల ఫలితాలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా విదితమవుతుంది.

 
మొదటి అంశం స్వేచ్ఛావాణిజ్యం. వస్తూత్పత్తుల ప్రపంచ వాణిజ్యాన్ని పెంపొందించడంలో డబ్ల్యూటీఓ ప్రభావశీల పాత్ర నిర్వహించింది. వ్యవసాయోత్పత్తుల వాణిజ్యమే ఒక సంక్లిష్ట సమస్యగా ఉన్నది. డబ్ల్యూ టీఓ ఒప్పందంపై సంతకాలు జరిగినప్పుడు సమస్త వ్యవసాయ సబ్సిడీలను పదేళ్ళలో దశల వారీగా ఉపసంహరించుకుంటామని అభివృద్ధి చెందిన దేశాలు హామీ ఇచ్చాయి. అయితే అవి తమ హామీని నెరవేర్చడంలో చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. వ్యవసాయ సబ్సిడీలను ఉపసంహరించుకొనే బదులు, చాలా వాటిని డబ్ల్యూటీవో నిబంధనలు అనుమతించే ఇతర సబ్సిడీలుగా మార్చివేసాయి. ఉదాహరణకు అమెరికా ప్రభుత్వం, తమ పొలాలను సాగుచేయకుండా ఉండేందుకు రైతులకు భారీగా సొమ్ము నిస్తుంది. ఇటువంటి చెల్లింపులు డబ్ల్యూ టి ఓ కింద నిషిద్ధం కాదు. అభివృద్ధిచెందుతున్న దేశాలకు వ్యవసాయం చాలా ముఖ్యమైనది. అభివృద్ధిచెందిన దేశాలకు వ్యావసాయక ఉత్పత్తుల ఎగుమతులు పెరిగితే వర్ధమాన దేశాల రైతులు ఇతోధికంగా లబ్ధి పొందుతారు. కఠోర వాస్తవమేమిటంటే డబ్ల్యూటీఓ ఒప్పందం వల్ల మన రైతులు లబ్ధి పొందడం లేదు. పైగా సంపన్న దేశాల నుంచి ఆపిల్‌, పాడి ఉత్పత్తులు అంతకంతకూ పెరుగుతున్నందున వర్ధమాన దేశాల రైతులు బాగా నష్టపోతున్నారు.
 
అభివృద్ధి చెందుతున్న దేశాల రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు నైరోబీ వాణిజ్య సదస్సు కొన్ని దుర్బల చర్యలు చేట్టింది. అభివృద్ధిచెందిన దేశాల నుంచి తమకు ఎగుమతులు పెరిగిన పక్షంలో వాటిపై హెచ్చు సుంకాలను విధించేందుకు వర్ధమాన దేశాలకు అనుమతినిస్తూ ఒక ప్రత్యేక విధాన నిర్ణయాన్ని డబ్ల్యూటీఓ తీసుకొంది. పత్తి ఉత్పత్తులు స్వేచ్ఛగా అందుబాటులో ఉండడానికి నైరోబి సదస్సు అంగీకరించింది. తమ ఆహార భద్రతా అవసరాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను నిల్వ చేసుకొనేందుకు వర్ధమాన దేశాలకు అనుమతినిచ్చారు. ఇవి నిజమైన విజయాలే. అయితే అవి డబ్ల్యూటీఓ ఇతర నిర్ణయాల ప్రతికూల ప్రభావాల నుంచి మనలను మనం రక్షించుకోవడానికి తోడ్పడేవి మాత్రమే. డబ్ల్యూ టీవో ఒప్పందం వల్ల మనం యాభై ప్రయోజనాలు కోల్పోతుంటే వాటిలో పదింటిని పైన పేర్కొన్న చర్యల మూలంగా తిరిగి సాధించుకోవడం జరుగుతుంది! నైరోబీలో కుదిరిన డబ్ల్యూటీఓ ఒప్పందం వల్ల సానుకూల ప్రభావాలు ఉంటే ప్రస్తావిత చర్యల అవసరమే ఉండేది కాదన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు.
 
