desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:30AM

నందిగామ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతం

(కంచికచర్ల)
నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ శనివారం ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల కంటే పోలింగ్‌ శాతం తగ్గింది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం రెండు గంటల పాటు పోలింగ్‌ చాలా మందకొడిగా సాగింది. ఏ పోలింగ్‌ కేంద్రం వద్ద చూసినా పట్టుమని పది మంది ఓటర్లు కూడా కనిపించ లేదు. ఒక్కొక్కరు వచ్చి ఓటు వేసి వెళ్లటం కనిపించింది. ఉదయం తొమ్మిది గంటలకు 11 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదు అయింది. 10 గంటల నుంచి ఓటర్లలో కదలిక మొదలైంది. పోలింగ్‌ కొద్దిగా వేగం పుంజుకుంది. 11 గంటలకు పోలింగ్‌ శాతం 26.55కు చేరింది. మధ్యాహ్నం 12 గంటలకు చందర్లపాడు మం డలంలో 16,739 (37.65శాతం) మంది, నందిగామ మండలంలో 15,394 (28.16 శాతం) మంది, వీరులపాడు మండలంలో 12,508 (35.81 శాతం) మంది, కంచికచర్ల మండలంలో 15,590 (31.15 శాతం) మంది వెరశి నియోజకవర్గంలో 60,231 (32.73 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కంచికచర్ల, నందిగామ పట్టణాల్లో మధ్నాహ్నం సమయంలో ఓటింగ్‌ శాతం బాగా పెరిగింది. ఒంటి గంటకు నందిగామ మండలంలో 49.58 శాతం, చందర్లపాడు మండలంలో 46.67 శాతం, వీరులపాడు మండలంలో 50.79 శాతం, కంచికచర్ల మండలంలో 46.18 శాతం మంది ఓటు వేశారు. మూడు గంటలకు పోలింగ్‌ 58 శాతానికి, సా యంత్రం ఐదు గంటలకు 63 శాతానికి చేరిం ది. టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య, కాంగ్రెస్‌ అభ్యర్థి బోడపాటి బాబూరావు నియోజకవర్గంలో పర్యటించి పోలింగ్‌ సరళి పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ రఘునందనరావు, ఎన్నికల పరిశీలకులు బి.ఎస్‌. అనంత్‌, శశిధర్‌, అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్‌ చెన్నకేశవరావు, సబ్‌ కలెక్టర్‌ నాగలక్ష్మీ, ఏలూరు డీఐజీ హరికుమార్‌, జిల్లా ఎస్పీ విజయకుమార్‌ తదితర ఉన్నతాధికారులు పోలింగ్‌ను పరిశీలించారు.
ఊపిరిపీల్చుకున్న అధికారులు
పోలింగ్‌ ప్రశాంతంగా ముగియటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు మండలాల్లోని ఏ గ్రామంలో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. చిన్నా చితక సంఘటనలు, కనీసం తోపులాటలు కూడా జరగలేదు. అతి సమస్యాత్మక గ్రామాల్లో ముం దు జాగ్రత్తగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత సాధారణ ఎన్నికల్లో ఘర్షణలు జరిగిన గొట్టుముక్కల, గనిఆత్కూ రు, మోగులూరు, నక్కలంపేట గ్రామాల్లో సైతం పోలింగ్‌ ప్రశాంతంగా జరగటం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీలో సందడి.. కాంగ్రెస్‌లో నైరాశ్యం
పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎక్కువగా తెలుగుదేశం నాయకుల సందడి మాత్రమే కనిపించింది. కాంగ్రెస్‌ నాయకుల్లో హుషారు కాన రాలేదు. ప్రజాప్రతినిధులు లేకపోవటం, నాయకత్వ లేమి వల్ల ఒక దశలో కాంగ్రెస్‌ చేతులేత్తేసిందని చెప్పవచ్చు. పలు కేంద్రాలలో కాంగ్రెస్‌కు ఏజెంట్లు కూడా లేరు. మరికొన్ని గ్రామాల్లో ఏజెంట్లు మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. నియోజకవర్గంలో బలం గా ఉన్న వైసీపీ నాయకులు అసలు పట్టించుకోలేదు. బలమైన వర్గాలు, గ్రూపులు ఉన్న గ్రామాల్లో తప్పితే కొంత మంది వైసీపీ ముఖ్య నాయకులతో పాటుగా క్రీయాశీల కార్యకర్తలు కూడా ఓటింగ్‌కు రాలేదు. వైసీపీ బలంగా ఉన్న చందర్లపాడు మండలం కాండ్రపాడు లో కేవలం 32 శాతం మాత్రమే పోలింగ్‌ అయింది. ఈ పరిస్థితిలో మధ్యాహ్నం నుంచి ఓటింగ్‌ ఏకపక్షంగా సాగింది.
ఉదయం హడావిడి..ఆపై దూరం
పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం వేళలో పోలీసులు ఎక్కువ హడావిడి చేశారు. రాష్ట్రం లో నందిగామలో మాత్రమే ఉప ఎన్నిక జరుగుతుండటంతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాలు పోలీసుల వలయంగా మారాయి. ఎక్కడ చూసినా పోలీసులు కనిపించారు. ఉదయం ఓటర్ల స్లిప్పులు చూడటం దగ్గర నుంచి అణువణువు పరిశీలించిన తర్వాతనే పోలింగ్‌ కేంద్రాల్లోకి పంపించారు. వృద్ధులు, వికలాంగుల వాహనాలను సైతం బూత్‌ల వద్దకు అనుమతించలేదు. పోలింగ్‌ మందకొడిగా జరగటానికి పోలీసుల యాక్షన్‌ ఎక్కువ కావటం కూడా ఒక కారణమన్న ఫిర్యాదులు వచ్చాయి. మధ్యాహ్నం నుంచి పోలీసుల యాక్షన్‌ తగ్గింది.
ఓటేసిన అభ్యర్థులు
ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అఽభ్యర్థి తంగిరాల సౌమ్య నందిగామ జడ్‌పీ ఉన్నత పాఠశాల 74వ నెంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బోడపాటి బాబూరావు కంచికచర్ల పట్టణంలోని జడ్‌పీ ఉన్నత పాఠశాల 166వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులు మాతంగి పుల్లారావు వీరులపాడు మండలం చట్టన్నవరంలో, కటారపు పుల్లయ్య నందిగామ జడ్‌పీ ఉన్నత పాఠశాలలోని 80వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.


