desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 28 2015 @ 12:56PM

ఉచిత వీసాలతో చైనాపై దృష్టి పెట్టిన నేపాల్

ఖాట్మండు : పర్యాటక రంగంలో నూతనోత్తేజం తీసుకొచ్చేందుకు నేపాల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హిమాలయ పర్వత ప్రాంతాలకు చైనా పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. చైనా నుంచి వచ్చే సందర్శకులకు ఉచితంగా వీసాలిస్తామని పేర్కొంది.
 
ఏప్రిల్‌లో సంభవించిన భారీ భూకంపం వల్ల నేపాల్ పర్యాటక రంగం బాగా దెబ్బతింది. హిమాలయ సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన వేలాది మంది పర్యాటకులు అర్ధాంతరంగా తిరిగి వెళ్ళిపోయారు. నేపాల్‌కు చైనా నుంచి అత్యధికంగా పర్యాటకులు వస్తూ ఉంటారు. భూకంపం నేపథ్యంలో నేపాల్‌లో పర్యటించవద్దని చైనా ప్రభుత్వం తమ పౌరులను హెచ్చరించింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు బీజింగ్‌లో చర్చలు జరిపిన అనంతరం చైనా ఈ హెచ్చరికలను శుక్రవారం ఉపసంహరించింది. బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, పాకిస్థాన్, శ్రీలంక, భారతదేశం నుంచి నేపాల్ సందర్శనకు వెళ్లే పర్యాటకులకు కూడా ప్రతి సంవత్సరం ఉచిత వీసాలను నేపాల్ ఇస్తోంది.
 
నేపాల్ సమాచార, ప్రసార మంత్రి షేర్‌ధన్ రాయ్ మాట్లాడుతూ చైనా నిర్ణయంతో తమ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పారు. భారతదేశంతో సరిహద్దుల్లో మాధేసీ వర్గాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో నేపాల్‌కు చమురు దిగుమతులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో చైనా నుంచి పెట్రోలు, డీజిల్ దిగుమతి చేసుకుంటోంది.