Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:31AM

బదిలీలపై సందిగ్ధం తొలగించండి

గవర్నర్‌పేట: రాష్ట్రంలోని ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్‌పై నెలకొన్న సందిగ్ధతను తొలగించి స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని రాషో్ట్రపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి సి.జోసఫ్‌ సుధీర్‌బాబు డిమాండ్‌ చేశారు. 13 జిల్లాల అనుబంధ కమిటీల కన్వీనర్‌ల సమావేశం శనివారం గాంధీనగర్‌లోని ఎస్‌టీయూ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. సమావేశంలో వారు మాట్లాడుతూ 16 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను జాప్యం లేకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 7.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం సమకూరే హెల్త్‌ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం 10,600 సర్‌ప్లస్‌ టీచర్లను గుర్తించిందని, వాటి రేషనలైజేషన్‌ ప్రౄక్రియను వేసవి సెలవుల్లోనే చేపట్టాలని, లేకుంటే విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందన్నారు. గత ప్రభుత్వంలో ఆమోదించిన పండిట్‌లు, సీఐటీ పోస్టుల అప్‌గ్రెడేషన్‌, స్పెషల్‌ టీచర్ల నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు ఉత్తర్వుల విడుదల చేయాలన్నారు. మంత్రివర్గం ఆమోదించినప్పటికీ ఎయిడెడ్‌ ఉపాధ్యాయ, అధ్యాపకులకు 60 ఏళ్ళ ఉత్తర్వుల విడుదలలో జాప్యం తగదన్నారు. ఆర్థిక శాఖ ఆమోదించిన మున్సిపల్‌ టీచర్ల సర్వీసు రూల్స్‌ ఉత్తర్వులు జాప్యం లేకుండా విడుదల చేయాలని నరసింహారెడ్డి, సుధీర్‌కుబాబు కోరారు. సెప్టెంబర్‌ జీతంతో మోడల్‌ స్కూల్‌ టీచర్లు, డీఏఐఆర్‌ బకాయిలు ప్రభుత్వం చెల్లించనున్నదన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కె.వి.నాయుడు, ఉపాధ్యాయవాణి సంపాదకులు మూకల అప్పారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.రఘునాథ్‌రెడ్డి, ఎస్‌.ఎం.డి. ఇలియాష్‌, బాషా, కె.సుశీలకుమారి పాల్గొన్నారు.