Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:50AM

ఇసుక కాంట్రాక్టర్లకు షోకాజ్‌ నోటీసులు

గుంటూరు, ఆంఽధ్రజ్యోతి: ఇసుక కాంట్రాక్టర్ల తీరుపై జిల్లా యంత్రాంగం సీరియస్‌ అయింది. జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించిన ధర కంటే రెట్టింపు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లందరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని మైనింగ్‌ ఏడీ జగన్నాథరావును ఆదేశించింది. ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో శనివారం ప్రచురితమైన ‘‘రెట్టింపు.. లూటీ’’ కథనానికి జాయింట్‌ కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ స్పందించి కాంట్రాక్టర్లను పిలిపించి చర్చించారు. ఆపైన షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జేసీ ఆదేశానుసారం ఏడీ పండరీపురంలోని తన కార్యాలయంలో ఇసుక కాంట్రాక్టర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లాలో గత కొద్ది రోజులుగా ఇసుక లారీ ధర రూ. 15 వేల వద్ద కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం క్వారీ కాంట్రాక్టర్లు రూ. 2,700లకు ఆరు క్యూబిక్‌మీటర్ల ఇసుకను లారీలలో లోడ్‌ చేయాలి. లారీ యజమానులు ఇసుకను గుంటూరులో రూ. 6 వేల నుంచి రూ. ఏడు వేల మధ్యన విక్రయించాలి. మైనింగ్‌, పోలీసు శాఖల అధికారుల తనిఖీలతో అక్రమ ఇసుక రవాణకు అడ్డుకట్ట పడటంతో క్వారీ కాంట్రాక్టర్లు తమ వద్ద ఆరు క్యూబిక్‌మీటర్లకు రూ. ఆరు వేలు వసూలు చేస్తున్నారని లారీ యజమానులు జేసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై మైనింగ్‌ ఏడీ జగన్నాథరావు అమరావతి, వైకుంఠపురం, ఓలేరు, గుండిమెడ, తాడ్వాయి, చామర్రు ఇసుక క్వారీల కాంట్రాక్టర్లను పిలిపించి వివరణ కోరారు. లారీ యజమానుల ఆరోపణల్లో వాస్తవం లేదని క్వారీ కాంట్రాక్టర్లు కొట్టిపారేశారు. గతంలో యంత్రాల వినియోగం వలన నిత్యం ఇసుక ఎక్కువ తవ్వకాలు జరిగేవని, నేడు కూలీలతోనే చేయిస్తున్నందున ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. అలానే గతంలో లారీకి నిండుగా ఇసుక పోసే వారమని, దాంతో ఎక్కువ ఇసుకను వారు వేరే చోట డంపింగ్‌ చేసుకొని దానిని విక్రయించుకొని సొమ్ము చేసుకొనేవారని తెలిపారు. అధికారుల ఆదేశాలతో ఇప్పుడు ఆరు క్యూబిక్‌మీటర్ల ఇసుక మాత్రమే లారీలో పోస్తున్నామన్నారు. అలానే ఉత్పత్తి తగ్గిపోవడం మూలంగా గతంలో రోజుకు రెండు, మూడు ట్రిప్పులు వేసే లారీలకు నేడు రెండు రోజులకు ఒకసారి మాత్రమే ఇసుక సరఫరా చేయగలుగుతున్నామన్నారు. దీంతో లారీ యజమానులు ఇసుక ధరను అసాంతం పెంచేశారని చెప్పారు. జిల్లా కేంద్రంలో రూ. 15 వేలు వసూలు చేస్తూ ఆ నెపాన్ని తమపై మోపుతున్నారని ప్రత్యారోపణ చేశారు. ఇసుక క్వారీల వద్ద స్థానిక లారీడ్రైవర్లు తమకు ప్రాధాన్యం ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అలానే వ్యక్తిగత మరుగుదొడ్లకు ప్రాధాన్యతక్రమంలో ముందు ఇసుక సరఫరా చేయాల్సి వస్తోందన్నారు. దీంతో లారీ డ్రైవర్లు తమకు ఎందుకు ముందు లోడింగ్‌ చేయరంటూ గొడవలకు దిగుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో క్వారీల వద్ద లారీలు సీరియల్‌ పద్ధతిని పాటించేలా చేయాలని ఏడీని కోరారు. అలానే పెరిగిన కూలీ రేట్లతో ఎస్‌ఎస్‌ఆర్‌ ధర గిట్టుబాటు కావడం లేదని, జిల్లా కమిటీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. సమావేశంలో చివరగా ఏడీ జగన్నాథరావు మాట్లాడుతూ ఇసుకను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వచ్చిన కాంట్రాక్టర్లందరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేశామన్నారు. అలానే వైకుంఠపురం క్వారీలో అక్రమాలకు పాల్పడుతున్న రెండు సొసైటీల సెక్యూరిటీ డిపాజిట్‌ రూ. 12 లక్షలను ప్రభుత్వానికి స్వాధీనపరిచామని తెలిపారు. లారీ యజమానులతో కూడా మాట్లాడి జిల్లాలో ఇసుక సంక్షోభానికి తెర దించుతామన్నారు.
వైకుంఠపురంలో తనిఖీలు
అమరావతి: మండల పరిధిలోని మల్లాది, వైకుంఠపురం ఇసుక రీచ్‌లను మైనింగ్‌ ఏడి జగన్నాథరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక రీచ్‌లలో నిబంధనలకు విరుద్ధంగా అధిక రేట్లు వసూళ్లు చేస్తున్నారని లారీ యజమానులు జిల్లా అధికారులకు పిర్యాదు చేయడంతో శనివారం సాయంత్రం తన సిబ్బందితో రీచ్‌లలో ఇసుక లోడింగ్‌ చేయించుకున్న లారీ డ్రైవర్‌ల వద్ధ వివరాలు సేకరించారు. ముందుగా అమరావతి సీఐ ఎం హనుమంతరావును కలసి ఇసుక రీచ్‌లలో జరుగుతున్న పరిస్థితులపై చర్చించారు. రీచ్‌ల వద్ధ తగిన ఆధారాలు లేకపోవడం వలన అధిక ధర వసూళ్లు చేస్తున్నారని చెప్పలేమన్నారు. దీనిపై విచారించేందుకు మండలంలోని మల్లాది, వైకుంఠపురం రీచ్‌లను పరిశీలించనున్నట్లు జగన్నాఽథరావు తెలిపారు.