Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:55AM

ఆక్వా.. భారం

విపరీతంగా పెరిగిన పెట్టుబడులు
ఎకరా చెరువుకు రూ.4లక్షలు.. లీజు అదనం
వరి సాగులో నష్టాలు భరించలేని రైతులు పంట భూములను చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. ప్రస్తుతం డెల్టా ప్రాంతమంతటా ఆక్వా సాగు విస్తరించింది. చేపలు, రొయ్యల ధరలు కొంత ఆశాజనకంగా ఉండడంతో పలుచోట్ల చెరువులు తవ్వకం మొదలైంది. 2012 తరువాత ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ రంగంలో కూడా పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయి. మార్కెట్‌ ధరల మేరకు ఒక ఎకరం చేపల చెరువు తవ్వి పంట దిగుబడి వచ్చేసరికి రూ.3లక్షల వరకు పెట్టుబడి అవసరం. రొయ్యల చెరువులకు మరో రూ.లక్ష అదనం. లీజు భూములు అయితే మరో రూ.50 నుంచి రూ. 70 వేలు అదనం.
భీమవరం: ఇటీవల డెల్టా ప్రాంతంలో ఆక్వా సాగు శరవేగంగా విస్తరించిస్తోంది. మాగాణి భూములన్నీ చెరువులుగా మార్చేస్తున్న రైతులు సాగు ప్రారంభించే సరికి అమ్మో ఇంత ఖర్చా అని బెంబేలెత్తుతున్నారు. ఒక ఎకరం చెరువు తవ్వాలంటే అనుమతి పొందడం నుంచి ఖర్చులు ప్రారంభం. ఒక ఎకరం చెరువు తవ్వకానికి అనుమతి పొందేసరికి రూ.15వేలకు పైగా ఖర్చవుతోంది. అక్కడి నుంచి ఎక్స్‌కవేటర్‌తో చెరువు తవ్వడం, పంపింగ్‌ కోసం పైపులు, నీరు తోడడం, విద్యుత్‌ సౌకర్యం, అక్కడి నుంచి చేప, రొయ్య పిల్లలు వేయడంతో పెట్టుబడి భారం అనిపిస్తుంది. తర్వాత వైరస్‌, తెగుళ్ల పరీక్షలు, మందులు, ఆక్సిజన్‌, కూలీల పెట్టుబడి తడిసిమోపెడవుతుంది. ఈ ప్రక్రి య పూర్తయ్యేసరికి సొంత భూమి గల రైతుకు ఒక ఎక రా చేపల చెరువుకు రూ.2లక్షలు పెట్టుబడి అవుతోంది. రొయ్యల చెరువు రైతు రూ.3లక్షల వరకు పెట్టుబడి అవసరం కాగా లీజుకు తీసుకుంటే రూ.50 వేల నుంచి రూ. 70 వేలు అదనం.
మేత, ప్రొబయోటిక్స్‌ భారమే..
పిల్లలు వేసిన తరువాత వాటిని పెంచేందుకు పెట్టుబడులు భారీగానే ఉంటున్నాయి. ఇవికూడా ఎకరాకు సుమా రు రూ.70వేల వరకు ఖర్చు అవుతోందని లెక్కలు చెబుతున్నాయి. విద్యుత్‌ నిర్వహణ, ఏరియేటర్లు, ఇతర సాంకేతిక పరికరాలు, డీజిల్‌ ఖర్చు, రోజువారీ నిర్వహణకు పెట్టుబడి, వాటికి మేత, వ్యాధులు సోకుండా యాంటిబయోటిక్స్‌, వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు అదనంగా ప్రొబయోటిక్స్‌ వంటివి పెట్టుబడులు పెట్టాల్సిందే. ఇవన్నీ కూడా లెక్కించుకుంటే రూ.70వేలకు పైగానే ఖర్చు అవుతున్నట్లు లెక్కలు వేస్తున్నారు. ఒక ఎకరం పొలాన్ని చెరువుగా మారిస్తే సరాసరిగా రైతు రూ.4లక్షలు పెట్టుబడి పెట్టక తప్పదని లెక్కలు చెబుతున్నాయి.