Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:29AM

స్వస్థలాలకు మరో 24 మంది తెలుగు విద్యార్థులు


న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): శ్రీనగర్‌ నిట్‌ కళాశాలకు చెందిన మరో 24 మంది తెలుగు విద్యార్థులను ఏపీ ప్రభుత్వం వారివారి స్వస్థలాలకు పంపించింది. శనివారం 16 మంది విద్యార్థులు, 8 మంది విద్యార్థినుల్ని శ్రీనగర్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి, ఆ తర్వాత హైద రాబాద్‌కు తరలించారు. అక్కడి నుంచి వారివారి స్వస్థలాలకు పంపించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మో హన్‌ రావు మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల్ని రక్షిస్తోంది తామేనంటూ తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించగా.. జమ్మూకశ్మీర్‌ వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, ప్రజల్ని రక్షించి వారివారి స్వస్థలాలకు తీసుకొచ్చింది ఎవరో మీడియాకు, ప్రజలకు, బాధితులకు తెలుసునన్నారు. ఇందులో వాదనల అవసరం లేదన్నారు. వరదల సంగతి తెలియగానే స్పందించి కేంద్రంతోను, రాష్ట్ర ప్రభుత్వంతోనూ, వివిధ ప్రభుత్వ ఏజెన్సీలతోను, ఏపీ కేడర్‌కు చెందిన అధికారులతోనూ మాట్లాడి విద్యార్థులను తాము రక్షించామని చెప్పారు. ఆదిలాబాద్‌కు చెందిన వారు సైతం ఏపీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు వారిని రక్షించాలనుకుంటే ఇప్పటికీ దాదాపు 35 మంది అక్కడే చిక్కుకుని ఉన్నారని, వారిని తీసుకొచ్చేం దుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిన్నటి వరకూ 68 మంది విద్యార్థులను, నేడు 24 మంది విద్యార్థులను స్వస్థలాలకు పంపిం చామని తెలిపారు. జమ్మూకశ్మీర్‌ పర్యటనలో ఉన్న మరో 35 మంది తెలుగువారిని రక్షించాల్సి ఉందని కంభంపాటి తెలిపారు. ఇందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, వరదల్లో చిక్కుకున్న ప్రతి ఒక్క తెలుగు వారినీ ప్రాంతాలకతీతంగా రక్షించి, స్వస్థలాలకు పంపించే బాధ్యత తమదని చెప్పారు.