Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:17AM

సెల్లు మోతే!

సెల్‌ఫోన్లపై వ్యాట్‌ భారీగా పెంపు?
దుస్తులపై లెవీ విధింపు
ఈ కామర్స్‌పై ఎంట్రీ ట్యాక్స్‌
భారీ ఆదాయంపై సర్కార్‌ కన్ను

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలతో పాలనలో తనదైన ముద్ర వేయాలని చూస్తోన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం... భారీ ఆదాయం సమకూర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా వ్యాట్‌, పన్నుల ద్వారా ఆదాయం రాబట్టుకోవాలని చూస్తోంది. ఈ దిశగా వాణిజ్య పన్నుల శాఖ... ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ప్రస్తుతం సెల్‌ఫోన్లపై 5 శాతంగా ఉన్న వ్యాట్‌ను 14.5 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. వాస్తవానికి రాష్ట్ర విభజనకు కొన్ని రోజుల ముందు సెల్‌ఫోన్ల విక్రయాలపై ఉన్న వ్యాట్‌ను 14.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీనివెనుక కొన్ని శక్తులు బలంగా పనిచేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇలా పన్ను తగ్గించడం వల్ల ఏటా రూ.250 కోట్ల దాకా ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు.
సెల్‌ఫోన్‌ నిత్యావసరంగా మారి కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో... గతంలో మాదిరిగానే 14.5 శాతానికి వ్యాట్‌ను పునరుద్ధరించాలని అధికారులు సూచించారు. దీంతో ప్రభుత్వం అందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది.
ఇదేగాక ఖరీదైన వసా్త్రల(కాటన్‌ కాకుండా)పై లెవీ ట్యాక్స్‌ విధించాలనీ అధికారులు ప్రతిపాదించారు. దీనివల్ల రూ.23 కోట్ల దాకా ఆదాయం సమకూరుతుందని నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం వ్యాపారమంతా ఆన్‌లైన్‌ బాట పట్టడంతో కోట్లాది రూపాయల క్రయవిక్రయాలు దీనిద్వారా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్‌ విక్రయాలపై ఎంట్రీ ట్యాక్స్‌ వేయాలని కూడా అధికారులు ప్రతిపాదించారు. తద్వారా రూ.10 కోట్ల దాకా ఏటా అదనపు ఆదాయం సమకూరుతుందని ప్రతిపాదించారు. ఇలాంటి స్వల్పకాలిక చర్యలతో శాఖ పరిధిలో ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు. వ్యాట్‌ చట్టాన్ని సవరించడం వల్ల రూ.320 కోట్ల ఆదాయం సమకూరడంతో పాటు రూ.400 కోట్ల బకాయిలు కూడా ఖాతాకు చేరతాయని సూచించారు. కేంద్ర అమ్మకపు పన్ను నస్టపరిహారం కింద రూ.5,162 కోట్లను కేంద్రం నుంచి రాబట్టుకోవాలనీ నివేదించారు.
సమీక్షతో పన్నులు: వివిధ స్థాయిల్లో ఉన్న పెండింగ్‌ కేసుల పరిష్కారంతోనూ ఆదాయం సమకూర్చుకోవచ్చని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సూచించారు. ఏడాది పాటు కమిషనర్‌ స్థాయిలో ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా రూ.515 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని నివేదించారు. పాత బకాయిల వసూళ్ల ద్వారా సుమారు రూ.250 కోట్లు, డిఫర్‌మెంట్‌ కేసులు తేల్చడం ద్వారా రూ.104 కోట్లు, వ్యాట్‌ ఆడిట్‌, పరిశీలన ద్వారా రూ.71 కోట్లు, రిటర్న్స్‌ వెరిఫికేషన్‌ ద్వారా రూ.52 కోట్లు, ఏడీసీ కేసులతో రూ.16 కోట్లు, హైకోర్టు కేసులతో రూ.5 కోట్లు, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసులతో రూ.4కోట్లు, రివిజన్స్‌ ద్వారా రూ.1.9 కోట్లు, ట్రిబ్యునల్‌ కేసులతో రూ.1.5 కోట్లు వస్తాయని వివరించారు.
రిటర్న్స్‌ సమర్పించే విషయంపైనా అధికారులు దృష్టి సారించారు. ప్రతి నెల 20వ తేదీన రిటర్న్స్‌ దాఖలు చేస్తుంటారు. కొనుగోళ్లు, అమ్మకాలకు మధ్య అంతరాలు భారీగా కనిపిస్తున్నాయంటున్న అధికారులు... దీన్ని కట్టుదిట్టం చేస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని సూచించారు. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు, అమ్మకాల బిల్లులను రిటర్న్స్‌తో పాటే సమర్పించేలా విధాన నిర్ణయం తీసుకోనున్నారు.