Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:17AM

పెద్దాపూర్‌, గంగాపూర్‌లలో... పోలింగ్‌ బహిష్కరణ

గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదంటూ ఆగ్రహం
పెద్దాపూర్‌లో ఐదు గంటల పాటు నిలిచిన పోలింగ్‌
ఆస్పత్రికి తరలించే లోపే చిన్నారి మృతి
గ్రామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ గంగాపూర్‌వాసుల ఆవేదన
అధికారుల హామీతో పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లు

వెల్దుర్తి: గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదంటూ వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దాపూర్‌ గ్రామస్థులు శనివారం జరిగిన మెదక్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామంలో ఉదయం 6 గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభమైనా 9 గంటల సమయంలో ఓటేసేది లేదంటూ స్థానికులు భీష్మించారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు చేరుకోలేక ఎందరో ప్రాణాలు కోల్పోయారని వారు ఆగ్రహించారు. కొన్నేళ్లుగా సమస్యను పరిష్కరించాలని పాలకులు, అధికారులకు విన్నవించినప్పటికి పట్టించుకోలేదన్నారు. అందుకే.. ఓటింగ్‌లో పాల్గొనేది లేదంటూ గ్రామస్థులంతా ఆందోళన చేపట్టారు. పెద్దాపూర్‌ నుంచి మండల కేంద్రానికి వెళ్లాలంటే మూడు కిలో మీటర్లు.., గ్రామపంచాయతీకి వెళ్లాలంటే కిలోమీటరున్నర బురదమయమైన రోడ్డుపై కాలినడకన వెళ్లాల్సిందేనని వాపోయారు.
రోడ్డు సౌకర్యం లేక చిన్నారి మృతి...
గ్రామానికి చెందిన కొల్చెమ నర్సింలు-లక్ష్మీ దంపతుల ఐదు నెలల కుమార్తె నవీన అనారోగ్యానికి గురవడంతో శుక్రవారం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108కు సమాచారం అందించారు. అయితే, రోడ్డు బాగోలేదని గ్రామానికి రావడానికి వారు నిరాకరించారని, ఆటోలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారు అసలు ఆ గ్రామం వైపే రామంటూ తెలిపారన్నారు. దీంతో మెల్లూరు వరకు కాలినడకన, వెల్దుర్తి వరకు ఆటోలో వెళ్లగా, ఆ లోపే చిన్నారి ప్రాణాలు విడిచిందని కంటతడి పెట్టారు. తమ గ్రామం మండల కేంద్రానికి కొద్ది దూరంలోనే ఉన్నా ఎన్నో ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యం.. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిశాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు కనువిప్పు కలగాలనే ఓటింగ్‌ను బహిష్కరించినట్లు వారు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వెల్దుర్తి తహసీల్దార్‌ రమాదేవి అక్కడకు వెళ్లి కలెక్టర్‌ ఆదేశాల మేరకు వచ్చానని వారం రోజుల్లో గ్రామానికి రోడ్డు వేయించేందుకు నిధులు మంజూరు చేయిస్తానని, గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని, మరికొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఓటర్లకు నచ్చజెప్పడంతో గ్రామస్థులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. సంఘటనా స్థలాన్ని తూప్రాన్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ సంజయ్‌కుమార్‌ సందర్శించారు. ఎస్‌ఐ వీరబాబు, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నర్సింలు, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, మెల్లూరు సర్పంచ్‌ పుష్పమ్మ తదితరులు గ్రామస్థులకు ఓటు హక్కు వినియోగించుకోవాలని సముదాయించారు.
గంగాపూర్‌ గ్రామంలో...
ములుగు: ములుగు మండలం గంగాపూర్‌ గ్రామస్థులు శనివారం మెదక్‌ ఉప ఎన్నికను బహిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలోనే గ్రామానికి వచ్చి, ఆ తర్వాత మాకు కనబడడం లేదని, అందుకే ఈ ఎన్నికను బహిష్కరించామన్నారు. గ్రామంలో 250 ఓట్లు ఉండగా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని, 150 ఓట్లు ఉన్న పక్క గ్రామమైన యూసుఫ్‌గాన్‌పల్లిలో బూత్‌ను ఏర్పాటు చేశారని, ఇలా ప్రతి విషయంలో గంగాపూర్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఓఎస్‌డీ హన్మంతరావు ఆ గ్రామానికి చేరుకుని ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గంగాపూర్‌కు మురుగుకాలువలు, సీసీ రోడ్లు, ప్రత్యేకంగా రేషన్‌షాపును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓఎస్‌డీ హన్మంతరావు మాట్లాడుతూ నెల లోపే రేషన్‌ షాపును ఏర్పాటు చేస్తామని, మిగతా పనులపై చర్యలు చేపడుతామని, ఈ ఉప ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరడంతో గ్రామస్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓఎస్‌డీ వెంట ఎమ్మార్వో లావణ్య, ఎస్‌ఐ శ్రీశైలం తదితరులున్నారు.