69.49 శాతం ఓట్ల పోలింగ్‌
(కంచికచర్ల)
నందిగామ ఉప ఎన్నికలో 69.49 శాతం ఓట్లు పోలయ్యాయి. పురుషులు 70.61 శాతం మంది, మహిళలు 68.42 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఓట్లు 1,84,064 కు 1,27,906 ఓట్లు పోలయ్యాయి. పురుషులు 90,732 మందికి 64,064 మంది, మహిళలు 93,308 మందికి 63,842 మంది ఓటు వేశారు. ఇతరుల ఓట్లు 24 ఉండగా, ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే ఉప ఎన్నికల్లో పోలింగ్‌ 15.49 శాతం తగ్గింది. అప్పట్లో 1,84,061 ఓట్లకు 1,56,416 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు వైసీపీ పోటీలో లేకపోవటం, కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీ ఇవ్వలేకపోవటంతో పోలింగ్‌ శాతం తగ్గిందని అంటున్నారు. ఉప ఎన్నికకు సంబంధించి వీరులపాడు మండలంలో అత్యధికంగా 76.27 శాతం పోలయ్యాయి. మండలాల వారీగా పోలింగ్‌ వివరాలు ఈవిధంగా ఉన్నాయి. చందర్లపాడు మండలంలో మొత్తం ఓట్లు 44,416కు గాను 31,989 (72.02శాతం) ఓట్లు పోలయ్యాయి. వీటిలో పురుషుల ఓట్లు 21,994కు గాను 16,123 (73.31 శాతం) ఓట్లు, మహిళల ఓట్లు 22,420కు గాను 15,866 (70.77 శాతం) ఓట్లు పోలయ్యాయి. నందిగామ మండలంలో 54,670 ఓట్లకు గాను 35,648 (65.21 శాతం) ఓట్లు పోలయ్యాయి. వీటిలో పురుషుల ఓట్లు 26,883కు గాను 17,967 (66.83 శాతం) ఓట్లు, మహిళల ఓట్లు 27,771కు గాను 17,681 (63.67 శాతం) ఓట్లు పోలయ్యాయి. వీరులపాడు మండలంలో మొత్తం ఓట్లు 34,931కు గాను 26,642 (76.27 శాతం) ఓట్లు పోలయ్యాయి. వీటిలో పురుషుల ఓట్లు 17,241కు గాను 13,319 (77.25 శాతం) ఓట్లు, మహిళల ఓట్లు 17,689కు గాను 13,323 (75.32శాతం) ఓట్లు పోలయ్యాయి. కంచికచర్ల మండలంలో మొత్తం ఓట్లు 50,047 ఓట్లకు గాను 33,627 (67.19 శాతం) ఓట్లు పోలయ్యాయి. పురుషుల ఓట్లు 24,614కు గాను 16,655 (67.66 శాతం) ఓట్లు, మహిళల ఓట్లు 25,428 ఓట్లకు గాను 16,972 (66.75 శాతం) ఓట్లు పోలయ్యాయి.
సౌమ్యకు భారీ మెజార్టీ తథ్యం : మంత్రి ఉమా
విజయవాడ సిటీ : నందిగామ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య భారీ మెజార్టీతో గెలుస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుఅన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్‌లు కూడా దక్కించుకోలేని విధంగా తిరస్కరిస్తే, సంప్రదాయాన్ని వదిలేసి కాంగ్రెస్‌ పార్టీ నందిగామలో తమ అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. అవనిగడ్డలో అంబటి బ్రాహ్మణయ్య మృతి చెందినప్పుడు ఆయన కుమారుడికి పోటీ లేకుండా చేస్తే, ఇక్కడ ఆ సంప్రదాయాన్ని వదిలేసి అభ్యర్థిని పెట్టి చివరికి అభ్యర్థికి ప్రచారం కూడా చేయకుండా ఆ పార్టీ నాయకులుగాలికి వదిలేశారన్నారు. దాదాపు 80 శాతం ఓటింగ్‌ జరిగిందంటే సౌమ్యకు భారీ మెజార్టీ ఇవ్వడానికే అక్కడి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చారన్నారు. రైతు రుణమాఫీ, డ్వాకా రుణాల రద్దుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.