రెండో అంశం మేధాసంపత్తి హక్కులు. డబ్ల్యూటీఓ ఒప్పందం కింద వాణిజ్య విధానంలో వీటిని భాగం చేయడం జరిగింది. రాయల్టీ చెల్లింపుల ద్వారా మన ఆదాయంలో అత్యధిక భాగం అభివృద్ధిచెందిన దేశాలకు తరలిపోవడానికి ఇవే ప్రధాన కారణం. దోహా సమావేశంలో అంగీకరించిన దోహాఅభివృద్ధి ఎజెండాలో ఈ ఐపీఆర్‌లను నైరోబీలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో ప్రభుత్వాలు పేటెంట్‌లను తిరస్కరించవచ్చని నిర్ణయం తీసుకున్నారు. భావి సంప్రదింపులలో ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని దోహాలో మంత్రుల స్థాయి సమావేశంలో సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అయితే నైరోబీ సమావేశం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించింది. దోహా అభివృద్ధి ఎజెండాను పలు దేశాలు అంగీకరించడం లేదన్న విషయం నైరోబీలో స్పష్టమయింది. పేటెంట్ల వ్యవస్థను సరళీకరించాలన్న ఏకగ్రీవ నిర్ణయాన్ని త్రోసిపుచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో ఈ అంశంపై ఎటువంటి పురోగతి ఉండదనేది స్పష్టం.
 
మూడో అంశం మదుపులకు రక్షణ, ప్రభుత్వ సేకరణ, పోటీ విధానంకు సంబంధించిన ‘సింగపూర్‌ అంశాలు’. అభివృద్ధిచెందిన దేశాలకు బాగా ఆసక్తికరమైన కొత్త అంశాలివి. మేధాసంపత్తి హక్కులు ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో భాగంగా చేయడంలో అభివృద్ధిచెందిన దేశాలు 1995లోనే సఫలమయ్యాయి. ఈ ప్రయోజనంతో అవి వర్ధమాన దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించుకోగలుగుతున్నాయి. సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో వాటిని డబ్ల్యూటీఓ ఒప్పందంలో భాగం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. అంతకు ముందు మంత్రుల స్థాయి చర్చల్లో కూడా ఈ అంశాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించడం జరిగింది. నైరోబిలో వాటిని మళ్ళీ చర్చకు పెట్టారు. దీంతో వర్ధమాన దేశాలు గతంలో సాధించుకున్న విజయాలన్నీ నిర్థకమైపోయాయి.
 
నైరోబీ వాణిజ్య చర్చలు వర్ధమాన దేశాలకు ప్రతికూల ఫలితాలను మాత్రమే ఇచ్చాయి. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్యంలో సాధించుకున్న ప్రయోజనాలు వాస్త్తవానికి డబ్ల్యూటీఓ ఇతర నిర్ణయాల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి తోడ్పడేవి మాత్రమే. దోహాలో మేధాసంపత్తి హక్కులపై ఏక్రగీవంగా తీసుకున్న నిర్ణయం రద్దయిపోయింది. మదుపులు, ప్రభుత్వ సేకరణలకు సంబంధించిన విషయాన్ని కూడా గత చర్చల్లో తిరస్కరించడం జరిగింది. అయితే ఈ అంశాన్ని కూడా నైరోబిలో మళ్ళీ చర్చకు పెట్టారు. ఈ వాణిజ్య చర్చల్లో పాల్గొనడం ద్వారా దేశాన్ని ఎక్కడకు తీసుకువెళుతున్నదీ ప్రభుత్వం నిశితంగా ఆలోచించుకోవాలి. నైరోబిలో భారత తన ప్రయోజనాలను విస్మరించి సంపన్న దేశాల నిర్ణయాలకు అనుకూలంగా వ్యవహరించడం వెనుక ప్రధాని మోదీ వ్యక్తిగత స్నేహాల ప్రభావం ఎంతైనా ఉందని విశ్వసనీయమైన ఒక వ్యక్తి నాకు చెప్పాడు.
 
- భరత్ ఝన్‌ఝన్‌వాలా